Grok Chatbot: అసభ్యకర కంటెంట్‌పై ఆందోళన.. 'గ్రోక్' చాట్‌బాట్‌పై ఇండోనేసియాలో నిషేధం!
ఈ వార్తాకథనం ఏంటి
కృత్రిమ మేధ (ఏఐ) టూల్స్‌తో రూపొందుతున్న అసభ్యకర, అశ్లీల కంటెంట్ ఆన్‌లైన్‌లో విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో భారత్ సహా పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈక్రమంలో ఇండోనేసియా కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్స్(X) వేదికలోని గ్రోక్ (Grok)చాట్‌బాట్ వినియోగంపై తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈవిధంగా గ్రోక్‌పై ఆంక్షలు విధించిన తొలి దేశంగా ఇండోనేసియా నిలిచింది. డిజిటల్ వేదికల్లో వ్యాప్తి చెందుతున్న అసభ్యకర కంటెంట్‌ను మానవ హక్కులు, వ్యక్తిగత గౌరవం, పౌరుల భద్రతకు విఘాతం కలిగించే అంశంగా తమ ప్రభుత్వం పరిగణిస్తోందని ఇండోనేసియా మంత్రి మోత్యా హఫీద్ తెలిపారు. మహిళలు, చిన్నారులు సహా సమాజాన్ని ఇలాంటి కంటెంట్ నుంచి రక్షించేందుకే ఈ తాత్కాలిక నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
Details
ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌పై పరిమితులు
ప్రపంచంలో ముస్లిం జనాభా అధికంగా ఉన్న దేశమైన ఇండోనేసియా, ఆన్‌లైన్‌లో అసభ్యకర కంటెంట్ కట్టడికి ఇప్పటికే కఠిన ఆంక్షలు అమలు చేస్తూ వస్తోంది. ఇదే అంశంపై భారత్ కూడా ఇటీవల గ్రోక్ చాట్‌బాట్‌లో వెలువడిన అసభ్యకర కంటెంట్‌పై తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. అటువంటి కంటెంట్‌ను వెంటనే తొలగించాలని ఎక్స్‌ను ఆదేశించడంతో పాటు, తీసుకున్న చర్యలపై నివేదికను సమర్పించాలని భారత ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ఎక్స్ నివేదిక అందించినప్పటికీ, మరింత వివరాలు ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. ఇదే సమయంలో గ్రోక్ చాట్‌బాట్‌లో ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌పై పరిమితులు విధిస్తున్నట్లు ఎక్స్ ప్రకటించింది. ఇకపై ఈ సౌకర్యం కేవలం ప్రీమియమ్ సబ్‌స్క్రైబర్లకే అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.