zero-gravity yoga: అంతరిక్షంలో యోగా చేసిన వ్యోమగామి.. వైరల్‌గా మారిన వీడియో!
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో వ్యోమగాముల దైనందిన జీవితం ఎలా ఉంటుందో అప్పుడప్పుడు బయటకు వచ్చే వీడియోలు ఆసక్తిని కలిగిస్తుంటాయి. తాజాగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ)కు చెందిన వ్యోమగామి సోఫీ అడెనాట్ అంతరిక్షంలో యోగా చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది నెటిజన్లను ఆకట్టుకుంటోంది. భూమ్యాకర్షణ ప్రభావం లేని మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో తేలియాడుతూ ఆమె చేసిన 'యిన్ యోగా' విన్యాసాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. సోఫీ అడెనాట్ భూమిపై ఉన్నప్పటి నుంచే యోగాను తన రోజువారీ జీవితంలో భాగంగా చేసుకున్నారు. అదే అలవాటును అంతరిక్షంలోనూ కొనసాగిస్తున్నారు.
వివరాలు
ప్రతిరోజూ సాయంత్రం 30 నిమిషాలు యోగాతో సేద తీరుతానని వెల్లడి
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఆమె.. రోజంతా పనులతో బిజీగా గడిచిన తర్వాత ప్రతిరోజూ సాయంత్రం సుమారు 30 నిమిషాల పాటు యిన్ యోగా సాధన చేస్తానని వెల్లడించారు.
ఈ సాధన తనకు శారీరకంగా, మానసికంగా ఎంతో ఉపశమనం కలిగిస్తుందని పేర్కొన్నారు.
భూమిపై చేసే సాధారణ యోగాతో పోలిస్తే అంతరిక్షంలో యోగా చేయడం పూర్తిగా భిన్నమైన అనుభవం.
యిన్ యోగాలో ఆసనాలను నెమ్మదిగా చేస్తూ కొంతసేపు అదే భంగిమలో కొనసాగాల్సి ఉంటుంది.
అయితే జీరో గ్రావిటీ కారణంగా శరీరానికి స్థిరమైన ఆధారం లభించదు. దీంతో ప్రతి ఆసనాన్ని సరిగ్గా చేయడం సవాలుగా మారుతుంది.
వివరాలు
నెటిజన్లు ప్రశంసలు
ఈ ఇబ్బందిని అధిగమించేందుకు సోఫీ అంతరిక్ష కేంద్రంలోని గోడలకు అమర్చిన హ్యాండిల్స్‌ను ఉపయోగిస్తున్నారు.
అలాగే పాదాలకు ప్రత్యేక పట్టీలు ధరించడంతో పాటు శరీర సమతుల్యతను కాపాడేందుకు కోర్ కంట్రోల్‌పై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు.
ఈ విధానాల వల్ల అవసరమైన కండరాల స్ట్రెచింగ్‌ను సమర్థంగా పూర్తి చేయగలుగుతున్నట్లు ఆమె వివరించారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతుండగా నెటిజన్లు ప్రశంసలతో స్పందిస్తున్నారు.
"స్పేస్‌లో యోగా చేయడం చూడటం అద్భుతంగా ఉంది" అని ఒకరు కామెంట్ చేయగా, "భూమ్యాకర్షణ లేకుండా ఆసనాలు వేయడం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది" అని మరొకరు అభిప్రాయపడ్డారు.
"సైన్స్, కళ, వినోదం అన్నింటినీ ఒకేచోట చూపిస్తూ ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నారు" అంటూ మరికొందరు ప్రశంసలు కురిపించారు.
వివరాలు
త్వరలో పూర్తిస్థాయి వీడియో రిలీజ్ చేస్తానని తెలిపిన ఆస్ట్రోనాట్
అంతరిక్షంలో మానవ శరీరం ఎలా స్పందిస్తుంది? అక్కడ యోగా సాధన కోసం ఎలాంటి మార్పులు చేసుకోవాల్సి వస్తుంది? వంటి అంశాలపై త్వరలోనే మరింత వివరాలతో కూడిన పూర్తి వీడియోను విడుదల చేస్తానని సోఫీ అడెనాట్ వెల్లడించారు.
వ్యోమగాములు కేవలం శాస్త్రీయ ప్రయోగాలకే పరిమితం కాకుండా, తమ శారీరక దృఢత్వం,మానసిక ప్రశాంతతను కాపాడుకునేందుకు యోగా వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను కూడా పాటిస్తున్నారని ఈ వీడియో స్పష్టం చేస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జీరో గ్రావిటీలో యోగా
European Space Agency (ESA) astronaut Sophie Adenot recently offered a rare peek into life aboard the International Space Station (ISS).
— NDTV (@ndtv) July 28, 2026
In a video shared on Instagram, Adenot demonstrated her yin yoga routine in microgravity, showing online users what it takes to find balance… pic.twitter.com/mBey7akSll