థాయ్ లాండ్ లో ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేయకూడదో తెలుసుకోండి
ఏ ప్రాంతానికి టూర్ వెళ్ళినా ఆ ప్రాంతంలోని స్థానిక విషయాల గురించి కొంత అవగాహన ఉండాలి. లేదంటే అక్కడి ప్రజల చేతుల్లో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. థాయ్ లాండ్ కి టూరిస్టులు ఎక్కువగా వెళ్తుంటారు. అందమైన సముద్ర తీరాలు, బుద్ధుడి ఆలయాలు, థాయ్ సంస్కృతి బాగా ఆకర్షిస్తాయి. అక్కడికి వెళ్ళే వారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. బుద్ధుడి ప్రతిమతో ఫోటో దిగేటపుడు జాగ్రత్త: థాయ్ లాండ్ లో బుద్ధిజం ఎక్కువ. అందుకే రోడ్లమీద ఎక్కువగా బుద్ధ ప్రతిమలు కనిపిస్తాయి. బుద్ధ ప్రతిమల మీద చేతులు వేసి, బుద్ధుడి ఆకారాలను అనుకరిస్తూ ఫోటో దిగవద్దు. అనుమతి లేకుండా బౌద్ధ సన్యాసులను ఫోటో తీయవద్దు. అలాగే సన్యాసులతో ఉన్నప్పుడు వాళ్లెలా కూర్చుంటారో అలాగే కూర్చోవాలి.
చర్మం కనిపించేలా బట్టలు వేసుకుని ఆలయాలకు వెళ్ళకూడదు
థాయ్ లాండ్ లోని ఆలయాలకు వెళ్లేటపుడు మీ చర్మం కనిపించకుండా కవర్ చేసే బట్టలు ధరించాలి. షార్ట్స్, స్కర్ట్స్ వేసుకుని వెళ్తే ఆలయ ప్రాంగణం కలుషితం అవుతుందని అక్కడి ప్రజల నమ్మకం. పబ్లిక్ రొమాన్స్ వద్దు: ఇతర ఆసియా దేశాల వలే థాయ్ లాండ్ లో పబ్లిక్ రొమాన్స్ కి అనుమతి లేదు. ఆడా మగా పబ్లిక్ లో మరీ కలుపుకోలుగా ఉండకూడదు. రెస్టారెంట్ కి వెళ్ళినా, థీమ్ పార్క్ కి వెళ్ళినా దూరం పాటించండి. అశ్లీల నృత్య ప్రదర్శనలకు వెళ్ళవద్దు: పింగ్ పాంగ్ షోస్ అని పిలవబడే అశ్లీల నృత్య ప్రదర్శనల్లో మోసాలు జరుగుతాయి. టికెట్ ఫ్రీ అని చెప్పి వెళ్ళిన తర్వాత ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టేలా చేస్తారు.