Loading...
Artificial Sun: చైనా కృత్రిమ సూర్యుడు.. ఆశ్చర్యపరిచే సంఖ్యలు,అద్భుతమైన సాంకేతికత.. ఆశ్చర్యపరిచే విశేషాలివే
ఆశ్చర్యపరిచే విశేషాలివే

Artificial Sun: చైనా కృత్రిమ సూర్యుడు.. ఆశ్చర్యపరిచే సంఖ్యలు,అద్భుతమైన సాంకేతికత.. ఆశ్చర్యపరిచే విశేషాలివే

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 30, 2026
04:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనా భవిష్యత్తులో తన సొంత 'కృత్రిమ సూర్యుడు'ను రూపొందించే లక్ష్యానికి మరో కీలక అడుగు వేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్‌కండక్టింగ్ ఫ్యూజన్ మాగ్నెట్‌ను విజయవంతంగా తయారు చేసి పరీక్షించినట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడించాయి. అణు సంలయనం (న్యూక్లియర్ ఫ్యూజన్) ద్వారా వాణిజ్యపరంగా విద్యుత్ ఉత్పత్తి చేయాలన్న చైనా దీర్ఘకాల లక్ష్యానికి ఈ విజయం ఎంతో కీలకంగా భావిస్తున్నారు. ఈ భారీ మాగ్నెట్ 21 మీటర్ల పొడవు,12 మీటర్ల వెడల్పుతో 'డి' ఆకారంలో రూపొందించారు. దీని బరువు ఏకంగా 582 టన్నులు.అంటే పూర్తిగా ఇంధనం,సరుకుతో నిండిన బోయింగ్-747 విమానం కంటే కూడా ఎక్కువ బరువు ఉంటుంది.

వివరాలు 

100 ఆఫ్రికన్ ఏనుగుల బరువుతో సమానంగా ఉండే మాగ్నెట్

దాదాపు 100 ఆఫ్రికన్ ఏనుగుల బరువుతో సమానంగా ఉండే ఈ మాగ్నెట్ విద్యుత్ ఉత్పత్తి చేయదు.

దీని ప్రధాన పని అత్యంత వేడిగా ఉండే ప్లాస్మాను రియాక్టర్ గోడలకు తగలకుండా అయస్కాంత క్షేత్రంలో నిలిపివేయడం.

ఫ్యూజన్ రియాక్టర్‌లో హైడ్రోజన్‌ను అత్యధిక ఉష్ణోగ్రతకు వేడి చేస్తే అది ప్లాస్మాగా మారుతుంది.

ఈ ప్లాస్మా రియాక్టర్ గోడలను తాకితే వెంటనే చల్లబడి, రియాక్టర్‌కు నష్టం కలిగించడంతో పాటు ఫ్యూజన్ ప్రక్రియ ఆగిపోతుంది.

అందుకే శాస్త్రవేత్తలు శక్తివంతమైన అయస్కాంత క్షేత్రంతో ప్లాస్మాను గాలిలో తేలియాడేలా నియంత్రిస్తారు. దీనినే "అదృశ్య అయస్కాంత పంజరం"గా అభివర్ణిస్తారు.

వివరాలు 

సూర్యుడి కంటే వేడి.. అంతరిక్షం కంటే చల్లగా!

ఈ ప్రాజెక్టులో అత్యంత ఆశ్చర్యకరమైన అంశం ఉష్ణోగ్రత.

సూర్యుడి గర్భంలో సుమారు 15మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటే,చైనా ఫ్యూజన్ రియాక్టర్‌లో దాన్ని 150మిలియన్ డిగ్రీల సెల్సియస్ వరకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

భూమిపై సూర్యుడిలాంటి అపార గురుత్వాకర్షణ లేకపోవడంతో,హైడ్రోజన్ అణువులు కలిసేందుకు ఇంత భారీ ఉష్ణోగ్రత అవసరమవుతోంది.

ఇంత వేడిగా ఉండే ప్లాస్మాను నియంత్రించే మాగ్నెట్ మాత్రం మైనస్ 269 డిగ్రీల సెల్సియస్ వద్ద పనిచేయాలి.

ఇది సంపూర్ణ శూన్య ఉష్ణోగ్రత (Absolute Zero) కంటే కేవలం నాలుగు డిగ్రీలు మాత్రమే ఎక్కువ.

ఈ స్థాయిలోనే సూపర్‌కండక్టర్లు ఎలాంటి విద్యుత్ నిరోధం లేకుండా భారీ విద్యుత్ ప్రవాహాన్ని మోయగలవు.

ADVERTISEMENT

వివరాలు 

150 మిలియన్ డిగ్రీల వేడి.. మైనస్ 269 డిగ్రీల చలి!

అంటే ఒకే యంత్రంలో ఒకవైపు 150 మిలియన్ డిగ్రీల వేడి, మరోవైపు మైనస్ 269 డిగ్రీల చలి ఉండడం ఇంజినీరింగ్ పరంగా అసాధారణ విజయంగా నిపుణులు చెబుతున్నారు.

ఈ మాగ్నెట్ ద్వారా లక్ష అంపియర్లకు పైగా విద్యుత్ ప్రవాహాన్ని దాదాపు ఎలాంటి శక్తి నష్టం లేకుండా నిరంతరం ప్రవహించేలా రూపొందించారు.

ఇందుకోసం విద్యుత్ కలయిక ప్రాంతాల్లో నిరోధాన్ని దాదాపు సున్నా స్థాయికి తగ్గించారు.

దీర్ఘకాలం ఫ్యూజన్ ప్రక్రియ కొనసాగాలంటే ఇది అత్యంత కీలకమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరో విశేషం ఏమిటంటే,ఈ మాగ్నెట్‌ను సుమారు 60సంవత్సరాలు నిరంతరాయంగా పనిచేసేలా రూపొందించినట్లు చైనా ప్రకటించింది.

ఈ కాలంలో తీవ్రమైన రేడియేషన్, శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాలు, భారీ యాంత్రిక ఒత్తిడిని తట్టుకుని పనితీరు తగ్గకుండా ఉండాల్సి ఉంటుంది.

ADVERTISEMENT

వివరాలు 

భవిష్యత్ ఇంధనంగా ఫ్యూజన్‌కు పెరుగుతున్న ప్రాధాన్యం

ఇలాంటి పరిస్థితుల్లో ఆరు దశాబ్దాలు పనిచేసే యంత్రాన్ని రూపొందించడం కూడా ఫ్యూజన్ సాధించడంతే సవాలుగా భావిస్తున్నారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అణు సంలయన సాంకేతికతపై భారీ స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయి.

సాంప్రదాయ అణు విద్యుత్ కేంద్రాల మాదిరిగా భారీ అణువులను విడదీయకుండా, హైడ్రోజన్ వంటి తేలికపాటి అణువులను కలిపి అపార శక్తిని ఉత్పత్తి చేయడమే ఫ్యూజన్ ప్రత్యేకత.

సముద్ర జలాల్లో లభించే హైడ్రోజన్‌తో ఇంధనం సిద్ధమవడం, విద్యుత్ ఉత్పత్తి సమయంలో కార్బన్ డైఆక్సైడ్ విడుదల కాకపోవడం, అణు ప్రమాదాల ముప్పు చాలా తక్కువగా ఉండటం, దీర్ఘకాల రేడియోధార్మిక వ్యర్థాలు కూడా తక్కువగా ఉండటం వంటి ప్రయోజనాలు ఈ సాంకేతికతపై ప్రపంచ దేశాల ఆసక్తిని పెంచుతున్నాయి.

వివరాలు 

ఫ్యూజన్ విద్యుత్ కోసం ప్రపంచవ్యాప్తంగా భారీ పెట్టుబడులు 

చైనా, అమెరికా, యూరప్, జపాన్‌తో పాటు పలు ప్రైవేట్ సంస్థలు కూడా ఫ్యూజన్ పరిశోధనల్లో బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెడుతున్నాయి.

చైనా 2030 ప్రాంతంలో ఫ్యూజన్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, వాణిజ్య స్థాయిలో ఈ సాంకేతికత అందుబాటులోకి రావడానికి ఇంకా కొన్ని దశాబ్దాలు పట్టవచ్చని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు.

ADVERTISEMENT