Space-Based Data Centers: మరో ఐదేళ్లలో అంతరిక్షంలో డేటా సెంటర్లు.. స్కైరూట్ సీఈఓ అంచనా
ఈ వార్తాకథనం ఏంటి
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అంతరిక్ష ఆధారిత సాంకేతికతలపై దృష్టి సారిస్తున్న నేపథ్యంలో, భారత ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ సీఈఓ పవన్ కుమార్ చందన కూడా భవిష్యత్‌పై కీలక అంచనా వెల్లడించారు. మరో ఐదేళ్లలో అంతరిక్షంలో డేటా సెంటర్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. బెంగళూరులో నిర్వహించిన నెట్‌వర్క్18 'రైజింగ్ భారత్ సమ్మిట్'లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భూమిపై విద్యుత్ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో కంప్యూటింగ్ వ్యవస్థలు క్రమంగా అంతరిక్షం వైపు మళ్లే అవకాశముందని చంద్రన చెప్పారు. ఉపగ్రహాలు వాతావరణ ప్రభావం లేకుండా నిరంతర సౌరశక్తిని వినియోగించుకోగలవని, దీంతో స్పేస్‌లో డేటా సెంటర్ల నిర్వహణ ఆర్థికపరంగా కూడా ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు.
వివరాలు
భవిష్యత్తులో కక్ష్యలో డేటా సెంటర్ల ఏర్పాటు సాధ్యమేనని అభిప్రాయపడిన దిగ్గజ సంస్థలు
కృత్రిమ మేధ (AI)వినియోగం వేగంగా పెరుగుతుండటంతో డేటా ప్రాసెసింగ్‌కు భారీ స్థాయిలో విద్యుత్ అవసరం ఏర్పడుతోంది.
ఈ నేపథ్యంలో స్పేస్ ఆధారిత కంప్యూటింగ్‌పై ప్రపంచంలోని ప్రముఖ టెక్ సంస్థలు ఇప్పటికే పరిశోధనలు ప్రారంభించాయి.
స్పేస్‌ఎక్స్,మైక్రోసాఫ్ట్,గూగుల్,అమెజాన్ వంటి సంస్థల ప్రతినిధులు కూడా భవిష్యత్తులో కక్ష్యలో డేటా సెంటర్ల ఏర్పాటు సాధ్యమేనని అభిప్రాయపడినట్లు చంద్రన తెలిపారు.
స్పేస్ డేటా సెంటర్ల తొలి నమూనాలను మరో రెండు నుంచి మూడు సంవత్సరాల్లోనే ప్రయోగించే అవకాశం ఉందని,ఆ తర్వాత వాటి వినియోగం వేగంగా పెరిగే అవకాశముందని ఆయన అంచనా వేశారు.
అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో తదుపరి దశ కేవలం ఉపగ్రహ ప్రయోగాలకే పరిమితం కాదని,శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్,డైరెక్ట్-టు-మొబైల్ కమ్యూనికేషన్,స్పేస్ కంప్యూటింగ్ వంటి రంగాలు కీలక పాత్ర పోషిస్తాయని చంద్రన పేర్కొన్నారు.
వివరాలు
వచ్చే ఏడాది నుంచి నెలకు ఒక రాకెట్ ప్రయోగం
ఇటీవల తొలి ప్రయత్నంలోనే విక్రమ్-1 మిషన్ ద్వారా కక్ష్యలోకి రాకెట్‌ను విజయవంతంగా పంపిన తొలి భారత ప్రైవేట్ సంస్థగా గుర్తింపు పొందిన స్కైరూట్, ఇప్పుడు ప్రయోగాల సంఖ్యను పెంచేందుకు సిద్ధమవుతోంది.
వచ్చే ఏడాది నుంచి నెలకు ఒక రాకెట్ ప్రయోగం నిర్వహించే లక్ష్యంతో సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది.
అదే సమయంలో మరింత బరువైన రాకెట్ల అభివృద్ధితో పాటు భవిష్యత్తులో తిరిగి వినియోగించగల రాకెట్ల (Reusable Rockets) రూపకల్పనపై కూడా దృష్టి సారిస్తోంది.
వివరాలు
స్కైరూట్ ఇంజినీరింగ్ బృందం సగటు వయసు కేవలం 28 సంవత్సరాలే
తమ సంస్థ లక్ష్యం కేవలం రాకెట్ ప్రయోగ సేవలకే పరిమితం కాదని, అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ తదుపరి దశకు అవసరమైన మౌలిక వసతులను నిర్మించడమేనని చందన స్పష్టం చేశారు.
స్కైరూట్ ఇంజినీరింగ్ బృందం సగటు వయసు కేవలం 28 సంవత్సరాలేనని పేర్కొంటూ, భారత ప్రైవేట్ అంతరిక్ష రంగ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు.
మనుషులు ఎప్పుడూ కొత్త ప్రాంతాలను అన్వేషించే స్వభావం కలిగినవారు. అంతరిక్షానికి ఆకాశమే హద్దు కాదు" అని పవన్ కుమార్ చందన వ్యాఖ్యానించారు.