World Pharmacists Day 2023: ఔషధ నిపుణుల దినోత్సవం గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
ప్రతీ ఏడాది సెప్టెంబర్ 25వ తేదీన ప్రపంచ ఔషధ నిపుణులు దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఔషధ నిపుణుల సేవలను గుర్తించడానికి ఈరోజును జరుపుతున్నారు. ప్రపంచ ఆరోగ్యాన్ని బలోపేతం చేయడంలో ఔషధ నిపుణుల పాత్ర గురించి అవగాహన కల్పించే కార్యక్రమాలు ఈరోజు నిర్వహిస్తారు. ప్రతీసారీ ఔషధ నిపుణుల దినోత్సవానికి ప్రత్యేక థీమ్ ఉంటుంది. "ఆరోగ్య సంస్థలను ఫార్మసీలు బలోపేతం చేస్తాయి" అనే థీమ్ తో ప్రపంచ ఫార్మాసిస్ట్ డే ని జరుపుతున్నారు. చరిత్ర: ప్రపంచ ఔషధ నిపుణుల దినోత్సవం 2009లో ప్రారంభమైంది. టర్కీలోని ఇస్తాంబులో లో జరిగిన ఇంటర్నేషనల్ ఫార్మాస్యూటికల్ ఫెడరేషన్ కాంగ్రెస్ (FIP) సమావేశంలో ఈరోజును ప్రారంభించారు.
ఆరోగ్య రంగంలో ఔషధ నిపుణుల పాత్ర
ఆరోగ్య రంగంలో ఔషధ నిపుణుల పాత్ర గురించి అందరికీ తెలియజెప్పడానికి ఈరోజును స్థాపించారు. ప్రతీ ఏడాది ఔషధ నిపుణుల దినోత్సవానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను ఇంటర్నేషనల్ ఫార్మాస్యూటికల్ ఫెడరేషన్ కాంగ్రెస్ చూసుకుంటుంది. థీమ్ ని కూడా FIP నిర్ణయిస్తుంది. ఔషధాల వాడకంలో ఫార్మాసిస్టులు సాధారణ జనాలకు సాయం చేస్తారు. అలాగే ఔషధాలను సురక్షితంగా ఎలా ఉపయోగించాలో తెలియజేసి ఆరోగ్యాన్ని సంరక్షించడంలో తోడ్పడతారు. ఆరోగ్య రంగం సవ్యంగా నడవాలంటే ఫార్మాసిస్టుల అవసరం ముఖ్యం. ఆరోగ్య రంగంలో ఫార్మాసిస్టుల పాత్ర అధికంగా ఉంటుంది. అందుకే వరల్డ్ ఫార్మాసిస్ట్ డే రోజున ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఔషధ నిపుణుల సేవలను గుర్తించి, తగిన సత్కారాలు చేస్తారు.