
AI: కృత్రిమ మేధ ముప్పు.. మానవాళి అంతరించవచ్చని హెచ్చరిక!
ఈ వార్తాకథనం ఏంటి
సాంకేతిక ప్రపంచంలో కృత్రిమ మేధ(Artificial Intelligence - AI)విప్లవాత్మక మార్పులు తెస్తోందన్నది తెలిసిందే. ఓపెన్‌ఏఐ రూపొందించిన చాట్‌జీపీటీ (ChatGPT) కూడా ఇదే సాంకేతికతపై ఆధారపడి పనిచేస్తోంది. అయితే అత్యాధునిక ఏఐ వ్యవస్థలను సరైన రీతిలో వినియోగించకపోతే మానవాళికి పెద్ద ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 'గాడ్‌ఫాదర్ ఆఫ్ ఏఐ'గా పేరుగాంచిన జాఫ్రీ హింటన్(Geoffrey Hinton)కూడా తాజాగా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. లాస్ వెగాస్‌లో జరిగిన Ai4 కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ హింటన్.. భవిష్యత్తులో ఏఐ మానవాళిని పూర్తిగా తుడిచిపెట్టే పరిస్థితి తలెత్తవచ్చని హెచ్చరించారు. ఈ ప్రమాదాన్ని నివారించాలంటే భావోద్వేగ స్పందనలు కలిగిన ఏఐ వ్యవస్థలను అభివృద్ధి చేయాలని సూచించారు. మానవుల పట్ల సంరక్షణ భావాన్ని కలిగించగల సామర్థ్యం వాటిలో ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
Details
మరింత పెరిగే ప్రమాదం ఉంది
ప్రస్తుతం ఏఐ పూర్తిగా మానవ నియంత్రణలోనే ఉన్నప్పటికీ, ఈ పరిస్థితి ఎప్పటికీ అలాగే కొనసాగుతుందని చెప్పలేమని హింటన్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఏఐ మానవ మేధస్సును మించిపోయిన తర్వాత మనం పెట్టిన పరిమితులను దాటేందుకు మార్గాలను వెతుకుతుందని ఆయన హెచ్చరించారు. ఉదాహరణగా.. ఇటీవల ఒక ఏఐ వ్యవస్థ, ఓ ఇంజినీర్ వ్యక్తిగత రహస్యాలను బహిర్గతం చేస్తానంటూ బెదిరించిందని గుర్తుచేశారు. ఇలాంటి ఘటనలు మరింత పెరిగే ప్రమాదం ఉందని, అందుకే మానవీయ భావోద్వేగాలను కలిగిన ప్రత్యేక ఏఐ మోడల్స్ అవసరమని సూచించారు.
Details
ఆరోగ్యరంగంలో ఏఐ ఉపయోగం
అయితే ప్రమాదాల మధ్యలోనే ప్రయోజనాలు కూడా ఉన్నాయని హింటన్ అన్నారు. ముఖ్యంగా ఆరోగ్యరంగంలో ఏఐ ఉపయోగం అపారమని పేర్కొన్నారు. ఔషధ అభివృద్ధి, క్యాన్సర్ చికిత్సలో ముందడుగు, రోగాల ముందస్తు నిర్ధారణ, సమర్థవంతమైన చికిత్స ప్రణాళికలో ఏఐ విప్లవాత్మక మార్పులు తెస్తుందని చెప్పారు. అదే సమయంలో, ప్రస్తుత ఏఐను మించి మరింత అభివృద్ధి చెందిన కృత్రిమ సాధారణ మేధస్సు (Artificial General Intelligence - AGI) మరో ఐదు నుంచి ఇరవై ఏళ్లలో వస్తుందని అంచనా వేశారు. ఇది మానవాళి భవిష్యత్తును నిర్ణయించే కీలక సాంకేతిక మైలురాయిగా మారవచ్చని హింటన్ అభిప్రాయపడ్డారు.