
Apple: అమెరికా సుంకాల ప్రభావం.. ఆపిల్‌పై 900 మిలియన్ డాలర్ల ప్రభావం!
ఈ వార్తాకథనం ఏంటి
ఐఫోన్ తయారీ సంస్థ ఆపిల్ ఈ ఏడాది మొదటి త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది.
విశ్లేషకులు అంచనా వేసినదానికంటే మెరుగైన ఫలితాలు కంపెనీ సాధించింది.
అయితే వచ్చే త్రైమాసికంలో అమెరికా విధించే సుంకాల ప్రభావం వల్ల సంస్థపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముందని యాపిల్ హెచ్చరించింది.
ముఖ్యంగా ఈ సుంకాల వల్ల సరఫరా వ్యవస్థ (సప్లై చెయిన్)కు ఆటంకాలు కలగొచ్చని తెలిపింది.
సుంకాల ప్రభావం వల్ల కంపెనీపై దాదాపు 900 మిలియన్ డాలర్ల భారం పడొచ్చని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ పేర్కొన్నారు.
వివరాలు
ముందస్తు చర్యగా భారత్‌లో ఆపిల్ కార్యకలాపాలు
అమెరికా-చైనా మధ్య పరస్పరంగా భారీ సుంకాలను విధించుకోవడం వల్ల రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం చెలరేగింది.
ఈ పరిస్థితుల్లో టారిఫ్‌ల నుంచి తప్పించుకోవాలన్న ఉద్దేశంతో యాపిల్ ఇతర మార్గాలను అన్వేషించేందుకు ప్రయత్నిస్తోంది.
ప్రస్తుతం ప్రతీకార సుంకాల నుంచి స్మార్ట్‌ఫోన్లు,కంప్యూటర్లు,సెమీకండక్టర్లను మినహాయించినప్పటికీ, భవిష్యత్‌లో పరిస్థితి ఎలా ఉంటుందన్నదానిపై స్పష్టత లేదని కంపెనీ అంటోంది.
ఈ నేపథ్యంలో యాపిల్ ముందస్తు చర్యగా భారత్‌లో తన ఉత్పత్తి కార్యకలాపాలను విస్తరిస్తోంది.
వివరాలు
900 మిలియన్ డాలర్ల అదనపు వ్యయ భారం తప్పదు
''భవిష్యత్‌లో సుంకాలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో తెలియదు. అందువల్ల ప్రస్తుతం ఖచ్చితమైన అంచనాలు వేయడం కష్టం. అయితే ప్రస్తుతం ఉన్న టారిఫ్ విధానాలు కొనసాగితే 900 మిలియన్ డాలర్ల అదనపు వ్యయ భారం తప్పదు'' అని టిమ్ కుక్ స్పష్టం చేశారు. భారత్‌లో ఉత్పత్తిని మరింతగా పెంచాలన్న దిశగా కంపెనీ కృషి చేస్తోందని ఒక అధికారి వెల్లడించారు.
వివరాలు
95.4 బిలియన్ డాలర్ల ఆదాయం నమోదు
కంపెనీ ఐప్యాడ్, మ్యాక్, యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్‌ల వంటి పరికరాలను ప్రధానంగా వియత్నాంలో ఉత్పత్తి చేస్తోందని కుక్ తెలిపారు.
అయితే అమెరికా వెలుపలి మార్కెట్ల కోసం చైనా ఇప్పటికీ కీలక ఉత్పత్తి కేంద్రంగా ఉన్నదన్నారు.
ఇదిలా ఉండగా, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఐఫోన్ విక్రయాలు గణనీయంగా పెరిగాయి.
ఈ నేపథ్యంలో యాపిల్ మొత్తం 95.4 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది.
ఇందులో చైనా నుంచే 17 బిలియన్ డాలర్ల ఆదాయం లభించింది. మొత్తంగా కంపెనీ లాభం 24.8 బిలియన్ డాలర్లుగా నమోదైందని తెలియజేశారు.