Womens Day 2026: మహిళా దినోత్సవం స్పెషల్.. ఈ ఏడాది థీమ్ ఏంటి? దేశవ్యాప్తంగా ఉచిత సేవలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఏళ్లుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. మహిళలు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో చేసిన సేవలకు గుర్తింపుగా ఈ ప్రత్యేక దినాన్ని జరుపుకుంటారు. సమాజంలో మహిళలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించాలనే అవగాహన పెంచడంలో ఈ రోజు కీలక పాత్ర పోషిస్తోంది. మహిళలు ప్రతి రంగంలో ముందుకు రావడానికి అవకాశాలు కల్పించడం సమాజ బాధ్యత. సంస్థలు, కార్యాలయాలు, కమ్యూనిటీల్లో వారికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. మహిళలకు అవకాశం ఇవ్వడం అంటే ఎవరికైనా తగ్గించడం కాదు.. అవకాశాలను విస్తరించడం అనే అర్థం.
Details
అంతర్జాతీయ మహిళా దినోత్సవం చరిత్ర
అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఆరంభం 1900ల ప్రారంభంలో అమెరికాలో జరిగింది. ఆ కాలంలో మహిళలు ఎక్కువ పని గంటలు చేయాల్సి వచ్చేది, కానీ వారికి తక్కువ వేతనాలు మాత్రమే ఇచ్చేవారు. వారి పరిస్థితి చాలా దయనీయంగా ఉండటంతో మహిళలు నిరసనలు ప్రారంభించారు. తమ పనికి తగిన వేతనం ఇవ్వాలని, పని వేళలను తగ్గించాలని, అలాగే ఓటు హక్కు కల్పించాలని వారు పోరాటాలు చేశారు. ఈ నేపథ్యంలో 1910లో అమెరికాలోని సోషలిస్టు పార్టీ 'నేషనల్ ఉమెన్స్ డే'ను ప్రారంభించింది. ఆ కార్యక్రమంలో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్ వంటి దేశాలు కూడా భాగస్వామ్యమయ్యాయి.
Details
వివిధ సంస్థల్లో మహిళా దినోత్సవ వేడుకలు
తరువాత 1975లో ఐక్యరాజ్య సమితి అధికారికంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గుర్తించింది. 1977 నుంచి ప్రతి సంవత్సరం మార్చి 8న ఈ దినాన్ని ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, వివిధ సంస్థల్లో కూడా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. మహిళలకు సమాన హక్కులు, విద్య, అవకాశాలు కల్పించడం, వారిపై హింసను నివారించడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
Details
అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2026 థీమ్
ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవాన్ని ఒక ప్రత్యేక థీమ్‌తో జరుపుకుంటారు. 2026 సంవత్సరానికి మహిళల సాధికారత, సమానత్వం, నాయకత్వం వంటి అంశాలను ప్రోత్సహించే విధంగా థీమ్‌ను రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి సమాజంలో మార్పు తీసుకురావడమే దీని ప్రధాన లక్ష్యం. ఈసారి ప్రత్యేక థీమ్ 'Give To Gain'. అంటే ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ కలిసి ముందుకు సాగడం ద్వారా అందరూ ప్రయోజనం పొందాలని సూచిస్తుంది.
Details
మన దేశంలోని పథకాలు
భారతదేశంలో కూడా మహిళల సాధికారత కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారు. వాటిలో 'బేటి బచావో - బేటి పడావో', ప్రధానమంత్రి ముద్ర యోజన వంటి కార్యక్రమాలు ముఖ్యమైనవి. ఈ పథకాల ద్వారా మహిళలకు విద్య, ఆర్థిక స్వాతంత్రం కల్పించడంపై దృష్టి పెట్టారు. మహిళల అభివృద్ధి కోసం సెమినార్లు, ర్యాలీలు నిర్వహిస్తూ అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు.
Details
మహిళలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు
ఇదిలా ఉండగా మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలోని సుమారు 46 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలకు ఈ సదుపాయం కల్పించనున్నారు. ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహ వెల్లడించారు. ప్రతి మహిళకు సుమారు 30 రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియను మొత్తం ఆరు నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పరీక్షల అనంతరం అన్ని వివరాలతో కూడిన 'డిజిటల్ హెల్త్ ప్రొఫైల్'ను కూడా రూపొందించనున్నారు.