BepiColombo: 8 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం.. బుధుడి కక్ష్యలోకి బేపీకొలంబో
ఈ వార్తాకథనం ఏంటి
సూర్యుడికి అత్యంత సమీపంలోని గ్రహాల్లో ఒకటైన బుధుడి రహస్యాలను ఛేదించేందుకు చేపట్టిన బేపీకొలంబో మిషన్ కీలక దశకు చేరుకుంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA), జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (JAXA) సంయుక్తంగా చేపట్టిన ఈ మిషన్ 2018 అక్టోబరులో ప్రయోగించారు. అప్పటి నుంచి దాదాపు 6 బిలియన్ మైళ్లు (10 బిలియన్ కిలోమీటర్లు) ప్రయాణించింది. బుధుడి వద్దకు నేరుగా వెళ్లడం కంటే, దాని వేగానికి సరిపోయేలా అంతరిక్ష నౌకను నెమ్మదించడం అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. అందుకే భూమి, శుక్రుడు, బుధుడి చుట్టూ మొత్తం తొమ్మిది గురుత్వాకర్షణ ఫ్లైబైలను ఉపయోగించారు. ప్రస్తుతం మిషన్‌లోని రెండు శాస్త్రీయ ఆర్బిటర్లను ముందుకు నడిపించిన మెర్క్యురీ ట్రాన్స్‌ఫర్ మాడ్యూల్ విడిపోనుంది.
వివరాలు
తీవ్ర వేడి కారణంగా సవాలుగా మారిన మిషన్ నిర్వహణ
బుధుడి గురుత్వాకర్షణలోకి ప్రవేశించిన తర్వాత ESAకి చెందిన మెర్క్యురీ ప్లానెటరీ ఆర్బిటర్ (MPO), JAXAకి చెందిన మెర్క్యురీ మాగ్నెటోస్ఫెరిక్ ఆర్బిటర్ (MIO) వేర్వేరు కక్ష్యల్లో పనిచేయనున్నాయి.
MPO గ్రహం ఉపరితలాన్ని పరిశీలిస్తే, MIO బుధుడి చుట్టూ ఉన్న అంతరిక్ష వాతావరణం, అయస్కాంత క్షేత్రాన్ని అధ్యయనం చేస్తుంది.
సూర్యుడికి కేవలం 5.8 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండే బుధుడిపై పగటి ఉష్ణోగ్రతలు 430 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుతాయి.
ఈ తీవ్ర వేడి కారణంగా మిషన్ నిర్వహణ సవాలుగా మారింది.
ఆర్బిటర్లు బుధుడి ఉపరితలం, క్రేటర్లు, పురాతన అగ్నిపర్వతాల ఆనవాళ్లు, అయస్కాంత క్షేత్రం, పలుచని వాయు పొరను పరిశీలించనున్నాయి.
వివరాలు
బుధుడిపై కనిపించే 'హాలోస్' పై శాస్త్రవేత్తల దృష్టి
ముఖ్యంగా బుధుడిపై కనిపించే 'హాలోస్' అనే వింత గుంతలపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టనున్నారు.
అలాగే చిన్న పరిమాణానికి బుధుడు ఎందుకు ఇంత దట్టంగా ఉన్నాడనే ప్రశ్నకు సమాధానం కనుగొనేందుకు ఈ మిషన్ కీలకంగా మారనుంది.
దీంతో బుధుడి నిర్మాణం, పరిణామంతో పాటు సౌర వ్యవస్థ ఆవిర్భావంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.