Loading...
Dutch scientists: ఆఫీస్ యూరిన్‌తో ఎలక్ట్రిక్ కారు ఛార్జింగ్.. ప్రయోగాన్ని సక్సెస్ చేసిన నెదర్లాండ్స్‌ సైంటిస్టులు
ప్రయోగాన్ని సక్సెస్ చేసిన నెదర్లాండ్స్‌ సైంటిస్టులు

Dutch scientists: ఆఫీస్ యూరిన్‌తో ఎలక్ట్రిక్ కారు ఛార్జింగ్.. ప్రయోగాన్ని సక్సెస్ చేసిన నెదర్లాండ్స్‌ సైంటిస్టులు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 09, 2026
05:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

మూత్రంతో విద్యుత్తు ఉత్పత్తి చేయడమే కాదు.. దాంతో ఎలక్ట్రిక్ కార్లను కూడా ఛార్జ్ చేయవచ్చని నెదర్లాండ్స్ శాస్త్రవేత్తలు నిరూపించారు. సాధారణంగా వ్యర్థంగా భావించే మూత్రాన్ని ఉపయోగించి విద్యుత్తు తయారు చేయడంతో పాటు, వ్యవసాయానికి ఉపయోగపడే కీలక పోషకాలను సైతం విజయవంతంగా వేరు చేశారు. ఈ ప్రయోగం భవిష్యత్తులో వ్యర్థాల నిర్వహణకు కొత్త మార్గాలను చూపించే అవకాశముంది.

వివరాలు 

ఫ్రైస్‌లాండ్‌లో పైలట్ ప్రాజెక్ట్

నెదర్లాండ్స్‌లోని ఫ్రైస్‌లాండ్ ప్రాంతంలో ఉన్న ఓ వాటర్ బోర్డ్ కార్యాలయంలో ఈ ప్రయోగాన్ని చేపట్టారు.

'వెట్సస్' అనే వాటర్ టెక్నాలజీ పరిశోధన కేంద్రం ఈ పైలట్ ప్రాజెక్ట్‌ను పర్యవేక్షించింది.

కార్యాలయంలో పనిచేసే సుమారు 260మంది పురుష ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా యూరినల్స్‌ను ఏర్పాటు చేశారు.

వాటిలో సేకరించిన మూత్రాన్ని సాధారణ మురుగునీటిలో కలపకుండా నేరుగా ప్రత్యేక బ్యాక్టీరియా ఆధారిత ఎలక్ట్రోకెమికల్ వ్యవస్థకు తరలించారు.

ఈ విధానంతో తయారైన విద్యుత్తును కార్యాలయంలోని ఎలక్ట్రిక్ కారుకు వినియోగించారు.

ఫలితంగా ఆ వాహనం రోజుకు సుమారు 50 కిలోమీటర్లు ప్రయాణించడానికి సరిపడా ఛార్జింగ్ పొందడం విశేషం.

అంటే వ్యర్థంగా భావించే మూత్రాన్ని వనరుగా మార్చి వాహన అవసరాలకు ఉపయోగపడే విద్యుత్తును ఉత్పత్తి చేయగలమని ప్రయోగం ద్వారా వెల్లడైంది.

వివరాలు 

బ్యాక్టీరియాతో విద్యుత్తు ఉత్పత్తి

ఈ సాంకేతికతలో బ్యాక్టీరియా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆక్సిజన్ లేని వాతావరణంలో బ్యాక్టీరియా మూత్రంలో ఉండే కర్బన పదార్థాలను విచ్ఛిన్నం చేస్తుంది.

ఈ ప్రక్రియలో ఎలక్ట్రాన్లు విడుదలవుతాయి. అవి ప్రవహించడం ద్వారా విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది.

అయితే మూత్రాన్ని ముందుగానే వేరుగా సేకరించడం ఈ ప్రక్రియలో కీలకమైన అంశం.

సాధారణ మురుగునీటితో కలిసిపోయిన తర్వాత కాకుండా.. మూత్రాన్ని ప్రత్యేకంగా సేకరించడం వల్ల దానిలోని పదార్థాలను సమర్థంగా వినియోగించుకోవడానికి వీలైంది.

ADVERTISEMENT

వివరాలు 

విద్యుత్తుతో పాటు ఎరువులకు ఉపయోగం

ఈ ప్రక్రియ ప్రయోజనం విద్యుత్తు ఉత్పత్తితో మాత్రమే ఆగిపోలేదు. మూత్రం నుంచి అమ్మోనియా, ఫాస్ఫేట్ వంటి విలువైన పోషకాలను కూడా పరిశోధకులు వేరు చేశారు.

మొత్తం మురుగునీటిలో మూత్రం పరిమాణం ఒక శాతం కంటే తక్కువగా ఉన్నప్పటికీ.. అందులో మొత్తం నైట్రోజన్‌లో 85-90 శాతం, ఫాస్ఫరస్‌లో 50-80 శాతం వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మూత్రం నుంచి వేరు చేసిన ఈ పోషకాలను భవిష్యత్తులో ఎరువుల తయారీలో ఉపయోగించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు.

దీంతో ఒకవైపు వ్యర్థంగా భావించే మూత్రం నుంచి విద్యుత్తు పొందడంతో పాటు.. మరోవైపు వ్యవసాయానికి అవసరమైన పోషకాలను తిరిగి వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుంది.

ADVERTISEMENT

వివరాలు 

తర్వాతి లక్ష్యం హైడ్రోజన్ ఉత్పత్తి

ప్రస్తుతం ఈ సాంకేతికత ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. అయితే ప్రయోగంలో వచ్చిన ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో దీనిని మరింత అభివృద్ధి చేయాలని పరిశోధకులు భావిస్తున్నారు.

భవిష్యత్తులో భారీ స్థాయిలో విద్యుత్తును ఉత్పత్తి చేయడంతో పాటు హైడ్రోజన్‌ను కూడా తయారు చేయాలన్నది వారి లక్ష్యం.

వ్యర్థాల నుంచి శక్తి, వ్యవసాయానికి ఉపయోగపడే పోషకాలను ఒకేసారి పొందే సాంకేతికతగా ఇది అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

ADVERTISEMENT