ప్రపంచ పెంగ్విన్ దినోత్సవం: ఆడ పెంగ్విన్ లను ఆకర్షించడానికి బహుమతులిచ్చే మగ పెంగ్విన్ విశేషాలు
పెంగ్విన్ లు చాలా క్యూట్ గా ఉంటాయి. ఎగరలేని ఈ సముద్రపు పక్షులు అత్యంత శీతల ప్రాంతంలో మాత్రమే కనిపిస్తాయి. ప్రస్తుతం పెంగ్విన్ లు అంతరించిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పెంగ్విన్ లపై అవగాహన కల్పించడానికి ప్రపంచ పెంగ్విన్ దినోత్సవాన్ని ప్రతీ సంవత్సరం ఏప్రిల్ 25వ తేదీన జరుపుతున్నారు. పెంగ్విన్ ల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. దక్షిణార్థగోళంలోనే ఎక్కువగా కనిపిస్తాయి: పెంగ్విన్ లు ఎక్కువగా దక్షిణార్థగోళంలోనే కనిపిస్తాయి. అంటార్కిటికా ప్రాంతంలో పెంగ్విన్ లు జీవిస్తుంటాయి. సీజన్ వచ్చినప్పుడల్లా కొత్త భాగస్వామిని వెతుక్కుంటాయి: సంతానోత్పత్తి సీజన్ లో పెంగ్విన్ లు తమ భాగస్వామిని ఎంచుకుంటాయి. సీజన్ ముగిసేవరకు ఆ భాగస్వామితోనే ఉంటాయి. మళ్ళీ కొత్తగా సీజన్ మొదలైతే కొత్త భాగస్వామిని వెతుక్కుంటాయి.
గులకరాళ్ళను బహుమతిగా ఇచ్చే మగ పెంగ్విన్
ఆడ పెంగ్విన్ లకు బహుమతులు: ఆడ పెంగ్విన్ లను ఆకర్షించడానికి మగ పెంగ్విన్ లు గులకరాళ్ళను బహుమతిగా ఇస్తాయి. నున్నగా ఉండే గులకరాళ్ళు, ఆడ పెంగ్విన్ లకు నచ్చితే, అవి మగ పెంగ్విన్ లతో జత కడతాయి. దూరాలు నడిచే పెంగ్విన్: పెంగ్విన్ లు చాలా దూరం నడవగలవు. 60మైళ్ళు అంటే దాదాపు 96కిలోమీటర్లు నడవగలవు. ఆహారం కోసం ఎంత దూరాన్నైనా, ఎలాంటి ప్రాంతాల్లోనైనా అవి ప్రయాణం చేయగలవు. పెంగ్విన్ కాళ్ళు ఈత కొట్టడానికి అనువుగా ఉంటాయి. ప్రపంచంలోని చిన్న పెంగ్విన్: పెంగ్విన్ లలో చాలా రకాలుంటాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తీర ప్రాంతాల్లో 12-14సెంటిమీటర్ల పెంగ్విన్ లు దర్శనమిస్తాయి. ఇలాంటి చిన్న పెంగ్విన్ లు నీటిలోపల ఎక్కువగా ఉంటాయి.