LOADING...
China: స్పేస్‌-X తరహాలో రాకెట్‌ను విజయవంతంగా ల్యాండ్ చేసిన చైనా

China: స్పేస్‌-X తరహాలో రాకెట్‌ను విజయవంతంగా ల్యాండ్ చేసిన చైనా

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 10, 2026
01:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతరిక్ష పరిశోధనలో చైనా మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. దేశీయంగా అభివృద్ధి చేసిన లాంగ్ మార్చ్‌ 10B రాకెట్ తొలి ప్రయోగంలోనే దాని మొదటి దశ (ఫస్ట్ స్టేజ్)ను విజయవంతంగా తిరిగి ల్యాండ్ చేసి చరిత్ర సృష్టించింది. శుక్రవారం జరిగిన ఈ ప్రయోగంలో రాకెట్ ముందుగా నిర్దేశించిన కక్ష్యలో ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టింది. అనంతరం ఫస్ట్ స్టేజ్ నియంత్రిత పద్ధతిలో భూమి వైపు తిరిగి వచ్చి, సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ నౌకపై ఏర్పాటు చేసిన వల (నెట్) తరహా నిర్మాణంపై సురక్షితంగా దిగింది. ఆర్బిటల్ శ్రేణికి చెందిన రాకెట్‌ను ఈ విధంగా తిరిగి స్వాధీనం చేసుకోవడం చైనా చరిత్రలో ఇదే తొలిసారి.

వివరాలు 

లాంగ్ మార్చ్‌ 10B ప్రత్యేకతలు

లాంగ్ మార్చ్‌ 10B రెండు దశలతో రూపొందించిన రాకెట్. దీని ఎత్తు సుమారు 63 మీటర్లు. మొదటి దశలో కిరోసిన్‌తో పాటు ద్రవ ఆక్సిజన్‌ (LOX)ను ఇంధనంగా ఉపయోగిస్తారు. రెండో దశలో ద్రవ ఆక్సిజన్‌తో పాటు ద్రవ మీథేన్‌ను వినియోగిస్తారు. పునర్వినియోగ సామర్థ్యంతో పనిచేసే ఈ రాకెట్ తక్కువ ఎత్తులోని భూ కక్ష్య (Low Earth Orbit)లోకి గరిష్ఠంగా 16 టన్నుల పేలోడ్‌ను తీసుకెళ్లగలదు. తొలి ప్రయోగంలోనే నిర్దేశిత కక్ష్యలో ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టడం మరో విశేషం.

వివరాలు 

పునర్వినియోగ రాకెట్ టెక్నాలజీలో కీలక ముందడుగు

లాంగ్ మార్చ్‌ 10B తొలి దశను విజయవంతంగా తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్ (CASC) అధికారికంగా ప్రకటించింది. ప్రయోగ వాహనాన్ని వల ఆధారిత వ్యవస్థతో తిరిగి దక్కించుకోవడం ప్రపంచంలోనే తొలిసారని సంస్థ పేర్కొంది. ఈ విజయం పునర్వినియోగ రాకెట్ సాంకేతికతలో కీలక మైలురాయిగా నిలుస్తుందని,భవిష్యత్‌లో చైనా అంతరిక్ష ప్రయోగాల సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు ఇది బలమైన పునాది వేస్తుందని CASC వెల్లడించింది.

Advertisement

వివరాలు 

ఈ ఏడాదిలోనే మళ్లీ ప్రయోగానికి సిద్ధం

తిరిగి స్వాధీనం చేసుకున్న లాంగ్ మార్చ్‌ 10B తొలి దశను ఈ ఏడాది చివరి నాటికే మరోసారి ప్రయోగించాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. అంతరిక్ష ప్రయోగాల్లో పునర్వినియోగ రాకెట్ వ్యవస్థలను విస్తృతంగా వినియోగించడం ద్వారా మిషన్ ఖర్చులను గణనీయంగా తగ్గించాలన్నది చైనా వ్యూహం. తాజా విజయం ఆ దిశగా కీలక అడుగుగా నిలవడంతో పాటు, పునర్వినియోగ రాకెట్ సాంకేతికతలో ఇతర అగ్రదేశాలకు మరింత చేరువయ్యే అవకాశాన్ని కల్పించిందని నిపుణులు భావిస్తున్నారు.

Advertisement