HATS-75 b: జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌తో మరో కీలక ఆవిష్కరణ.. HATS-75 b పై శాస్త్రవేత్తల తాజా అధ్యయనం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని జాన్స్ హాప్‌కిన్స్ విశ్వవిద్యాలయంకు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు జేమ్స్ వెబ్ అంతరిక్ష టెలీస్కోప్ సహాయంతో HATS-75 b అనే భారీ ఎగ్జోప్లానెట్‌ను మరోసారి పరిశీలించారు. ఈ గ్రహం 2021లో HATSouth,TESS మిషన్ల ద్వారా కనుగొన్నారు. భూమి నుండి సుమారు 637 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ఈ గ్రహం, చిన్న నక్షత్రాల చుట్టూ తిరిగే అరుదైన గ్రహాల్లో ఒకటి. తాజాగా ఈ గ్రహం వాతావరణంపై మరింత సమాచారం తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఈ పరిశోధనను రేజా అష్టారి నేతృత్వంలోని బృందం నిర్వహించింది. NIRSpec PRISM అనే పరికరంతో గ్రహం మూడు సార్లు తన నక్షత్రం ముందు నుంచి వెళ్లే సమయంలో పరిశీలించారు.
వివరాలు
వాతావరణంలో ఎక్కువగా మీథేన్
ఈ సందర్భంగా HATS-75 అనే నక్షత్రం ఉపరితలం చాలా అసమానంగా ఉందని తెలిసింది. అందులో చల్లటి డార్క్ స్పాట్స్, వేడిగా ఉండే బ్రైట్ ప్రాంతాలు ఉండటం వల్ల గ్రహం వాతావరణంపై వచ్చే కాంతి ప్రభావం మారిపోతుంది. దీనిని ట్రాన్సిట్ లైట్ సోర్స్ ఎఫెక్ట్‌గా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మొదట ఈ గ్రహం వాతావరణం మసకగా ఉందని భావించినా, తరువాత అది నక్షత్రం వల్ల వచ్చిన డేటా లోపమని గుర్తించారు. ఇక వాతావరణంలో మీథేన్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్‌ల ఆనవాళ్లు కూడా కనిపించాయి. అయితే నీటి ఆనవాళ్లు ఉన్నప్పటికీ స్పష్టంగా గుర్తించడం కష్టమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వివరాలు
ఎక్కువగా కార్బన్-ఆక్సిజన్ నిష్పత్తి
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ గ్రహంలో హైడ్రోజన్, హీలియం ఎక్కువగా ఉండి, ఇతర భారమైన మూలకాలు చాలా తక్కువగా ఉన్నాయి. అలాగే కార్బన్-ఆక్సిజన్ నిష్పత్తి కూడా ఎక్కువగా ఉంది. ఈ గ్రహం అంతర్గత భాగంలో మాత్రం లోహ మూలకాలు ఎక్కువగా ఉండే అవకాశముందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఈ పరిశోధన ద్వారా చిన్న నక్షత్రాల చుట్టూ ఉన్న గ్రహాల అధ్యయనంలో ఎదురయ్యే సవాళ్లు, అలాగే వాటి నిజమైన రసాయన స్వభావాన్ని అర్థం చేసుకోవడం ఎంత కష్టం అనేది స్పష్టమైంది.