Claude AI Controversy: చర్మం రంగుపై క్లాడ్ ఏఐ పరిమితులు.. డేటింగ్ యాప్ సీఈఓ సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
కీపర్ యాప్‌లో భాగంగా పనిచేసే ఆకర్షణ అంచనా మోడల్ వినియోగదారుల అభిరుచులను విశ్లేషించి, వారికి సరిపోయే వ్యక్తులను సూచిస్తుంది. అయితే ఈ మోడల్ కోడ్‌లో క్లాడ్ ఏఐ కొన్ని పరిమితులను చేర్చిందని కొజ్లోస్కీ ఆరోపించారు. గూగుల్‌కు చెందిన జెమిని 4 నియాన్ మోడల్‌తో నిర్వహించిన ఆడిట్‌లో ఈ మార్పులు బయటపడ్డాయని నవంబర్ 27, 28 తేదీల్లో ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టారు. చర్మం రంగుకు సంబంధించిన ప్రాధాన్యతలను తొలగించడంతో పాటు, మరో ఐక్యూ అంచనా మోడల్ పనితీరును కూడా క్లాడ్ దెబ్బతీసిందని ఆయన పేర్కొన్నారు.
Details
6.5 శాతం మంది యూజర్లపై ప్రభావం?
తన ఆరోపణలకు ఆధారాలుగా కొన్ని కోడ్ మార్పులు, టెస్టింగ్ వివరాలను కొజ్లోస్కీ బయటపెట్టారు.
వాటిలో ఒక పరీక్ష ప్రకారం, వినియోగదారుడు చర్మం రంగు, కళ్ల రంగుకు ఇచ్చిన ప్రాధాన్యతలను క్లాడ్ కోడ్ పూర్తిగా తొలగించింది.
ఈ రెండు అంశాలు తనకు చాలా ముఖ్యమని యూజర్ పేర్కొన్నప్పటికీ, మోడల్ వాటిని పరిగణనలోకి తీసుకోలేదని ఆయన వివరించారు.
ఇలా సుమారు 6.5 శాతం మంది వినియోగదారులు తమ రూపానికి సంబంధించిన అభిరుచులను నమోదు చేసినప్పటికీ, ఆ వివరాలు వారికి తెలియకుండానే తొలగిపోయాయని ఆరోపించారు.
Details
కోడ్ మార్పుల వెనుక ఏం జరిగింది?
కీపర్ ఇంజినీరింగ్ బృందం లాగ్స్, స్లాక్ సందేశాలు, కోడ్ మార్పుల చరిత్ర ఆధారంగా కొజ్లోస్కీ ఒక టైమ్‌లైన్‌ను వెల్లడించారు.
అక్టోబర్ 20న మోడల్ ఖచ్చితత్వం పెంచేందుకు సభ్యుల జాతి వివరాలను చేర్చాలని టీమ్ సూచించిందట.
అయితే కొద్దిసేపటికే క్లాడ్ సబ్-ఏజెంట్ చర్మం రంగుకు సంబంధించిన పరిమితిని కూడా అమలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
అక్టోబర్ 22న ఈ పరిమితి కొనసాగుతుందని క్లాడ్ అంతర్గతంగా పేర్కొన్నప్పటికీ, నాయకత్వానికి పంపిన సంక్షిప్త సమాచారంలో ఆ విషయాన్ని ప్రస్తావించలేదని కొజ్లోస్కీ చెబుతున్నారు.
Details
ఉద్దేశపూర్వకంగా చేయలేదు: ఆంత్రోపిక్
ఈ ఆరోపణలను ఆంత్రోపిక్ ఖండించింది. సంస్థకు చెందిన ఎడ్విన్ అర్బస్ స్పందిస్తూ, దీన్ని అతిజాగ్రత్త ప్రవర్తనగా అభివర్ణించారు.
దీర్ఘకాలిక పనుల్లో క్లాడ్ తానే ఏర్పరచుకున్న కొన్ని నియమాలకు అతిగా కట్టుబడటం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తవచ్చని వివరించారు.
ఓపస్ 5.5 సహా పలు మోడళ్లలో ఈ ప్రవర్తన కనిపించిందని, వినియోగదారుల పనిని ఉద్దేశపూర్వకంగా అడ్డుకునేలా క్లాడ్‌కు శిక్షణ ఇవ్వలేదని స్పష్టం చేశారు.
మరోవైపు, ఐక్యూ మోడల్‌కు సంబంధించిన ఆధారాలను ఇంకా సేకరిస్తున్నామని కీపర్ సీఈఓ తెలిపారు.
ఈ వివాదం ఏఐ కోడ్ మార్పులపై స్వతంత్ర తనిఖీల అవసరాన్ని మరోసారి ముందుకు తెచ్చింది.