Female astronauts: మహిళా వ్యోమగాములకు ఊరట.. సక్సెస్ అయిన మెన్స్ట్రువల్ కప్ టెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
అంతరిక్ష ప్రయాణ పరిస్థితుల్లో మహిళలు ఉపయోగించేందుకు మెన్స్ట్రువల్ కప్పులు సరిపోతాయా అన్న దానిపై శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా పరీక్ష విజయవంతమైంది. కార్నెల్ యూనివర్సిటీకి చెందిన లిజియా ఎఫ్. కోయెల్హో నేతృత్వంలోని 'అస్ట్రోకప్' మిషన్‌లో భాగంగా నాలుగు వాణిజ్య మెన్స్ట్రువల్ కప్పులను రాకెట్ ద్వారా పంపగా, అందులో రెండింటిని అంతరిక్షానికి తీసుకెళ్లి, మిగతా రెండింటిని భూమిపైనే ఉంచి పరీక్షించారు. అంతరిక్షంలో ఎదురయ్యే భారీ వేగం, ఉష్ణోగ్రత మార్పులు, పీడన వ్యత్యాసాల మధ్య కూడా కప్పుల్లో ఎటువంటి దెబ్బతినలేదని, వాటి ఆకారం, బలం యథాతథంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. నీరు, గ్లిసెరాల్‌తో చేసిన లీకేజీ పరీక్షల్లో ఎక్కడా లీక్ లేకుండా కప్పులు పూర్తిగా పనిచేశాయని వెల్లడించారు.
వివరాలు
మహిళా వ్యోమగాములకు మరింత స్వేచ్ఛతో ఆరోగ్య సంరక్షణకు అవకాశం
దీంతో పునర్వినియోగించగల మెన్స్ట్రువల్ ఆరోగ్య సాధనాలు కఠినమైన అంతరిక్ష వాతావరణంలో కూడా ఉపయోగపడతాయన్న విషయానికి స్పష్టమైన ఆధారం లభించింది. దీర్ఘకాల అంతరిక్ష మిషన్లలో వ్యర్థాలను తగ్గిస్తూ, మహిళా వ్యోమగాములకు మరింత స్వేచ్ఛతో ఆరోగ్య సంరక్షణకు అవకాశం కల్పించడంలో ఇది కీలక ముందడుగుగా పరిశోధకులు అభివర్ణిస్తున్నారు. అంతరిక్షంలో ఆరోగ్య సంబంధ స్వాతంత్ర్యం గురించి గంభీర చర్చ అవసరమని కోయెల్హో కోరుతూ, "ఇంతవరకు మెన్స్ట్రువల్ పరికరాలు అంతరిక్షంలో ఎందుకు లేవన్న ప్రశ్న నన్నెంతో ఆలోచింపజేస్తోంది" అని వ్యాఖ్యానించారు. ఆరు నెలల వరకు కొనసాగే మిషన్లలో నెలసరి నిలిపివేతకు హార్మోన్లపై ఆధారపడకుండా మెన్స్ట్రువల్ కప్పులు మహిళా వ్యోమగాములకు భద్రతకు ప్రత్యామ్నాయంగా మారనున్నాయి.