ప్రపంచ ధరిత్రి దినోత్సవం 2023: చరిత్ర, తెలుసుకోవాల్సిన విషయాలు
ప్రతీ సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీన ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని జరుపుతారు. తరువాతి తరాల కోసం భూమిని కాపాడేందుకు, అందుకోసం చేయాల్సిన పనులపై అవగాహన కల్పించేందుకు ఈరోజును జరుపుకుంటారు. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ భూమికి అనేక సవాళ్ళు ఎదురవుతున్నాయి. వాతావరణ కాలుష్యం, భూమి కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ మొదలగు వాటివల్ల భూమి నాశనం అవుతోంది. భూమి కాలుష్యం పెరిగితే భూమి మీద మనిషి మనుగడ కష్టంగా మారుతుంది. అందుకే మనల్ని మోసే ధరిత్రిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచ ధరిత్రి దినోత్సవం ఎలా మొదలైంది: మొదటగా, 1969లో యునెస్కో సమావేశంలో జాన్ మెకానెల్ అనే యాక్టివిస్ట్ ఎర్త్ డే గురించి మాట్లాడారు.
1990లో ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ ధరిత్రి దినోత్సవం
1970లో మొట్ట మొదటిసారిగా అమెరికాలో ఏప్రిల్ 22వ తేదీన ఎర్త్ డే ని జరుపుకున్నారు. ఆ తర్వాత 1990లో డేనిస్ హాయెస్ తీసుకున్న చర్యల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 141దేశాలు ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని జరుపుకున్నాయి. వరల్డ్ ఎర్త్ డే థీమ్: ఈ సంవత్సరం, మన భూమి మీద పెట్టుబడి పెట్టండి అన్న థీమ్ ని ఎంచుకున్నారు. అంటే ఈరోజు మనం భూమి మీద పెట్టే శ్రద్ధ రేపటి తరాలకు వరంగా మారి, జీవించడానికి అనుకూలంగా ఉంటుంది. లేదంటే భూమి మీద జీవించడం కష్టంగా మారే అవకాశం ఉంది.
వరల్డ్ ఎర్త్ డే రోజున చేయాల్సిన పనులు
మీ ఇంటి దగ్గర్లోని పార్కును లేదా ఇంటి పరిసరాలను శుభ్రం చేయండి. చెత్తను చెత్తబుట్టలో తప్ప బయట పారవేయద్దని సలాహా ఇవ్వండి. మీరు కూడా పాటించండి. మీ ఇంట్లో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. అత్యవసరం అనుకుంటే తప్ప ప్లాస్టిక్ వాడవద్దు. మీ పిల్లలకు ధరిత్రి దినోత్సవం గురించి తెలియజేయండి. వీలైతే ఒక మొక్కను నాటండి. మీరు అపార్ట్ మెంట్లో ఉండేవారైతే ఒక పూలకుండీలో మొక్కను పెంచండి. క్రిమిసంహారకాలు ఎక్కువగా వాడకూడదని ప్రామిస్ చేయండి. క్రిమి సంహారకాల వల్ల భూమి దెబ్బ తింటుంది. దానివల్ల పంటలు పండడం కష్టమవుతుంది.