Apple: బ్రెజిల్‌లో థర్డ్ పార్టీ యాప్ స్టోర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆపిల్
ఈ వార్తాకథనం ఏంటి
బ్రెజిల్‌లో ఆపిల్ తన యాప్ స్టోర్ విధానాల్లో కీలక మార్పులు చేసింది. ఇకపై ఆ దేశంలో డెవలపర్లు ఆమోదం పొందిన థర్డ్ పార్టీ యాప్ స్టోర్లతో పాటు ప్రత్యామ్నాయ చెల్లింపు విధానాల ద్వారా కూడా తమ యాప్‌లను వినియోగదారులకు అందించేందుకు అవకాశం కల్పించనుంది. బ్రెజిల్ పోటీ నియంత్రణ సంస్థ (CADE)తో కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. 2022లో లాటిన్ అమెరికాకు చెందిన ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మెర్కాడో లిబ్రే ఆపిల్ యాప్ స్టోర్ నిబంధనలను సవాలు చేయడంతో ప్రారంభమైన వివాదానికి ఈ నిర్ణయంతో తెరపడినట్టైంది.
వివరాలు
వినియోగదారుల భద్రతకే ప్రాధాన్యత: ఆపిల్
అయితే, ఈ మార్పులతో వినియోగదారుల భద్రతకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆపిల్ స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయ యాప్ స్టోర్ల ద్వారా పంపిణీ చేసే ప్రతి యాప్ కూడా ఆపిల్ భద్రతా తనిఖీలను తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే 'స్క్రీన్ టైమ్' వంటి పేరెంటల్ కంట్రోల్ సదుపాయాలను పాటించాల్సి ఉంటుందని తెలిపింది. దీంతో థర్డ్ పార్టీ ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులోకి వచ్చినా వినియోగదారుల గోప్యత, భద్రత విషయంలో రాజీ ఉండదని కంపెనీ పేర్కొంది.
వివరాలు
యాప్ విక్రయాలకు కొత్త కమిషన్ విధానం
యాప్ విక్రయాలకు సంబంధించి ఆపిల్ కొత్త కమిషన్ విధానాన్ని కూడా ప్రకటించింది. ఇతర యాప్ మార్కెట్‌ప్లేస్‌ల ద్వారా విక్రయించే యాప్‌లపై 5 శాతం 'కోర్ టెక్నాలజీ ఫీజు' వసూలు చేయనుంది. డెవలపర్లకు మరింత స్వేచ్ఛ కల్పిస్తూనే సమతుల్యతను కాపాడేలా ఈ విధానాన్ని రూపొందించినట్లు ఆపిల్ తెలిపింది. గత ఏడాది జపాన్‌లో అమలు చేసిన విధానానికి ఇది దగ్గరగా ఉండగా, బ్రెజిల్‌లో యాప్ పంపిణీ, చెల్లింపు నిబంధనల్లో చేపడుతున్న విస్తృత మార్పుల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.