Cyborg Cockroaches: విపత్తుల్లో ప్రాణాలు కాపాడే బొద్దింకలు.. సూక్ష్మ ఇంజెక్షన్లతో సరికొత్త టెక్నాలజీ
ఈ వార్తాకథనం ఏంటి
భూకంపం వంటి భారీ విపత్తులు జరిగినప్పుడు శిథిలాల కింద చిక్కుకున్న వారికి సాయం అందించడం రెస్క్యూ సిబ్బందికి చాలా కష్టమైన పని. ఇలాంటి ప్రమాదకర ప్రాంతాల్లోకి మనుషులు వెళ్లడం సాధ్యం కానప్పుడు.. భవిష్యత్తులో బొద్దింకలే రక్షకులుగా మారే అవకాశం ఉంది. కెమెరాలు, సూక్ష్మ వైద్య ఇంజెక్షన్ వ్యవస్థలతో కూడిన సైబోర్గ్ బొద్దింకలను సెర్చ్ అండ్ రెస్క్యూ కార్యకలాపాల కోసం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌లాండ్‌కు చెందిన బయోరోబోటిక్స్ పరిశోధకులు, యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ (UNSW) బయోమెడికల్ ఇంజినీర్లతో కలిసి ఈ సరికొత్త సాంకేతికతపై పనిచేస్తున్నారు.
వివరాలు
బాధితులను గుర్తించడమే కాదు.. అత్యవసర సాయం అందించేలా సైబోర్గ్ కీటకాలు
'పారాబార్గ్స్'గా పిలుస్తున్న ఈ సైబోర్గ్ కీటకాలు కూలిపోయిన భవనాలు,గుహలు,శిథిలాలు వంటి ప్రమాదకరమైన ప్రాంతాల్లోకి వెళ్లి బాధితులను గుర్తించడంతో పాటు అవసరమైన సమయంలో అత్యవసర వైద్య సాయం అందించేలా రూపొందిస్తున్నారు.
యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌లాండ్‌కు చెందిన బయోరోబోటిక్స్ ఇంజినీర్ థాంగ్ వో-డోయాన్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు సైబోర్గ్ కీటకాలను కేవలం కదులుతూ సమాచారం సేకరించే పరికరాలుగా మాత్రమే ఉపయోగించేవారని తెలిపారు.
ఇప్పుడు బాధితులను గుర్తించడమే కాకుండా, వారికి అవసరమైన అత్యవసర సాయం అందించేలా వాటిని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
బాధితులకు వైద్య సాయం అందించాలా? వద్దా? అనే కీలక నిర్ణయాలు మాత్రం మనుషుల ఆధీనంలోనే ఉంటాయని స్పష్టం చేశారు.
వివరాలు
కెమెరాలు,ఇంజెక్షన్లతో సైబోర్గ్ బొద్దింకలు.. రెస్క్యూకు కొత్త ప్రయోగం
గత రెండు దశాబ్దాలుగా సైబోర్గ్ కీటకాలను వెతకడం,అన్వేషణ వంటి కార్యకలాపాలకు ఉపయోగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వో-డోయాన్ తెలిపారు.
అయితే,బాధితుడిని గుర్తించిన తర్వాత ఆ వ్యక్తికి నేరుగా ఏదైనా సాయం చేయగలిగేలా వాటిని అభివృద్ధి చేయడమే తమ తదుపరి లక్ష్యమని చెప్పారు.
ఈ ప్రయోగంలో ఉత్తర క్వీన్స్‌లాండ్‌లో కనిపించే 'జెయింట్ బరోయింగ్ కాక్‌రోచ్'(Macropanesthia rhinoceros)అనే భారీ జాతి బొద్దింకలను ఉపయోగించారు.
వాటికి తేలికపాటి ఎలక్ట్రానిక్ పరికరాలు,కెమెరాలను అమర్చారు. అంతేకాకుండా రిమోట్ ద్వారా పనిచేసే ఆటోమేటిక్ ఇంజెక్షన్ వ్యవస్థలను ప్రత్యేకంగా రూపొందించి వాటికి అమర్చారు.
