ఆపిల్: ఐఫోన్ 15ప్రో మోడల్స్ లో అదొక్కటే సమస్య, బ్యాక్ కేస్ కొనాల్సిందే అంటున్న యూజర్లు
ఆపిల్ నుండి లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ మోడల్స్ ఫోన్లకు ప్రపంచవ్యాప్తంగా బాగా డిమాండ్ ఏర్పడింది. నిన్నటికి నిన్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, తాను కూడా ఒక ఐఫోన్ 15 సిరీస్ మోడల్ కొనుబోతున్నానని ప్రకటించాడు. ఐఫోన్ 15 సిరీస్ మోడల్స్ ఫోన్లను కొనడానికి ఆపిల్ స్టోర్లకు జనం ఎగబడుతున్న ఫోటోలు ఇంటర్నెట్లో బయటకు వచ్చాయి. ఐఫోన్ 15 సిరీస్ లో మొత్తం నాలుగు మోడల్స్ ఉన్నాయి. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్. ఈ నాలుగు మోడల్స్ లో ఐఫోన్ 15 ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్స్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి.
ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్ ఫోన్లకు టైటానియంతో ఫినిషింగ్
ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 మాక్స్ ప్రో మోడల్స్ ఎక్కువ కాలం మన్నే విధంగా ఉన్నాయని అంటున్నారు. టైటానియంతో ఫినిషింగ్ చేయడం వల్ల ఇవి చాలా తేలికగా ఉన్నాయి. ఆపిల్ తన పాత మోడల్స్ ని స్టెయిన్ లెస్ స్టీల్ తో ఫినిషింగ్ చేసింది. కానీ ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ మోడల్స్ ని మాత్రం టైటానియంతో ఫినిషింగ్ చేయించింది. అయితే టైటానియంతో ఫినిషింగ్ చేయించిన ఈ రెండు మోడల్స్ ఫోన్లు వాడేవారు తప్పనిసరిగా బ్యాక్ కేస్ వేసుకోవాల్సిందేనని చెబుతున్నారు. వీటికి డ్యామేజీ జరిగే అవకాశం ఎక్కువని అంటున్నారు. లేదంటే ఆపిల్ కేర్ ప్లస్ లో 20 వేల రూపాయలతో ఫోన్లను రిజిస్టర్ చేయించుకోవాలని చెబుతున్నారు.