Break zones: సముద్ర గర్భంలో 'బ్రేక్ జోన్లు'.. భూకంపాలను అడ్డుకునే సహజ కవచం!
ఈ వార్తాకథనం ఏంటి
సముద్ర గర్భంలో ఉన్న కొన్ని రహస్య ప్రాంతాలు భూకంపాల తీవ్రతను అడ్డుకుంటాయని తాజా అధ్యయనం వెల్లడించింది. పరిశోధకుల మాటల్లో ఇవి సహజసిద్ధమైన "బ్రేక్ జోన్లు"లా పనిచేస్తూ భూకంప తరంగాలు మరింత దూరం వ్యాపించకుండా ఆపుతున్నాయి. ఈ ఆసక్తికర అధ్యయనం ప్రముఖ శాస్త్రీయ జర్నల్ సైన్స్‌లో ప్రచురితమైంది. దశాబ్దాలుగా శాస్త్రవేత్తలను వేధిస్తున్న ఒక కీలక ప్రశ్నకు ఈ పరిశోధన సమాధానం ఇచ్చింది. కొన్ని ప్రాంతాల్లో భూకంపాలు ఎందుకు పదేపదే ఒకే స్థాయిలో ఆగిపోతున్నాయి? ఆ అడ్డంకులు అసలు ఏమిటి? అనే అంశాలపై ఇప్పటివరకు స్పష్టత లేకపోయింది. ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన జియాన్హువా గాంగ్, అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీ బ్లూమింగ్టన్‌లో ఎర్త్ అండ్ అట్మాస్ఫెరిక్ సైన్సెస్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
వివరాలు
గోఫర్ ఫాల్ట్ అనే భారీ చీలికపై అధ్యయనం
ఆయన మాట్లాడుతూ, ఈ బ్రేక్ జోన్లు ఉన్నాయని శాస్త్రవేత్తలకు చాలాకాలంగా తెలుసు. కానీ అవి ఎలా ఏర్పడతాయి? ఎందుకు ప్రతిసారి భూకంపాన్ని అదే ప్రాంతంలో ఆపేస్తాయి? అన్నది ఇప్పటివరకు మిస్టరీగానే ఉండేదని తెలిపారు. ఈపరిశోధనలో ప్రధానంగా పసిఫిక్ మహాసముద్రంలో, ఈక్వడార్‌కు సుమారు 1,000 మైళ్ల దూరంలో సముద్ర గర్భంలో ఉన్న "గోఫర్ ఫాల్ట్" అనే భారీ చీలికను అధ్యయనం చేశారు. 30ఏళ్లుగా ఈ ప్రాంతంలో దాదాపు ఒకే తరహా భూకంపాలు సంభవిస్తున్నాయి. ప్రతి ఐదు నుంచి ఆరు సంవత్సరాలకు ఒకసారి రిక్టర్ స్కేలుపై 6 తీవ్రత గల భూకంపాలు అదే ప్రాంతాల్లో నమోదవుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. శాస్త్రవేత్తలు వివరాల ప్రకారం, ఈ "బ్రేక్ జోన్లు" సముద్ర జలం మరియు రాళ్ల కలయికతో ఏర్పడతాయి.
వివరాలు
భూకంప తరంగాల కదలికను అడ్డకుంటాయి
సముద్ర గర్భంలోని ఫాల్ట్ లైన్లు అనేక చిన్న శాఖలుగా విడిపోయి, వాటి మధ్య ఖాళీలు ఏర్పడతాయి. ఆ ఖాళీల్లోకి సముద్రపు నీరు చేరుతుంది. భారీ భూకంపం సంభవించినప్పుడు ఈ రంధ్రాలతో కూడిన రాళ్లు ఒక్కసారిగా బిగుసుకుపోయి భూకంప తరంగాల కదలికను అడ్డుకుంటాయి. దీంతో భూకంపం మరింత వ్యాపించకుండా సహజంగానే ఆగిపోతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి 2008లో, అలాగే 2019 నుంచి 2022 మధ్య జరిగిన రెండు భారీ సముద్ర పరిశోధనల డేటాను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. సముద్ర గర్భంలో ఏర్పాటు చేసిన సీస్మోమీటర్లు వేల సంఖ్యలో చిన్న భూకంపాలను నమోదు చేశాయి.
వివరాలు
భూకంపం జరిగిన వెంటనే ఆ ప్రాంతం నిశ్శబ్దం
ముఖ్యంగా పెద్ద భూకంపాలకు ముందు ఈ బ్రేక్ జోన్లలో తీవ్రమైన కంపనలు కనిపించగా, భూకంపం జరిగిన వెంటనే ఆ ప్రాంతం నిశ్శబ్దంగా మారినట్లు అధ్యయనం వెల్లడించింది. జియాన్‌హువా గాంగ్ మాట్లాడుతూ.. ఈ బ్రేక్ జోన్లు కేవలం నిశ్చల అడ్డంకులు కావు. ఇవి ఫాల్ట్ వ్యవస్థలో చురుకైన, మారుతూ ఉండే భాగాలు. ఇవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడం ద్వారా భూకంపాల పరిమితులపై మన అవగాహన పూర్తిగా మారుతుందని చెప్పారు. ప్రపంచంలోని మరెన్నో సముద్రాల్లో కూడా ఇలాంటి సహజ బ్రేక్ జోన్లు ఉండే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. వీటిపై మరింత అధ్యయనం చేస్తే భవిష్యత్తులో భూకంపాలు ఎప్పుడు, ఎక్కడ సంభవించే అవకాశముందో మరింత కచ్చితంగా అంచనా వేయడానికి ఉపయోగపడుతుందని అంటున్నారు.
వివరాలు
భూకంపాన్ని సృష్టించే సామర్థ్యం కలిగి ఉంది
ప్రస్తుతం అమెరికాలోని హేవార్డ్ ఫాల్ట్ వంటి కొన్ని ప్రధాన ఫాల్ట్ లైన్లు భారీ భూకంపానికి సిద్ధంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ ఫాల్ట్ లైన్ రిక్టర్ స్కేలుపై 7 తీవ్రత గల భూకంపాన్ని సృష్టించే సామర్థ్యం కలిగి ఉంది. ఇది 1989లో కాలిఫోర్నియాలో ప్రాణనష్టం, భారీ విధ్వంసానికి కారణమైన 1989 లోమా ప్రియెటా భూకంపం కంటే మరింత శక్తివంతమైనదిగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.