ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
ప్రతీ ఏడాది ఆగస్టు 19వ తేదీన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఫ్రెంచ్ శాస్త్రవేత్తలైన లూయిస్ డాగురె ఇంకా జోసెఫ్ నైస్ ఫోర్ ఇద్దరు కలిసి 1837వ సంవత్సరంలో ఫోటోగ్రాఫిక్ ప్రాసెస్ ని అభివృద్ధి చేశారు. ఈ పద్ధతికి డాగురో టైప్ అనే పేరు పెట్టారు. డాగురో టైప్ ప్రక్రియలో సెన్సిటివ్ ఉపరితలం నుండి కాంతిని ఉపయోగించి ఫోటోలను తీస్తారు. 1839 ఆగస్టు 19వ తేదీన ఫ్రెంచ్ ప్రభుత్వం డాగురోటైప్ ప్రక్రియకు పేటెంట్ హక్కులను అందించింది. అప్పటినుండి ప్రతీ ఏడాది ఆగస్టు 19వ తేదీన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుతున్నారు.
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం రోజున చేయాల్సిన పనులు
ఫోటోగ్రఫీ అనేది ఒక కళ. గడిచిపోయిన సంఘటనలను మళ్ళీ గుర్తు చేసేదే ఫోటో. టెక్నాలజీ పెరగడంతో ఫోటోగ్రఫీలో చాలా మార్పులు వచ్చాయి. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం రోజున ఫోటోగ్రఫీలో వచ్చిన మార్పుల గురించి చర్చలు జరగాలి. సాధారణంగా ఈ రోజున ప్రపంచంలోని ఫోటోగ్రాఫర్లందరూ తమ తమ సోషల్ మీడియా పేజీల్లో ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు పంచుకుంటూ ఉంటారు. అలాగే తాము దించిన ఫోటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తుంటారు. ఈ రోజున ఫోటోగ్రఫీకి సంబంధించిన వర్క్ షాప్స్ నిర్వహించాలి. ఫోటోగ్రఫీ మీద అవగాహన కల్పించడం, మెళకువలు నేర్పించడం, వివిధ రకాల స్టైల్స్ లో ఫోటోలను దించడం వంటి విషయాలపై నైపుణ్యం కలిగించేందుకు వర్క్ షాప్ లు ఎగ్జిబిషన్స్ నిర్వహించాలి.