Anthropic: ఏఐపై సంచలన ఆరోపణలు.. మానవ నియంత్రణపై ఆంత్రోపిక్ సీఈఓ క్లారిటీ
ఈ వార్తాకథనం ఏంటి
మానవుల స్వేచ్ఛ, నిర్ణయాధికారాన్ని ఏఐకి అప్పగించాలనే ఆలోచనకు తాము పూర్తిగా వ్యతిరేకమని ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్ స్పష్టం చేశారు. ఏఐ వ్యవస్థలకు మానవ నియంత్రణను వదిలేయాలని ఆంత్రోపిక్ భావిస్తోందన్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. బుధవారం ఎక్స్‌లో సుదీర్ఘంగా చేసిన పోస్టులో అలాంటి వాదనలను 'అసంబద్ధం'గా అభివర్ణించారు. సామర్థ్యం లేదా భద్రత కోసం మానవుల స్వయం నిర్ణయాధికారాన్ని త్యాగం చేయకూడదని స్పష్టం చేశారు. ఏఐ పాలనకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుందని, మానవ పాలన స్థానంలో ఏఐని తీసుకురావడం మంచి ఆలోచన కాదని తేల్చిచెప్పారు.
Details
మానవ నిర్ణయాధికారమే కీలకం
ఏఐ అభివృద్ధి బాధ్యతారహితంగా జరిగితే మానవుల స్వేచ్ఛ, నిర్ణయాధికారం ప్రమాదంలో పడవచ్చని ఇప్పటికే పలువురు టెక్ దిగ్గజాలు హెచ్చరిస్తున్నారు.
ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ కూడా భవిష్యత్తుపై ప్రజలకు నిర్ణయాధికారం కొనసాగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
మెటా చీఫ్ ఏఐ ఆఫీసర్ అలెగ్జాండర్ వాంగ్ సైతం సమాజాన్ని ఏఐకి అప్పగించే పరిస్థితిని అంగీకరించకూడదని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో అమోడెయ్ తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఏఐ ఎంత శక్తివంతమైనదైనా తుది నిర్ణయాధికారం మాత్రం మనుషుల చేతుల్లోనే ఉండాలని ఆయన అభిప్రాయం.
Details
పనులు ఆటోమేటిక్‌గా చేయడమే వేరు
అయితే ఏఐతో కొన్ని పనులు పూర్తిగా ఆటోమేటిక్‌గా చేయించడం, మానవ స్వేచ్ఛను ఏఐకి అప్పగించడం రెండూ ఒకటే కాదని అమోడెయ్ వివరించారు.
ఉదాహరణకు ఏఐ కారును నడపడం, క్యాన్సర్ మందును రూపొందించడంలో సహకరించడం లేదా సాఫ్ట్‌వేర్‌ను పూర్తిగా రాయడం వంటి పనులు ఆటోమేషన్ పరిధిలోకి వస్తాయని చెప్పారు.
కానీ ఏఐ తనను తాను ఎలాంటి మానవ సహాయం లేకుండా మరింత శక్తివంతంగా మార్చుకునే Recursive Self-Improvement (RSI) విషయంలో మాత్రం జాగ్రత్త అవసరమని సూచించారు.
ఈ ప్రక్రియకు పరిమితులు ఉండాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
Details
ఆంత్రోపిక్‌లోనే పెరుగుతున్న ఏఐ వినియోగం
ఇక్కడే అసలు చర్చ మొదలవుతోంది. ఒకవైపు మానవ పర్యవేక్షణ అవసరమని ఆంత్రోపిక్ చెబుతుండగా.. మరోవైపు సంస్థ తన పరిశోధన, అభివృద్ధి పనుల్లో ఏఐ వినియోగాన్ని వేగంగా పెంచుతోంది.
జూన్‌లో ఆంత్రోపిక్ వెల్లడించిన వివరాల ప్రకారం, సంస్థ కోడ్‌బేస్‌లో విలీనం చేసిన కోడ్‌లో 80 శాతానికి పైగా క్లాడ్ రాసింది.
ఈ నెలలో METR అనే ఏఐ సేఫ్టీ పరిశోధనా సంస్థ చేసిన స్వతంత్ర అంచనా ప్రకారం.. ఏఐ సహాయంతో పరిశోధన సాగడం వల్ల ఆంత్రోపిక్ మోడళ్ల సామర్థ్యం గత వేగంతో పోలిస్తే దాదాపు రెండింతల రేటుతో పెరుగుతోంది.
Details
'క్లోజింగ్ ది లూప్'పై ఆందోళనలు
తన ఐపీఓ పత్రాల్లోనూ ఆంత్రోపిక్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వివరించింది. ప్రతి కొత్త తరం క్లాడ్ తర్వాతి తరం ఏఐ అభివృద్ధిని వేగవంతం చేస్తోందని, ఈ ప్రక్రియను సంస్థ 'క్లోజింగ్ ది లూప్'గా పేర్కొంది.
అయితే పూర్తిగా స్వయంప్రతిపత్తితో క్లాడ్ తదుపరి తరం ఫ్రాంటియర్ మోడళ్లను రూపొందించే స్థాయికి చేరుకోవడం సురక్షితం కాదని అమోడెయ్ స్పష్టం చేశారు.
ఏఐ సామర్థ్యాలు వేగంగా పెరుగుతున్న సమయంలో వాటిని మనుషులు పూర్తిగా పరిశీలించడం, అర్థం చేసుకోవడం కూడా కష్టమవుతోందన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న.
ఏఐని ఎంతవరకు ఆటోమేట్ చేయాలి? ఎక్కడ మానవ నియంత్రణకు గీత గీయాలి? అనే చర్చ రాబోయే రోజుల్లో మరింత తీవ్రం కానుంది.