Radiation: రేడియేషన్ నుంచి మనల్ని కాపాడే ఫంగస్‌ను గుర్తించిన శాస్త్రవేత్తలు
ఈ వార్తాకథనం ఏంటి
మనుషులు ప్రతిరోజూ రకరకాల రేడియేషన్‌కు గురవుతుంటారు. రేడియో తరంగాలు,మైక్రోవేవ్‌లు,వై-ఫై, మొబైల్ సిగ్నల్స్,అంతరిక్షం నుంచి వచ్చే కాస్మిక్ కిరణాలు ఇందులో ఉన్నాయి. వీటితోపాటు ఇళ్లలోకి చొచ్చుకొచ్చే రాడాన్ కూడా సహజ రేడియేషన్‌కు ప్రధాన కారణాల్లో ఒకటి. ఏడాదిలో మనిషి పొందే సహజ రేడియేషన్ మోతాదులో 50శాతానికి పైగా రాడాన్ వల్లే వస్తుందని చెబుతున్నారు. తాజాగా మన శరీరంలో ఉండే ఓ ప్రత్యేకమైన ఫంగస్ రేడియేషన్ ప్రభావం నుంచి కొంత రక్షణ కల్పించగలదని శాస్త్రవేత్తలు గుర్తించారు. చైనాకు చెందిన శాస్త్రవేత్తల బృందం చేసిన పరిశోధనలో'మ్యూకర్ రేసిమోసస్'(Mucor racemosus) అనే ఫంగస్ మన పేగుల్లో సహజీవిగా ఉంటుందని గుర్తించారు. ఇది రేడియేషన్ వల్ల కలిగే నష్టాన్ని పలు మార్గాల్లో తగ్గించగలదని తేలింది.ఈ అధ్యయనం PNAS జర్నల్‌లో ప్రచురితమైంది.
వివరాలు
రేడియేషన్ ప్రభావాన్ని తగ్గించిన ఫంగస్.. ఎలుకలపై ప్రయోగంలో వెల్లడి
ఈ ఫంగస్ నిజంగా రేడియేషన్ ప్రభావాన్ని తగ్గిస్తుందా అనే విషయాన్ని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ఎలుకలపై ప్రయోగాలు చేశారు.
కొన్ని ఎలుకలకు మ్యూకర్ రేసిమోసస్ ఫంగస్‌ను అందించి,వాటిని రేడియేషన్‌కు గురిచేశారు.
ఫంగస్ ఇవ్వని ఎలుకలతో పోలిస్తే వీటిలో బరువు తగ్గడం,వాపు,కణాల్లో ఆక్సిడేటివ్ ఒత్తిడి తక్కువగా కనిపించాయి.
దీంతో ఫంగస్ అందుకున్న ఎలుకల శరీరంలో రేడియేషన్ నుంచి రక్షణ కలిగే ప్రభావం ఏర్పడినట్లు పరిశోధకులు గుర్తించారు.
పేగుల్లో కనిపించే పరిస్థితులకు ముందుగానే ఫంగస్‌ను అలవాటు చేయడంతో ఈ రక్షణ మరింత పెరిగింది.
సూక్ష్మజీవులు లేని మరో బృందం ఎలుకలకు కూడా ఈ ఫంగస్‌ను అందించారు.
వాటిలోనూ రేడియేషన్ వల్ల కలిగే నష్టానికి సంబంధించిన సూచీలు తగ్గాయి.
వివరాలు
రేడియేషన్ నష్టాన్ని తగ్గించే ఫంగస్ రహస్యం ఇదే!
"మ్యూకర్ రేసిమోసస్ ఎలుకల్లో రేడియేషన్ కారణంగా పేగులకు కలిగే నష్టాన్ని నేరుగా తగ్గిస్తుంది" అని పరిశోధకులు పేర్కొన్నారు.
ఈ ఫంగస్ రేడియేషన్ నుంచి ఎలా రక్షణ కల్పిస్తుందో తెలుసుకునేందుకు మరిన్ని పరీక్షలు చేశారు.
ఇందులో భాగంగా ఫంగస్ మూడు అమైనో ఆమ్లాలను ఉత్పత్తి చేస్తున్నట్లు గుర్తించారు. అవి ఎల్-గ్లుటామిక్ యాసిడ్,ఎల్-అస్పార్టిక్ యాసిడ్,డీఎల్-లైసిన్.
ఈ మూడు పదార్థాలు డీఎన్‌ఏ మరమ్మతుకు సహాయపడటంతోపాటు రేడియేషన్‌కు గురైన తర్వాత పేగుల కణజాలం కోలుకునేందుకు తోడ్పడినట్లు పరిశోధనలో తేలింది.
ఈ ఫంగస్ మరో మార్గంలోనూ రేడియేషన్ ప్రభావాన్ని తగ్గించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఇది 'మిథైల్‌థయోఅడెనోసిన్' (MTA) అనే రసాయనాన్ని ఉత్పత్తి చేస్తుంది.
ఈ రసాయనం 'లిమోసిలాక్టోబాసిల్లస్ ర్యూటెరి' (Limosilactobacillus reuteri) అనే బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రిస్తుంది.
వివరాలు
పేగుల వాపు తగ్గించిన ఫంగస్.. మనుషులపై ఇంకా అధ్యయనాలు
అనంతరం ఆ బ్యాక్టీరియాలో మార్పులు కలిగించి'మిథయోనిన్' అనే రసాయనం ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది.
దీంతో రేడియేషన్ నుంచి రక్షణ మరింత పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు.
మరో ప్రయోగంలో రేడియేషన్‌కు గురైన ఎలుకలకు ఈ ఫంగస్‌తో పులియబెట్టిన చీజ్‌ను అందించారు.
దీంతో పేగుల్లో వాపు తగ్గడంతోపాటు పేగుల లోపలి రక్షణ పొర బలపడినట్లు గుర్తించారు.
శరీరం మొత్తంలో వాపునకు సంబంధించిన సూచీలు కూడా తగ్గాయి. ఈ ఫంగస్ ఇప్పటికే కొన్ని పులియబెట్టిన ఆహార పదార్థాల్లో కనిపిస్తుందని పరిశోధకులు తెలిపారు.
అయితే పేగుల్లోని సూక్ష్మజీవుల సమతుల్యతను మెరుగుపరచడానికి లేదా రేడియేషన్ ప్రభావాన్ని తగ్గించడానికి దీన్ని మనుషులకు ఉపయోగించవచ్చా అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.
అందుకోసం మరిన్ని పరిశోధనలు అవసరమని శాస్త్రవేత్తలు వెల్లడించారు.