సహజంగా ఉండే వాటి శరీర కదలికలను ఈ సాంకేతికతతో అనుసంధానించడం ద్వారా.. మనుషులు చేరుకోలేని ఇరుకైన,శిథిలాలతో నిండిన ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి త్వరగా అత్యవసర సాయం అందించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
వివరాలు
శిథిలాల్లో ఖచ్చితమైన ఇంజెక్షన్.. 95% విజయవంతం
ప్రయోగాత్మక పరీక్షల్లో ఈ 'పారాబార్గ్స్' దగ్గర నుంచి ఇంజెక్షన్ ఇవ్వడంలో 95 శాతం విజయవంతమయ్యాయి.
లక్ష్యానికి 15 సెంటీమీటర్ల పరిధిలోకి వెళ్లినప్పుడు ఈ స్థాయి విజయాన్ని సాధించాయి.
అయితే, బాధితుడిని గుర్తించడం నుంచి సరైన స్థానానికి చేరుకుని ఇంజెక్షన్ ఇవ్వడం వరకు మొత్తం ప్రక్రియలో 72శాతం విజయవంతమైన ఫలితాలు వచ్చాయి.
పారాబార్గ్స్‌ను సరైన స్థానంలోకి తీసుకెళ్లడం ఈ పరిశోధనలో ప్రధాన సవాళ్లలో ఒకటని పీహెచ్‌డీ విద్యార్థి హై నాన్ లీ తెలిపారు.
బొద్దింక లక్ష్య ప్రాంతానికి చేరుకోవడంతో పాటు ఖచ్చితమైన స్థానంలో నిలబడి, ఇంజెక్షన్ ఇచ్చే సమయంలో కదలకుండా ఉండాల్సి ఉంటుందని వివరించారు.
వివరాలు
బొద్దింకలే ప్రాణరక్షకులు.. రెస్క్యూ ఆపరేషన్లలో కీలక పాత్ర
శిథిలాల్లో లేదా గుహల్లో చిక్కుకుని సాయం కోసం ఎదురుచూస్తున్నసమయంలో.. పెద్ద బొద్దింక తమవైపు రావడం కొంతమందికి ఇబ్బందిగా అనిపించినా,అలాంటి పరిస్థితుల్లో అది ప్రాణాలను కాపాడే కీలకమైన సహాయకుడిగా మారవచ్చని అన్నారు.
ఈ బొద్దింకలకు ఎలక్ట్రోడ్లు,మైక్రోచిప్‌లను అమర్చే సమయంలో వాటికి మత్తుమందు ఇస్తారు. హార్నెస్‌లు తొలగించిన తర్వాత సాధారణ బొద్దింకల్లాగే అవి జీవిస్తాయని పరిశోధకులు తెలిపారు.
ఫైర్ అండ్ రెస్క్యూ ఎన్‌ఎస్‌డబ్ల్యూకు చెందిన సూపరింటెండెంట్ టిమ్ హాసియోటిస్ మాట్లాడుతూ.. ఈ సాంకేతికత భవిష్యత్తులో రెస్క్యూ బృందాల సామర్థ్యాన్ని మరింత పెంచవచ్చని అన్నారు.
మనుషులు సురక్షితంగా వెళ్లలేని ప్రాంతాల్లోకి సైబోర్గ్ కీటకాలు చేరి బాధితులను గుర్తించి,అత్యవసర వైద్యసాయం అందించగలిగితే పట్టణ ప్రాంతాల సెర్చ్ అండ్ రెస్క్యూ కార్యకలాపాల్లో ఇవి మరో కీలక సాధనంగా మారతాయని చెప్పారు.
వివరాలు
బొద్దింకలే ప్రాణరక్షకులు.. రెస్క్యూ ఆపరేషన్లలో కీలక పాత్ర
భవిష్యత్తులో ఒకే రకమైన పనిని చేసే బొద్దింకల బదులు.. ఒక్కోటి ఒక్కో బాధ్యత నిర్వహించేలా ప్రత్యేక సైబోర్గ్ కీటకాల సమూహాలను రంగంలోకి దించాలన్నది పరిశోధకుల లక్ష్యం.
రాబోయే ఐదు నుంచి పదేళ్లలో నిజమైన విపత్తుల సమయంలో ప్రజలను రక్షించేందుకు ఇలాంటి సైబోర్గ్ కీటకాల రెస్క్యూ బృందాలను ఉపయోగించే అవకాశం ఉందని థాంగ్ వో-డోయాన్ ఆశాభావం వ్యక్తం చేశారు.