అంతర్జాతీయ చారిత్రక కట్టడాల దినోత్సవం 2023: చరిత్ర, తెలుసుకోవాల్సిన విషయాలు
అంతర్జాతీయ చారిత్రక కట్టడాల దినోత్సవాన్ని ప్రతీ ఏడాది ఏప్రిల్ 18వ తేదీన జరుపుతారు. చారిత్రక కట్టడాలు, ప్రాంతాలను కాపాడటంలో అవగాహన పెంచేందుకు ఈ రోజును జరుపుతారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతుల వారసత్వాన్ని కాపాడటానికి, తర్వాతి తరాలకు అందించడానికి వరల్డ్ హెరిటేజ్ డే ను జరుపుకోవాలని అంతర్జాతీయ చారిత్రక కట్టడాలు, ప్రాంతాల సంగం(ICOMOS) 1982లో ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది. ఆ తర్వాత ఐక్యరాజ్యసమితి 1983లో ఆమోదముద్ర వేసింది. అప్పటినుండి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 18వ తేదీన అంతర్జాతీయ చారిత్రక కట్టడాల దినోత్సవాన్ని జరుపుతున్నారు. ప్రపంచంలోని చారిత్రక కట్టడాలను రక్షించడంలో తమ వంతు పాత్ర పోషించాలని, దానివల్ల వివిధ సంస్కృతులను కాపాడాలని పౌరులకు అవగాహన కల్పిస్తారు.
2023లో థీమ్ ఏంటంటే
ప్రతి ఏడాది అంతర్జాతీయ చారిత్రక కట్టడాల దినోత్సవానికి థీమ్ మారుతూ ఉంటుంది .అలాగే ఈ సంవత్సరం "వారసత్వం మారుతుంది" అనే థీమ్ ని ఎంచుకున్నారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా చాలా కార్యక్రమాలు జరుగుతాయి. కొన్నిచోట్ల ఎగ్జిబిషన్స్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంతర్జాతీయంగా పేరు పొందిన చారిత్రక కట్టడాలను ప్రపంచ వారసత్వం సంపదగా యునెస్కో గుర్తిస్తుంది. ఐక్యరాజ్యసమితిలో భాగమైన యునెస్కో, చారిత్రక కట్టడాలను పరిరక్షిస్తుంది. వాతావరణంలోని మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు మొదలగు వాటి వల్ల చారిత్రక కట్టడాలు కనుమరుగై పోకుండా ఉండేందుకు తన వంతు కృషి చేస్తుంది యునెస్కో. ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేరిన భారతదేశ చారిత్రక కట్టడాలు తాజ్ మహల్,అజంతా గుహలు,సాంచిలోని బౌద్ధ స్తూపాలు,ఎల్లోరా గుహలు.. ఇంకా చాలా ఉన్నాయి.