LOADING...
Amazon Music: ప్రైమ్‌ యూజర్లకు షాక్‌ .. అమెజాన్‌ మ్యూజిక్‌లో ఇక యాడ్స్
ప్రైమ్‌ యూజర్లకు షాక్‌ .. అమెజాన్‌ మ్యూజిక్‌లో ఇక యాడ్స్

Amazon Music: ప్రైమ్‌ యూజర్లకు షాక్‌ .. అమెజాన్‌ మ్యూజిక్‌లో ఇక యాడ్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 02, 2026
02:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యులకు సంస్థ కీలక మార్పులను ప్రకటించింది. ఇప్పటివరకు అదనపు ఛార్జీలు లేకుండా లభిస్తున్న అమెజాన్‌ మ్యూజిక్‌ సేవల్లో ఇకపై ప్రకటనలు (యాడ్స్‌) కనిపించనున్నాయి. యాడ్‌ఫ్రీ మ్యూజిక్‌, ఆఫ్‌లైన్‌ డౌన్‌లోడ్‌ సౌకర్యం, మెరుగైన ఆడియో నాణ్యత వంటి ప్రత్యేక ఫీచర్లు కోరుకునే వినియోగదారులు ప్రత్యేకంగా చెల్లించే సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సంస్థ 'అమెజాన్‌ మ్యూజిక్‌ అన్‌లిమిటెడ్‌' పేరుతో కొత్త ప్రీమియం ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

వివరాలు 

మూడు విభాగాలుగా మ్యూజిక్‌ సేవలు

అమెజాన్‌ తన మ్యూజిక్‌ సేవలను మూడు విభాగాలుగా పునర్వ్యవస్థీకరించింది. ఇందులో 'అమెజాన్‌ మ్యూజిక్‌ అన్‌లిమిటెడ్‌' ప్రీమియం చెల్లింపు ప్లాన్‌గా ఉంటుంది. ఈ ప్లాన్‌లో 100 మిలియన్లకు పైగా పాటలు, పాడ్‌కాస్ట్‌లు అందుబాటులో ఉంటాయి. అలాగే హెచ్‌డీ, అల్ట్రా హెచ్‌డీ ఆడియో, స్పేషియల్‌ ఆడియో, డాల్బీ అట్మాస్‌ వంటి అధిక నాణ్యత ఫీచర్లను వినియోగదారులు పొందగలరు. ఈ సేవ కోసం ప్రైమ్‌ సభ్యులు నెలకు రూ.99 చెల్లించాల్సి ఉండగా, నాన్‌-ప్రైమ్‌ వినియోగదారులకు నెలవారీ చార్జీ రూ.119గా నిర్ణయించింది. ప్రస్తుతం ప్రైమ్‌ సభ్యులకు ఈ ప్లాన్‌ను ఆరు నెలల పాటు ఉచితంగా అందిస్తోంది.

వివరాలు 

ప్రైమ్‌ మ్యూజిక్‌లో యాడ్స్‌ తప్పవు

అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యత్వంతో లభించే సాధారణ అమెజాన్‌ మ్యూజిక్‌ సేవకు అదనపు చెల్లింపులు అవసరం లేదు. ఇందులో కూడా 100 మిలియన్ల పాటలు, పాడ్‌కాస్ట్‌లు అందుబాటులో ఉంటాయి. అయితే ఇకపై వినియోగదారులు ప్రకటనలను చూడాల్సి ఉంటుంది. అంతేకాకుండా, ఆఫ్‌లైన్‌ డౌన్‌లోడ్‌ సదుపాయాన్ని సంస్థ నిలిపివేసింది.

Advertisement

వివరాలు 

త్వరలో 'అమెజాన్‌ మ్యూజిక్‌ ఫ్రీ'

'అమెజాన్‌ మ్యూజిక్‌ ఫ్రీ' పేరుతో మరో ఉచిత ప్లాన్‌ను కూడా అమెజాన్‌ త్వరలో భారత మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. అయితే ఈ ప్లాన్‌లో ఫీచర్లు పరిమితంగానే ఉండనున్నాయి. పైగా మధ్యమధ్యలో యాడ్స్‌ వస్తాయి. ఇప్పటికే పలు ప్రముఖ మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు ఉచిత, యాడ్‌-సపోర్టెడ్‌, ప్రీమియం ప్లాన్‌లను అమలు చేస్తున్నాయి. అదే తరహా వ్యూహాన్ని అమెజాన్‌ కూడా అనుసరిస్తూ తన మ్యూజిక్‌ సేవల్లో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది.

Advertisement