signal to Earth: 15,000 లైట్ ఇయర్స్ దూరంలో రహస్య ఆబ్జెక్ట్.. ప్రతి 22 నిమిషాలకు భూమికి మెసేజ్!
ఈ వార్తాకథనం ఏంటి
అంతరిక్షం నుంచి భూమికి వస్తున్న ఓ వింత సిగ్నల్ ఇప్పుడు శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది. 1988 నుంచే ప్రతి 22 నిమిషాలకు ఒకసారి ఈ రహస్య సంకేతం భూమిని తాకుతోంది. GPM J1839-10గా గుర్తించిన ఈ ఆబ్జెక్ట్ ప్రతి సారి కొన్ని సెకన్ల నుంచి 5 నిమిషాల వరకు రేడియో పల్స్ పంపుతోంది. సాధారణంగా ఇలాంటి రేడియో బర్స్‌ట్లు పుల్సార్‌ల నుంచి వస్తాయి. పుల్సార్‌లు అంటే చనిపోయిన నక్షత్రాల అవశేషాలు. అవి అత్యంత వేగంగా తిరుగుతూ ప్రతి కొన్ని మిల్లీ సెకన్లకో,కొన్నిసెకన్లకో సంకేతాలు ఇస్తుంటాయి. కానీ GPM J1839-10 మాత్రం సుమారు 1,000 సెకన్లకు ఒకసారి మాత్రమే సిగ్నల్ ఇస్తోంది. అంటే ఇది చాలా నెమ్మదిగా తిరుగుతున్న న్యూట్రాన్ స్టార్ అయి ఉండొచ్చని భావిస్తున్నారు.
వివరాలు
ప్రతి 22 నిమిషాలకు ఒకే తరహా రేడియో బర్స్‌ట్లు
అయితే అంత నెమ్మదిగా కదిలే నక్షత్ర అవశేషం ఇంత బలమైన సంకేతం ఇవ్వడం ఖగోళ శాస్త్ర నియమాలకు విరుద్ధంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆబ్జెక్ట్ స్క్యూటమ్ నక్షత్ర మండలంలో భూమి నుంచి దాదాపు 15,000 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. 2022లో కర్టిన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీన్ని గుర్తించారు. జెయింట్ మీట్రేవేవ్ రేడియో టెలిస్కోప్, వెరీ లార్జ్ అరే టెలిస్కోప్ పాత డేటాను పరిశీలించగా 1988 నుంచే ఇది సిగ్నల్ పంపుతోందని తేలింది. అప్పటి నుంచి ప్రతి 22 నిమిషాలకు ఒకే తరహా రేడియో బర్స్‌ట్లు వస్తూనే ఉన్నాయి. ఈ వింత సిగ్నల్‌పై పలువురు శాస్త్రవేత్తలు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
వివరాలు
అంతరిక్షంలో రహస్య ఆబ్జెక్టులపై శాస్త్రవేత్తల అధ్యయనం
ఇది చాలా దీర్ఘ కాలం తిరిగే మాగ్నెటార్ కావొచ్చని, లేదా వైట్ డ్వార్ఫ్ పుల్సార్ కావచ్చని అనుమానిస్తున్నారు. సాధారణంగా పుల్సార్‌లు ఒక దశకు వచ్చాక సిగ్నల్ ఇవ్వడం ఆపేస్తాయి. కానీ ఈ ఆబ్జెక్ట్ మాత్రం ఆ "డెత్ లైన్" అంచున ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ ఆవిష్కరణతో ఖగోళ శాస్త్రంలో కొత్త చర్చ మొదలైంది. ఇప్పటివరకు నెమ్మదిగా కదిలే నక్షత్ర అవశేషాలు ఇంత బలమైన, క్రమం తప్పని రేడియో సంకేతాలు ఇస్తాయని ఎవరూ ఊహించలేదు. దీంతో అంతరిక్షంలో ఇంకా ఎలాంటి రహస్య ఆబ్జెక్టులు ఉన్నాయన్నదానిపై శాస్త్రవేత్తలు మళ్లీ అధ్యయనం చేస్తున్నారు.