Loading...
NASA: నాసా-ఇస్రో నిసార్ మరో అద్భుతం.. అంటార్కిటికా మంచు కింద కనిపించిన అరుదైన ఆకృతి!
నాసా-ఇస్రో నిసార్ మరో అద్భుతం.. అంటార్కిటికా మంచు కింద కనిపించిన అరుదైన ఆకృతి!

NASA: నాసా-ఇస్రో నిసార్ మరో అద్భుతం.. అంటార్కిటికా మంచు కింద కనిపించిన అరుదైన ఆకృతి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 24, 2026
10:58 am

ఈ వార్తాకథనం ఏంటి

నాసా (NASA), ఇస్రో (ISRO) సంయుక్తంగా అభివృద్ధి చేసిన అత్యాధునిక నిసార్ (NASA-ISRO Synthetic Aperture Radar - NISAR) ఉపగ్రహం మరో కీలక మైలురాయిని చేరుకుంది. జూలై 20 నుంచి నిసార్ ఉపగ్రహంలోని రెండు శక్తివంతమైన రాడార్ వ్యవస్థలు సేకరిస్తున్న డేటాను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ డేటా ద్వారా భూమిపై చోటుచేసుకుంటున్న మార్పులను మరింత ఖచ్చితంగా అధ్యయనం చేసే అవకాశం శాస్త్రవేత్తలకు లభించనుంది. అమెరికా, భారతదేశానికి చెందిన శాస్త్రవేత్తల బృందాలు నిసార్‌లోని L-బ్యాండ్, S-బ్యాండ్ రాడార్‌లతో సేకరించిన సమాచారాన్ని దశలవారీగా విడుదల చేయనున్నాయి.

వివరాలు 

హమ్మింగ్‌బర్డ్‌లా కనిపించిన అంటార్కిటికా చిత్రం

ఈ డేటా ద్వారా భూమి ఉపరితలం, మంచు ఖండాల కదలికలు, అడవులు, చిత్తడి నేలలు (Wetlands) వంటి పర్యావరణ వ్యవస్థల్లో జరుగుతున్న మార్పులు, అలాగే భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి విపత్తులను మరింత సమర్థంగా పర్యవేక్షించే అవకాశం ఉంటుంది.

నిసార్ విడుదల చేసిన తొలి చిత్రాల్లో ఒకటి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. అంటార్కిటికాలోని తూర్పు ప్రాంతంలో ఉన్న 'నునాటాక్ జటెర్జావ్షిజ్స్జా (Nunatak Zaterjavshijsja)' అనే పర్వత ప్రాంతాన్ని అత్యంత స్పష్టంగా చిత్రీకరించింది.

విశేషం ఏమిటంటే.. ఈ చిత్రం చూసిన వారికి హమ్మింగ్‌బర్డ్ (Hummingbird) పక్షిని తలపించేలా కనిపిస్తోంది.

వివరాలు 

మంచు కింద దాగి ఉన్న వివరాలూ కనిపిస్తున్నాయి

ఈ పర్వత శిఖరం చుట్టూ ఈశాన్య దిశగా సముద్రం వైపు ప్రవహిస్తున్న భారీ హిమానీనదం (Glacier) ఉంది. హిమానీనదం పర్వతాన్ని దాటే సమయంలో మంచుపై తీవ్రమైన ఒత్తిడి ఏర్పడి లోతైన పగుళ్లు (Crevasses) ఏర్పడతాయి. నిసార్ చిత్రంలో ఈ పగుళ్లు ఆకుపచ్చ (Green) రంగులో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

దక్షిణ కాలిఫోర్నియాలోని నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ (JPL)లో సిగ్నల్ అనాలిసిస్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సియోంగ్సు జియోంగ్ ఈ చిత్రాన్ని రూపొందించారు.

ఆయన మాట్లాడుతూ.. ఈ చిత్రం కేవలం అందంగా ఉండటమే కాకుండా హిమానీనదం ఎలా కదులుతోందనే విషయంపై విలువైన సమాచారం అందిస్తోందన్నారు. సాధారణ ఆప్టికల్ ఉపగ్రహ చిత్రాల కంటే రాడార్ సాంకేతికత మంచును చీల్చుకుని లోపలివరకు పరిశీలించగలదని చెప్పారు.

ADVERTISEMENT

వివరాలు 

ఈ రంగుల అర్థం ఏమిటి?

ఈ చిత్రంలో కనిపిస్తున్న రంగులు రాడార్ తరంగాలు మంచుతో ఎలా ప్రతిస్పందించాయో తెలియజేస్తాయి.

గులాబీ (Magenta) రంగు: నిసార్ పంపిన హారిజాంటల్ పోలరైజేషన్ రాడార్ తరంగాలు మృదువైన మంచు ఉపరితలాలపై ప్రతిఫలించిన ప్రాంతాలను సూచిస్తుంది.

ఆకుపచ్చ (Green) రంగు: రాడార్ సంకేతాలు కొంతవరకు మంచు లోపలికి వెళ్లి లేదా లోతైన పగుళ్లు వంటి అసమాన ఉపరితలాలపై తాకి తిరిగి వచ్చిన ప్రాంతాలను సూచిస్తుంది. దీనిని వాల్యూమ్ స్కాటరింగ్ (Volume Scattering) అంటారు. తెలుపు (White) రంగు:

గులాబీ, ఆకుపచ్చ రెండు రకాల సంకేతాలు సమానంగా ప్రతిఫలించిన ప్రాంతాలను సూచిస్తుంది. అంటే అక్కడ ఉపరితల ప్రతిఫలనం, లోపలి ప్రతిఫలనం రెండూ బలంగా ఉన్నాయని అర్థం.

ADVERTISEMENT

వివరాలు 

సాధారణ ఫొటోలో ఇలా కనిపించదు

అదే ప్రాంతాన్ని సాధారణ ఆప్టికల్ కెమెరాతో చిత్రీకరిస్తే మొత్తం మంచు, మంచు పొరల కారణంగా దాదాపు పూర్తిగా తెల్లగా మాత్రమే కనిపిస్తుంది.

పర్వతం ఉనికి, మంచుపై చిన్న చిన్న నీడలు, ఉపరితల ఆకృతులు మాత్రమే స్వల్పంగా గుర్తించవచ్చు.

కానీ నిసార్ రాడార్ సాంకేతికతతో మాత్రం మంచు కింద దాగి ఉన్న నిర్మాణాలు, పగుళ్లు, హిమానీనద కదలికలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి.

వివరాలు 

భూమి మార్పులను పర్యవేక్షించడంలో నిసార్ కీలకం

నిసార్ ఉపగ్రహం సేకరించే సమాచారం భవిష్యత్తులో భూమి ఉపరితల మార్పులు, హిమానీనదాల కరుగుదల, వాతావరణ మార్పుల ప్రభావం, అడవుల పరిస్థితి, చిత్తడి నేలల ఆరోగ్యం, భూకంపాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదాలను ముందుగానే అంచనా వేయడంలో కీలక పాత్ర పోషించనుంది.

ఈ అత్యాధునిక రాడార్ సాంకేతికతతో భూమిపై ఇప్పటివరకు కనిపించని అనేక రహస్యాలను శాస్త్రవేత్తలు వెలికితీయగలరని నాసా అభిప్రాయపడుతోంది.

ADVERTISEMENT