LOADING...
China: విజయవంతమైన చైనా టియాన్‌వెన్-2.. భూమి సమీప గ్రహశకలంపై పరిశోధనలకు శ్రీకారం
విజయవంతమైన చైనా టియాన్‌వెన్-2.. భూమి సమీప గ్రహశకలంపై పరిశోధనలకు శ్రీకారం

China: విజయవంతమైన చైనా టియాన్‌వెన్-2.. భూమి సమీప గ్రహశకలంపై పరిశోధనలకు శ్రీకారం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 07, 2026
01:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనా చేపట్టిన ప్రతిష్ఠాత్మక అంతరిక్ష మిషన్ టియాన్‌వెన్-2 మరో కీలక మైలురాయిని చేరుకుంది. భూమితో కలిసి సూర్యుడి చుట్టూ పరిభ్రమించే చిన్న గ్రహశకలం కామోఓలేవా (Kamo'oalewa) వద్దకు ఈ అంతరిక్ష నౌక విజయవంతంగా చేరుకుంది. ఈ విషయాన్ని చైనా జాతీయ అంతరిక్ష సంస్థ (CNSA) అధికారికంగా ప్రకటించింది. దాదాపు 100 కోట్ల కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేసిన టియాన్‌వెన్-2, లక్ష్య గ్రహశకలం నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలోకి చేరుకుంది. 2025 మే 29న ప్రయోగించిన ఈ మిషన్‌కు అక్కడికి చేరుకోవడానికి సుమారు 400 రోజులు పట్టింది.

వివరాలు 

రిమోట్ సెన్సింగ్ పరిశీలనలు

కామోఓలేవా చేరుకోవడంతో టియాన్‌వెన్-2 శాస్త్రీయ పరిశోధనల అసలు దశ ప్రారంభమైంది. ఈ అంతరిక్ష నౌక గ్రహశకలంపై దిగిన తర్వాత అక్కడి ఉపరితల పదార్థాల నమూనాలను సేకరించనుంది. అలాగే చాల నెలల పాటు రిమోట్ సెన్సింగ్ పరిశీలనలు కూడా నిర్వహించనుంది. ఈ అధ్యయనాల ద్వారా కామోఓలేవా నిర్మాణం, దాని మూలం, రసాయనిక స్వభావం వంటి అంశాలపై శాస్త్రవేత్తలకు మరింత స్పష్టమైన సమాచారం లభించే అవకాశం ఉంది. కామోఓలేవాను 2016లో గుర్తించారు. ప్రస్తుతం భూమి సమీపంలో ఉన్న ఏడు క్వాసీ-మూన్‌లలో ఇది ఒకటి. సుమారు 20 మీటర్ల (66 అడుగులు) వెడల్పు ఉన్న ఈ గ్రహశకలం నిర్మాణం, నాసా అపోలో మిషన్లు చంద్రుడి నుంచి తీసుకొచ్చిన రాళ్లతో పోలి ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి.

వివరాలు 

టియాన్‌వెన్-2లో మొత్తం 11 శాస్త్రీయ పరికరాలు

దీంతో ఇది పురాతన కాలంలో భారీ ఢీకొనడం వల్ల చంద్రుడి నుంచి విడిపోయిన శకలం అయి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. టియాన్‌వెన్-2లో మొత్తం 11 శాస్త్రీయ పరికరాలు ఉన్నాయి. వీటిలో అత్యాధునిక కెమెరాలు, స్పెక్ట్రోమీటర్లు, మాగ్నెటోమీటర్, సౌండింగ్ రాడార్, కణ విశ్లేషణ పరికరాలు, లేజర్ నావిగేషన్ సెన్సర్లు ఉన్నాయి. వీటి సహాయంతో కామోఓలేవా ఆకారం, ఉపరితల నిర్మాణం, అంతర్గత భాగాలు, ఖనిజాల స్వభావంపై విలువైన సమాచారం సేకరించనున్నారు.

Advertisement

వివరాలు 

ధూమకేతువును 2035 నాటికి చేరుకునే అవకాశం

చైనా జాతీయ అంతరిక్ష సంస్థ అంచనా ప్రకారం, టియాన్‌వెన్-2 సేకరించిన నమూనాలను 2027 ఏప్రిల్‌లో భూమికి తీసుకురానుంది. ఆ తర్వాత నమూనాలతో కూడిన క్యాప్సూల్‌ను భూమిపైకి పంపి, తదుపరి లక్ష్యమైన 311P/PANSTARRS అనే ధూమకేతువు వైపు ప్రయాణాన్ని కొనసాగించనుంది. ప్రధాన గ్రహశకలాల వలయంలో ఉన్న ఈ ధూమకేతువును 2035 నాటికి చేరుకునే అవకాశం ఉంది. చైనా చేపట్టిన తొలి గ్రహశకల నమూనాల సేకరణ మిషన్ ద్వారా గ్రహశకలం అసలు మూలం మాత్రమే కాకుండా, చంద్రుడి ఆవిర్భావ చరిత్రకు సంబంధించిన కీలక ఆధారాలు కూడా లభించే అవకాశముందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement