ప్రపంచ స్కిజోఫ్రీనియా దినోత్సవం: ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో మీకు తెలుసా?
స్కిజోఫ్రీనియా అనేది మానసిక రుగ్మత. ఈ రుగ్మతతో బాధపడేవారు నిజానికి ఊహకు తేడా తెలియని స్థితిలో ఉంటారు. కొన్నిసార్లు వీళ్ళకి ఏవో శబ్దాలు వినిపిస్తాయి. ఎవరెవరో కనిపిస్తారు. మెదడులో రసాయనాల అసమతుల్యత కారణంగా ఇలాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఈ రోజు ప్రపంచ స్కిజోఫ్రీనియా దినోత్సవం. స్కిజోఫ్రీనియా మీద అవగాహన కలిగించడానికి, అనుమానాలను పోగొట్టడానికి, చికిత్స గురించి అందరికీ తెలియజేయడానికి ప్రతీ ఏడాది మే 24వ తేదీన ప్రపంచ స్కిజోఫ్రీనియా దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా 24మిలియన్ల మంది స్కిజోఫీనియాతో బాధడుతున్నారు. ప్రస్తుతం ఈ రుగ్మతకు సంబంధించిన విషయాలను తెలుసుకుందాం.
స్కిజోఫ్రీనియా లక్షణాలు
ఈ రుగ్మతతో బాధపడేవారు మనుషులకు, కుటుంబానికి దూరంగా ఉంటారు. ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు. వీళ్ళ ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. యాంగ్జాయిటీ, నిద్ర సరిగా ఉండకపోవడం, అనవసర ఒత్తిడి ఉంటుంది. వీళ్ళకు భ్రమలు ఎక్కువగా ఉంటాయి. అవాస్తవాలను నమ్ముతుంటారు. వింత వింత శబ్దాలు వినిపించడం, ఏవేవో కనిపించడం లాంటి భ్రమలు కలుగుతాయి. మాట సరిగ్గా రాకపోవడం, ఏదైనా చెప్పాలనుకుంటే తడబడటం జరుగుతుంటుంది. వీళ్ళలో శక్తి ఎక్కువగా ఉండదు. ఏదైనా పనిచేయాలంటే ఫోకస్ చేయలేరు. వ్యక్తిగత శుభ్రత పాటించరు. పై లక్షణాలన్నీ స్కిజోఫ్రీనియాతో బాధపడే వారిలో కనిపిస్తాయి.
రావడానికి కారణాలు, చికిత్స
స్కిజోఫ్రీనియా రావడానికి జన్యు సమస్యలు ఒక కారణంగా నిలుస్తాయి. తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఈ రుగ్మత ఉంటే, పిల్లలకు వచ్చే అవకాశం ఉంది. గర్భంలో ఉండగా మెదడు సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం, అధిక ఒత్తిడిలో పనిచేస్తే కూడా ఈ రుగ్మత వచ్చే అవకాశం ఉంది. చికిత్స: స్కిజోఫ్రీనియా లక్షణాలను తొందరగా గుర్తిస్తే మెడిసిన్లతో ఈ రుగ్మత నుండి బయటపడే అవకాశం ఉంది. స్కిజోఫ్రీనియా లక్షణాలు మరీ ఎక్కువగా ఉన్నట్లయితే జీవితాతం, మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉంది. సాధారణంగా స్కిజోఫ్రీనియాతో బాధపడేవారికి యాంటీసైకోటిక్ వైద్యం అందిస్తారు. అలాగే ఫ్యామిలీ థెరపీ, ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ, వొకేషనల్ రిహబిలిటేషన్ మొదలైన ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి.