ఆదిత్య ఎల్1పై ఇస్రో కీలక అప్డేట్.. అర్థరాత్రి 2 గంటలకు సూర్యుడి దిశగా ప్రయాణం ఆరంభం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్1 సరికొత్త మైలురాయికి చేరుకోనుంది. ఈ మేరకు సెప్టెంబర్ 19న అర్థరాత్రి రాకెట్, భూకక్ష్యను వీడి సూర్యుడి దిశగా ప్రయాణం ఆరంభించనుంది. సూర్యుడిపై పరిశోధనలకు గానూ ఆదిత్య ఎల్1 సమాచారాన్ని సేకరించడం మొదలుబెట్టింది. భూమికి దాదాపు 50 వేల కి.మీకుపైగా దూరంలో సూప్ర థర్మల్, ఎనర్జిటిక్ అయాన్స్, ఎలక్ట్రాన్స్‌కు సంబంధించిన డేటాను సేకరించే పనిలో ఉంది. వాతావరణం మారే కొద్దీ శక్తి కణాల ప్రవర్తనలో మార్పులు ఉండనున్నాయి. ఈ క్రమంలోనే ఆదిత్య ఎల్1లోని స్టెప్స్ (సూపరథర్మల్ అండ్ ఎనర్జిటిక్ పార్టికల్ స్పెక్ట్రోమీటర్) గుర్తించినట్లు ఇస్రో ప్రకటించింది.
సన్-ఎర్త్ లగ్రాంజ్ 1కు చేరుకోనున్న ఆదిత్య ఎల్1
ఆదిత్య ఎల్1 మంగళవారం కీలక దశకు చేరుకోనున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఈ మేరకు భూప్రదక్షిణ దశ ముగిసి 19న అర్థరాత్రి 2 గంటల సమయంలో సూర్యుడి దిశగా ప్రయాణాన్ని ప్రారంభించనున్నట్లు వివరించింది. ఈ క్రమంలోనే రాకెట్ సన్-ఎర్త్ లగ్రాంజ్ 1కు చేరుకోనుంది. భూమికి ఇది దాదాపుగా 15 లక్షల కి.మీ దూరంలో ఉంది. ఈ పాయింట్‌లోనే సూర్యుడు, భూమి గురత్వాకర్షణ శక్తుల సహకారంతో స్థిరత్వం సాధించవచ్చు. ఇప్పటిదాకా ఐదు లగ్రాంజ్ పాయింట్లను గుర్తించామని, వీటిల్లో భారత్‌కు చెందిన ఆదిత్య ఎల్1 తొలి లగ్రాంజ్ పాయింట్‌కు వెళ్తుందని ఇస్రో పేర్కొంది. ఇది భూమి సహా సూర్యుడి చుట్టూ ఆవరించి ఉండటంతో సౌర పరిశీలనకు తోడ్పడుతుంది. ఈ కేంద్రం నుంచే ఆదిత్యఎల్1 సూర్యుడిపై అధ్యయనాలు చేయనుంది.