Loading...
Cancer: క్యాన్సర్‌కు కారణమవుతున్న ఇన్ఫెక్షన్లు.. చాలా వరకు నివారించొచ్చట!
క్యాన్సర్‌కు కారణమవుతున్న ఇన్ఫెక్షన్లు.. చాలా వరకు నివారించొచ్చట!

Cancer: క్యాన్సర్‌కు కారణమవుతున్న ఇన్ఫెక్షన్లు.. చాలా వరకు నివారించొచ్చట!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 06, 2026
04:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న క్యాన్సర్ కేసుల్లో సుమారు 8లో ఒకటి ఇన్ఫెక్షన్లతో ముడిపడి ఉన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. వీటిలో చాలా వరకు వ్యాక్సిన్లు,స్క్రీనింగ్,పరీక్షలు,సకాలంలో చికిత్స ద్వారా నివారించగలిగేవేనని పరిశోధకులు చెబుతున్నారు. ది లాన్సెట్ ఆంకాలజీలో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం.. 2024లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 23లక్షల కొత్త క్యాన్సర్ కేసులకు ఇన్ఫెక్షన్లు కారణమయ్యాయి. ఇది మొత్తం క్యాన్సర్ కేసుల్లో దాదాపు 12శాతానికి సమానం.ఈ కేసుల్లో ప్రధానంగా రెండు ఇన్ఫెక్షన్లు కీలక పాత్ర పోషించాయి. హెలికోబాక్టర్ పైలోరీ(H. pylori)కారణంగా ఎక్కువగా కడుపు క్యాన్సర్లు,హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV)కారణంగా ప్రధానంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. ఈ రెండు ఇన్ఫెక్షన్లు కలిపి 2024లో 15లక్షలకు పైగా క్యాన్సర్ కేసులకు కారణమయ్యాయని పరిశోధకులు అంచనా వేశారు.

వివరాలు 

హెపటైటిస్‌-బి, సి.. ఈబీవీతోనూ క్యాన్సర్ ముప్పు

ఇక హెపటైటిస్-బి (HBV) దాదాపు 3.6 లక్షల క్యాన్సర్ కేసులతో సంబంధం కలిగి ఉండగా.. వీటిలో ఎక్కువగా కాలేయ క్యాన్సర్ కేసులే ఉన్నాయి.

ఎప్స్టీన్-బార్ వైరస్ (EBV) సుమారు 2.6 లక్షల కేసులకు, హెపటైటిస్-సి (HCV) దాదాపు 1.6 లక్షల కేసులకు కారణమయ్యాయి.

HCVతోనూ ప్రధానంగా కాలేయ క్యాన్సర్ ముడిపడి ఉంది. ఈ ఇన్ఫెక్షన్ ఆధారిత క్యాన్సర్ భారం ప్రపంచవ్యాప్తంగా సమానంగా లేదని అధ్యయనం తెలిపింది.

తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లోనే 77 శాతం కేసులు నమోదయ్యాయి. వ్యాక్సిన్లు, స్క్రీనింగ్, పరీక్షలు, చికిత్స అందుబాటులో ఉండటంలో ఉన్న తేడాలు ఇందుకు కారణమని పరిశోధకులు పేర్కొన్నారు.

వివరాలు 

క్యాన్సర్ ముప్పును తగ్గించే మార్గాలు ఇవే..

ఇన్ఫెక్షన్ సోకిందంటే క్యాన్సర్ వస్తుందని కాదు. చాలా మందిలో క్యాన్సర్ అభివృద్ధి చెందదు.

అయితే ఇన్ఫెక్షన్ దీర్ఘకాలం కొనసాగడం, వయసు, రోగనిరోధక శక్తి, ధూమపానం, జన్యుపరమైన అంశాలు వంటి ఇతర కారణాలతో కొందరిలో క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది.

HPV, హెపటైటిస్-బికి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. H. pylori, హెపటైటిస్-సికి పరీక్షలు, చికిత్సలు ఉన్నాయి.

హెపటైటిస్-సిని గుర్తించి చికిత్స చేయడం, H. pyloriకి యాంటీబయాటిక్స్ ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పును తగ్గించవచ్చు.

సురక్షిత ఇంజెక్షన్ పద్ధతులు, కండోమ్ వినియోగం, HIV నివారణ చర్యలు కూడా ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు తెలిపారు.

ADVERTISEMENT