Global data center: 2030 నాటికి ప్రపంచ డేటా సెంటర్లపై 2.93 ట్రిలియన్ డాలర్ల ఖర్చు!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్ల రంగం భారీ వృద్ధి దిశగా సాగుతోంది. 2026 నాటికి ఈ రంగంపై ఖర్చు ఒక ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని, 2028 నాటికి అది రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగి 2.1 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని బోఫా గ్లోబల్ రీసెర్చ్ అంచనా వేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సేవలకు పెరుగుతున్న డిమాండ్ ఈ వృద్ధికి ప్రధాన కారణమని తెలిపింది. 2022లో ప్రపంచ డేటా సెంటర్ల మార్కెట్ విలువ 275 బిలియన్ డాలర్లుగా ఉండగా.. 2030 నాటికి అది ఏకంగా 2.93 ట్రిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనా వేసింది.
వివరాలు
ఏఐ సేవలతో డేటా సెంటర్ల రంగంలో వృద్ధి
డేటా సెంటర్ల రంగంలో వృద్ధి రానున్న సంవత్సరాల్లోనూ కొనసాగనుంది. 2025 నుంచి 2030 మధ్య ఈ రంగం ఏటా సగటున 37 శాతం వృద్ధి చెందవచ్చని అంచనా.
ఏఐ ఆధారిత సేవల వినియోగం వేగంగా పెరుగుతుండటమే ఇందుకు ప్రధాన కారణం.
ముఖ్యంగా అమెరికాలో చిప్‌ల తయారీ సంస్థలు, సర్వర్లను అభివృద్ధి చేసే కంపెనీలు ఈ వృద్ధి ద్వారా ఎక్కువగా లాభపడుతున్నాయి.
వివరాలు
సంప్రదాయ డేటా సెంటర్ల కంటే నియోక్లౌడ్స్ ఖరీదు ఎక్కువ
ఒక మెగావాట్ సామర్థ్యంతో డేటా సెంటర్‌ను నిర్మించడానికి సుమారు 49 మిలియన్ డాలర్లు ఖర్చవుతుందని బోఫా అంచనా వేసింది.
ఇందులో ఐటీ సంబంధిత పరికరాలు, ఇతర ఖర్చుల వాటా 78 శాతంగా ఉంది.
ఏఐ అవసరాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే డేటా సెంటర్లను 'నియోక్లౌడ్స్' అని పిలుస్తారు.
వీటి నిర్మాణానికి ఒక్కో మెగావాట్‌కు సుమారు 57 మిలియన్ డాలర్లు ఖర్చవుతుంది.
అయితే సంప్రదాయ డేటా సెంటర్లతో పోలిస్తే వీటికి తక్కువ స్థలం సరిపోతుంది.
డేటా సెంటర్ల నిర్మాణంలో సర్వర్లకే అత్యధికంగా, ఒక్కో మెగావాట్‌కు 31.4 మిలియన్ డాలర్లు ఖర్చవుతున్నాయి.
ఆ తర్వాత నెట్వర్కింగ్ పరికరాల కోసం 4.8 మిలియన్ డాలర్లు వెచ్చించాల్సి వస్తోంది.