LOADING...
Chinese astronaut: ఏడాది పాటు అంతరిక్షంలో చైనా వ్యోమగామి
ఏడాది పాటు అంతరిక్షంలో చైనా వ్యోమగామి

Chinese astronaut: ఏడాది పాటు అంతరిక్షంలో చైనా వ్యోమగామి

వ్రాసిన వారు Sirish Praharaju
May 25, 2026
10:18 am

ఈ వార్తాకథనం ఏంటి

చంద్రుడిపై మనుషులను దింపే లక్ష్యంతో ముందుకు సాగుతున్న చైనా మరో కీలక అడుగు వేసింది. చైనా చేపట్టిన షెన్‌జౌ-23 (Shenzhou-23) మిషన్ విజయవంతంగా ప్రయాణం ప్రారంభించింది. ఆదివారం ఉత్తర పశ్చిమ చైనాలోని జియుక్వాన్ ప్రయోగ కేంద్రం నుంచి లాంగ్ మార్చ్ 2-ఎఫ్ రాకెట్‌ను ప్రయోగించారు. ఈ రాకెట్ ద్వారా ముగ్గురు వ్యోమగాములను టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రానికి పంపించారు. ఈ మిషన్‌లో తొలిసారి హాంకాంగ్‌కు చెందిన వ్యోమగామి కూడా అంతరిక్ష యాత్రకు వెళ్లడం విశేషంగా మారింది.

వివరాలు 

ఏడాది పాటు అంతరిక్షంలోనే ఉండనున్న వ్యోమగామి

షెన్‌జౌ-23 బృందంలో మాజీ హాంకాంగ్ పోలీస్ అధికారి లై కా-యింగ్, అంతరిక్ష ఇంజనీర్ జూ యాంగ్‌జూ, మాజీ ఎయిర్‌ఫోర్స్ పైలట్ జాంగ్ జియువాన్ ఉన్నారు. వీరు టియాంగాంగ్ స్పేస్ స్టేషన్‌లో జీవ శాస్త్రం, మెటీరియల్స్ సైన్స్, ఫ్లూయిడ్ ఫిజిక్స్, వైద్య రంగాలకు సంబంధించిన పలు ప్రయోగాలు నిర్వహించనున్నారు. ఈ మిషన్‌లో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే.. ఒక వ్యోమగామి పూర్తి ఏడాది పాటు అంతరిక్షంలోనే ఉండనున్నారు. ఎక్కువ కాలం గురుత్వాకర్షణ లేకుండా ఉండటం వల్ల మానవ శరీరంపై ఎలాంటి ప్రభావాలు పడతాయో అధ్యయనం చేయనున్నారు. భవిష్యత్‌లో చంద్రుడు, మంగళ గ్రహ యాత్రలకు ఇది ఉపయోగపడనుంది.

వివరాలు 

దీర్ఘకాల అంతరిక్ష యాత్రలపై నిపుణుల హెచ్చరిక

దీర్ఘకాల అంతరిక్ష యాత్రల్లో అనేక సవాళ్లు ఉంటాయని ఖగోళ భౌతిక శాస్త్రవేత్త రిచర్డ్ డి గ్రిజ్ తెలిపారు. ఎముకల బలహీనత, కండరాల క్షీణత, రేడియేషన్ ప్రభావం, నిద్ర సమస్యలు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. అంతేకాదు.. భూమికి దూరంగా ఉండే సమయంలో నీరు, గాలి రీసైక్లింగ్ వ్యవస్థలు సక్రమంగా పనిచేయడం చాలా కీలకమని చెప్పారు. అత్యవసర వైద్య పరిస్థితులను ఎదుర్కొనే ఏర్పాట్లు కూడా అవసరమని వివరించారు. షెన్‌జౌ-23 వంటి మిషన్ల ద్వారా టియాంగాంగ్ స్పేస్ స్టేషన్‌ను దీర్ఘకాలం నిర్వహించే అనుభవాన్ని చైనా సంపాదిస్తోందని తెలిపారు.

Advertisement

వివరాలు 

చంద్రుడిపై మనుషులను దింపే లక్ష్యంతో చైనా

2030 లోపు చంద్రుడిపై వ్యోమగాములను దింపాలన్న లక్ష్యంతో చైనా వేగంగా ముందుకు సాగుతోంది. ఇందుకోసం అమెరికా నాసా చేపట్టిన ఆర్టెమిస్ కార్యక్రమానికి పోటీగా పలు ప్రాజెక్టులను అమలు చేస్తోంది. ఈ క్రమంలో కొత్తగా అభివృద్ధి చేస్తున్న 'మెంగ్‌జౌ' అంతరిక్ష నౌకను కూడా పరీక్షించనుంది. ఈ ఏడాది చివర్లో దీనికి ఆర్బిటల్ టెస్ట్ ఫ్లైట్ నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న షెన్‌జౌ శ్రేణికి బదులుగా మెంగ్‌జౌను వినియోగించనున్నారు. భవిష్యత్‌లో చైనా వ్యోమగాములను చంద్రుడికి తీసుకెళ్లే బాధ్యత ఈ నౌకదే కానుంది.

Advertisement