'క్లౌడ్'తో టెక్నాలజీ రంగంలో పెను మార్పులు: సత్య నాదెళ్ల
టెక్నాలజీ రంగంలో 'క్లౌడ్'తో పెను మార్పులు జరగబోతున్నాయని, దీని వినియోగం కూడా భారీగా పెరిగిందని మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెళ్ల పేర్కొన్నారు. ముంబయిలో జరిగిన మైక్రోసాఫ్ట్ ఫ్యూచర్ రెడీ లీడర్‌షిప్ సమ్మిట్‌లో నాదెళ్ల మాట్లాడారు. క్లౌడ్ అడాప్షన్ విషయంలో తాము ముందు వరుసలో ఉన్నట్లు స్పష్టం చేశారు. క్లౌడ్ ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదని, 2025 నాటికి చాలా అప్లికేషన్‌లు క్లౌడ్ అందించే మౌలిక వసతుల ఆధారంగా తయారవుతాయని నాదెళ్ల చెప్పారు. ప్రస్తుతం భారత్‌లోని పలు సంస్థలు క్లౌడ్‌ను వినియోగించుకున్నట్లు వివరించారు. భవిష్యత్‌లో దేశంలో టెక్నాలజీ రంగం వృద్ధికి, డిజిటల్ ఇండియాను మరింత ముందుకు తీసుకెళ్లడంలో 'క్లౌడ్'తో పాటు 'కృత్రిమ మేధ(ఏఐ) కీలక పాత్ర పోషిస్తాయన్నారు.
హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసు కేంద్రం
క్లౌడ్ వినియోగం వల్ల ఇధన భారం 70 నుంచి 80శాతం తగ్గుందని చెప్పారు సత్య నాదెళ్ల. అవసరమైనప్పుడు మాత్రమే వినియోగించుకోవడం వల్లే ఈ స్థాయిలో భారం తగ్గుతుందని పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్‌కు ప్రపంచవ్యాప్తంగా 60పైగా రీజియన్‌లు, 200పైగా డేటా సెంటర్లు ఉన్నాయన్నారు. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసు అయిన 'అజూర్' కేంద్రాలు ప్రస్తుతం పుణె, చెన్నై, ముంబయిలో ఉన్నాయని, త్వరలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ప్రతిచోటా అందుబాటులోకి తీసుకురావడానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. కృత్రిమ మేధ(ఏఐ)నుంచి ప్రయోజనాలు పొందాలంటే.. డేటా మౌలిక వసతులు చాలా అవసరమని, అందుకే అందులో తాము పెట్టుబడులు పెడుతున్నట్లు చెప్పారు. నాలుగు రోజుల భారత పర్యటనలో భాగాంగా సత్య నాదేళ్ల హైదరాబాద్‌కు కూడా రానున్నారు.