Loading...
Digital Camouflage shirt: ఈ డ్రెస్‌ వేసుకుంటే ఏఐ కెమెరాలకు చిక్కరట.. డిజైనర్‌ చేసిన ప్రయోగం వైరల్
ఈ డ్రెస్‌ వేసుకుంటే ఏఐ కెమెరాలకు చిక్కరట.. డిజైనర్‌ చేసిన ప్రయోగం వైరల్

Digital Camouflage shirt: ఈ డ్రెస్‌ వేసుకుంటే ఏఐ కెమెరాలకు చిక్కరట.. డిజైనర్‌ చేసిన ప్రయోగం వైరల్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 07, 2026
12:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎదురుగా ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నా.. అతడిని గుర్తించలేకపోతే ఎలా ఉంటుంది? సీసీటీవీ కెమెరాలనే తికమక పెట్టేలా ఓ ప్రత్యేకమైన దుస్తులను రూపొందించారు జర్మనీకి చెందిన డిజైనర్‌ సైమన్‌ వెకెర్ట్‌. ఏఐ ఆధారిత వీడియో నిఘా వ్యవస్థలను గందరగోళానికి గురిచేయడమే లక్ష్యంగా ఈ దుస్తులను డిజైన్‌ చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఆయన సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో అవి ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

వివరాలు 

ఏఐ కెమెరాల పనితీరును పరీక్షించేందుకు..

జర్మనీ రాజధాని బెర్లిన్‌తో పాటు పలు నగరాల్లోని బహిరంగ ప్రదేశాల్లో ప్రజల కదలికలను పర్యవేక్షించేందుకు ఏఐ ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేయాలని అక్కడి అధికారులు నిర్ణయించారు.

అయితే ఈ నిఘా వ్యవస్థలు వాస్తవంగా ఎంత సమర్థంగా పనిచేస్తాయో పరీక్షించేందుకు సైమన్‌ వెకెర్ట్‌ ఓ ప్రత్యేకమైన 'డిజిటల్ కామోఫ్లాజ్‌' చొక్కాను రూపొందించారు.

ఆ చొక్కా ధరించిన వ్యక్తితో పాటు రోడ్డుపై నడుస్తున్న ఇతరులను ఏఐ కెమెరా పర్యవేక్షించింది.

అయితే డిజైనర్‌ రూపొందించిన చొక్కా ధరించిన వ్యక్తిని మాత్రం మినహాయించి.. మిగతా వారందరినీ కెమెరా 'పర్సన్‌'గా గుర్తించి లేబుల్‌ చేసింది.

ఈ ప్రయోగానికి సంబంధించిన దృశ్యాలను సైమన్‌ వెకెర్ట్‌ షేర్‌ చేశారు.

వివరాలు 

లక్షలాది చిత్రాల ఆధారంగా గుర్తింపు

సాధారణంగా ఏఐ ఆధారిత కెమెరా వ్యవస్థలు మనుషులను గుర్తించేందుకు భారీ మొత్తంలో చిత్రాలను ముందుగానే విశ్లేషించి నేర్చుకుంటాయి.

కెమెరా ముందు నుంచి ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తే.. అతడి శరీర ఆకృతి, రంగులు, దుస్తుల అంచులు వంటి అనేక దృశ్య లక్షణాలను పరిశీలిస్తాయి.

వాటిని తాము ముందుగా నేర్చుకున్న చిత్రాలతో పోల్చి.. ఎదురుగా ఉన్నది మనిషా కాదా అని గుర్తించే ప్రయత్నం చేస్తాయి.

అయితే 'డిజిటల్ కామోఫ్లాజ్‌' చొక్కాలోని ప్రత్యేకమైన డిజైన్‌ ఈ ప్రక్రియను గందరగోళానికి గురిచేసేలా రూపొందించారు.

చొక్కాపై కనిపించే ప్రకాశవంతమైన రంగుల మార్పులు, ఒకదానితో ఒకటి కలిసిపోయినట్టుగా కనిపించే ఆకారాలు ఏఐ విజన్‌ను తికమకపెడతాయి.

ADVERTISEMENT

వివరాలు 

కంప్యూటర్‌ సాయంతో ప్రత్యేక డిజైన్

రంగులు కెమెరాకు కనిపించినప్పటికీ.. ఆకారాలు కలిసిపోయినట్టుగా ఉండటం వల్ల మనిషి శరీరానికి సంబంధించిన అవుట్‌లైన్‌ను స్పష్టంగా గుర్తించడం కష్టమవుతుంది.

దీంతో కెమెరా ముందు కనిపిస్తున్నది ఒకే వ్యక్తా? కాదా? అనే విషయాన్ని ఏఐ వ్యవస్థ సరిగ్గా అంచనా వేయలేకపోయినట్లు డిజైనర్‌ పంచుకున్న దృశ్యాల ద్వారా తెలుస్తోంది.

'డిజిటల్ కామోఫ్లాజ్‌' అనేది నైట్‌ విజన్‌ పరికరాల ద్వారా వివిధ దూరాల నుంచి చూసినప్పుడు చొక్కా ధరించిన వ్యక్తి ఆకారం స్పష్టంగా కనిపించకుండా కంప్యూటర్‌ సాయంతో రూపొందించే ఒక ప్రత్యేక డిజైన్‌.

శత్రువుల కంటికి కనిపించకుండా ఉండేందుకు సైనిక దుస్తుల్లోనూ ఇలాంటి డిజైన్‌ పద్ధతులను ఉపయోగిస్తుంటారు.

ఈ ప్రత్యేక డిజైన్‌కు తుది రూపం ఇవ్వడంలో కృత్రిమ మేధను కూడా ఉపయోగించినట్లు సైమన్‌ వెకెర్ట్‌ తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు 

మనుషుల చూపు.. ఏఐ చూపు వేరు

ఏఐ విజన్‌ టెక్నాలజీలో ఉన్న పరిమితులు, లోపాలను బయటపెట్టడమే తన ప్రయోగం ఉద్దేశమని చెప్పారు.

మనుషులు ఓ దృశ్యాన్ని చూసి దాని అర్థాన్ని గ్రహించే విధానానికి, ఏఐ విజన్‌ టెక్నాలజీ దాన్ని విశ్లేషించే తీరుకు మధ్య ఉన్న తేడా ఈ ప్రయోగంతో స్పష్టమైందని సైమన్‌ వెకెర్ట్‌ పేర్కొన్నారు.

ఈ ప్రయోగంలో చూపించిన ఫలితాలు ఆయన పంచుకున్న దృశ్యాల ఆధారంగానే ఉన్నాయని గమనించాలి.

ADVERTISEMENT