Google Fitbit Air: హార్ట్‌రేట్ నుంచి స్లీప్ స్కోర్ వరకు.. అన్నీ చూసే గూగుల్ ఏఐ ట్రాకర్
ఈ వార్తాకథనం ఏంటి
గూగుల్ తన ఫిట్‌నెస్ విభాగంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. స్మార్ట్‌వాచ్ ఫీచర్లకన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆరోగ్య మార్గదర్శక సేవలపై దృష్టి సారిస్తూ 'ఫిట్‌బిట్ ఎయిర్' పేరుతో కొత్త ఫిట్‌నెస్ ట్రాకర్‌ను పరిచయం చేసింది. ఇదే సమయంలో 'గూగుల్ హెల్త్' అనే కొత్త యాప్‌ను కూడా విడుదల చేసింది. అదనంగా AI ఆధారిత 'హెల్త్ కోచ్' సేవలను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పరిణామాలు గూగుల్ ఇప్పుడు హార్డ్‌వేర్ కంటే సాఫ్ట్‌వేర్ ఆధారిత ఆరోగ్య సేవలపైనే ఎక్కువగా దృష్టి పెడుతోందని స్పష్టం చేస్తున్నాయి. సాధారణ ఫిట్‌నెస్ బ్యాండ్లకు భిన్నంగా ఫిట్‌బిట్ ఎయిర్‌ను రూపొందించారు. ఇందులో స్క్రీన్, నోటిఫికేషన్లు లేదా గడియారం వంటి ఫీచర్లు ఉండవు.
వివరాలు
కేవలం 12 గ్రాముల బరువు మాత్రమే
కేవలం 12 గ్రాముల బరువుతో ఇది అత్యంత తేలికైన ఫిట్‌నెస్ ట్రాకర్‌గా వస్తోంది. ఈ డివైస్ ధర 100 డాలర్లు, అంటే భారత కరెన్సీలో సుమారు రూ.8,300గా నిర్ణయించారు. అలాగే బాస్కెట్‌బాల్ స్టార్ స్టీఫెన్ కర్రీ ప్రత్యేక ఎడిషన్ ధరను 130 డాలర్లుగా నిర్ణయించారు. వినియోగదారుడు పదేపదే స్క్రీన్ వైపు చూడకుండా, నిశ్శబ్దంగా బ్యాక్‌గ్రౌండ్‌లో ఆరోగ్య డేటాను సేకరించడమే దీని ప్రధాన ఉద్దేశంగా గూగుల్ చెబుతోంది. ఫిట్‌బిట్ ఎయిర్ హృదయ స్పందన రేటు, నిద్ర దశలు, స్లీప్ స్కోర్, గుండె లయలో మార్పులు (AFib alerts) వంటి అంశాలను పర్యవేక్షిస్తుంది. అలాగే ఒత్తిడి స్థాయిలను అంచనా వేయడానికి ఉపయోగపడే హెచ్‌ఆర్‌వీ డేటాను కూడా అందిస్తుంది.
వివరాలు
140 రకాల వ్యాయామాలను గుర్తించగలదు
నడక, రన్నింగ్, సైక్లింగ్, రోయింగ్ సహా దాదాపు 140 రకాల వ్యాయామాలను ఇది ఆటోమేటిక్‌గా గుర్తించగలదు. ఈ డేటాను గూగుల్ జెమిని ఆధారిత AI విశ్లేషించి వినియోగదారులకు వ్యక్తిగత ఫిట్‌నెస్ ప్లాన్‌లు, నిద్రకు సంబంధించిన సూచనలు అందిస్తుంది. ఇందులో స్మార్ట్ వేక్ అలారం, సైలెంట్ వైబ్రేషన్ అలారం, రెడీనెస్ స్కోర్, కార్డియో లోడ్ వంటి ఆధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి. గత మోడళ్లతో పోలిస్తే ఇది 15 శాతం అధిక ఖచ్చితత్వంతో పనిచేస్తుందని గూగుల్ పేర్కొంది. ఇక మే 19 నుంచి ప్రస్తుతం ఉన్న ఫిట్‌బిట్ యాప్ ఆటోమేటిక్‌గా 'గూగుల్ హెల్త్' యాప్‌గా అప్‌డేట్ అవుతుందని కంపెనీ వెల్లడించింది. ఫిట్‌బిట్ వినియోగదారుల పాత డేటా మొత్తం ఈ కొత్త యాప్‌లోకి బదిలీ అవుతుంది.
వివరాలు
మెడికల్ రిపోర్టులు, ఫోటోలను విశ్లేషించి సరైన టిప్స్ ఇస్తుంది
కొత్త గూగుల్ హెల్త్ యాప్‌లో Today, Fitness, Sleep, Health అనే నాలుగు ప్రధాన విభాగాలు ఉంటాయి. వేరబుల్స్ డేటాతో పాటు ఆపిల్ హెల్త్, హెల్త్ కనెక్ట్, మెడికల్ రికార్డులను కూడా ఒకే ప్లాట్‌ఫామ్‌లో సమీకరించే సదుపాయం ఇందులో ఉంటుంది. అలాగే గూగుల్ హెల్త్ ప్రీమియం సభ్యుల కోసం 'AI హెల్త్ కోచ్' సేవను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇది యూజర్ ఆరోగ్య డేటాతో పాటు అప్‌లోడ్ చేసిన మెడికల్ రిపోర్టులు, ఫోటోలను విశ్లేషించి సరైన వర్కవుట్ ప్లాన్‌లు, రికవరీ సూచనలు అందిస్తుంది. ఫిట్‌బిట్ ఎయిర్ ప్రస్తుతం ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉండగా, మే 26 నుంచి అధికారిక అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. భారత్‌లో ఈ డివైస్ విడుదలపై గూగుల్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.