New Planet: నక్షత్రం బూడిద నుంచి కొత్త గ్రహం.. తొలిసారి కీలక ఆధారాలు గుర్తింపు
ఈ వార్తాకథనం ఏంటి
అంతరిక్ష పరిశోధనలో శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. చనిపోయిన నక్షత్రం అవశేషాల నుంచి ఏర్పడి ఉండొచ్చని భావిస్తున్న ఓ గ్రహానికి తొలిసారిగా ఆధారాలు గుర్తించారు. భూమికి సుమారు 270 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న తెల్ల మరుగుజ్జు నక్షత్రం(White Dwarf) HS 0209+0832 చుట్టూ ఈ గ్రహం తిరుగుతున్నట్లు పరిశోధకులు భావిస్తున్నారు. ఈ అధ్యయనం Nature Astronomyలో ప్రచురితమైంది.సూర్యుడి లాంటి నక్షత్రం జీవితాంతంలో భారీగా విస్తరించి రెడ్ జెయింట్‌గా మారుతుంది. ఆ తర్వాత తన బయటి పొరలను అంతరిక్షంలోకి వదిలి,వేడిగా, అత్యంత సాంద్రతతో ఉన్న చిన్న కోర్‌గా మిగులుతుంది. దీనినే తెల్ల మరుగుజ్జు అంటారు. ఆ నక్షత్రం ఏర్పడిన సమయంలోనే పుట్టిన కొన్ని గ్రహాలు దూరంగా ఉంటే ఈ ప్రక్రియను తట్టుకుని బతకగలవు.
వివరాలు
నియోబియం ఆనవాళ్లు.. గ్రహం ఉనికికి కీలక సంకేతాలు
అయితే చనిపోయిన నక్షత్రం నుంచి వెలువడిన పదార్థంతో కొత్తగా ఏర్పడే రెండో తరం గ్రహంకు ఇప్పటివరకు ప్రత్యక్ష ఆధారాలు లేవు.
హబుల్ స్పేస్ టెలిస్కోప్ తదితర పరికరాలతో చేసిన పరిశీలనల్లో HS 0209+0832 ఉపరితలంపై అసాధారణమైన భారీ మూలకాల ఆనవాళ్లు కనిపించాయి.
ముఖ్యంగా నియోబియం (Niobium) అధికంగా ఉన్నట్లు గుర్తించారు.
నక్షత్రం చనిపోయే సమయంలో ఏర్పడిన పదార్థం గ్రహంపై నుంచి తెల్ల మరుగుజ్జుపై పడుతుండటం వల్లే ఈ మూలకాలు కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
అంతేకాకుండా నాసాకు చెందిన TESS పరిశీలనల్లో ప్రతి 4.4 రోజులకు ఒకసారి వెలుతురు స్వల్పంగా మారుతున్న సంకేతం కనిపించింది.
ఇది తెల్ల మరుగుజ్జు చుట్టూ భారీ గ్రహం తిరుగుతుండొచ్చనే అంచనాకు బలం చేకూర్చింది.
వివరాలు
జీవానికి అనుకూల పరిస్థితులపై ఆశలు
అయితే ఇది ఇంకా గ్రహంగా నిర్ధారణ కాలేదు. కేవలం గ్రహ అభ్యర్థి మాత్రమే అని పరిశోధకులు స్పష్టం చేశారు.
తెల్ల మరుగుజ్జు నక్షత్రాలు కాలం గడిచే కొద్దీ చల్లబడతాయి. అందువల్ల వాటి నివాసయోగ్య ప్రాంతం చాలా కాలం స్థిరంగా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
రెండో తరం గ్రహం ఏర్పడితే అది కోట్ల కోట్ల సంవత్సరాల పాటు జీవానికి అనుకూల పరిస్థితుల్లో ఉండే అవకాశం ఉంది.
ఈ గ్రహం ఎలా ఏర్పడిందన్నది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియదు.
వివరాలు
భవిష్యత్తులో మరిన్ని పరిశీలనలు
నక్షత్రం రెడ్ జెయింట్‌గా ఉన్నప్పుడు మరో నక్షత్రం లేదా బ్రౌన్ డ్వార్ఫ్ దాని దగ్గరకు వచ్చి లోపలికి పడిపోవడం వల్ల వాయువు, ధూళి డిస్క్‌గా మారి, దానిలో నుంచి కొత్త గ్రహం ఏర్పడి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
పరిశోధకులు హబుల్, చంద్ర ఎక్స్‌రే అబ్జర్వేటరీతో మరిన్ని పరిశీలనలు చేయనున్నారు. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ పరిశీలనలకు కూడా సమయం కోరారు.
గ్రహం నిర్ధారణ అయితే ఇది పూర్తిగా కొత్త తరగతికి చెందిన గ్రహంగా నిలుస్తుంది.
అంతేకాదు, భవిష్యత్తులో మన సూర్యుడు తెల్ల మరుగుజ్జుగా మారిన తర్వాత కూడా సౌర వ్యవస్థలో కొత్త గ్రహాలు ఏర్పడే అవకాశం ఉందనే ఆసక్తికర ప్రశ్నను ఈ పరిశోధన లేవనెత్తుతోంది.