Instagram Offline Reels: రీల్స్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఆఫ్‌లైన్‌లో కూడా వీడియోలు చూసే అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా సిగ్నల్ సరిగా లేని ప్రాంతాల్లో ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే రీల్స్ లోడ్ కాక ఖాళీ స్క్రీన్ కనిపించడం చాలా మందికి ఇబ్బందిగా మారుతుంది. అయితే ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం రానుంది. మెటా ఆధ్వర్యంలోని ఇన్‌స్టాగ్రామ్ 'ఆఫ్‌లైన్ రీల్స్' అనే కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఈ విషయాన్ని ఒక ప్రముఖ మొబైల్ డెవలపర్, టిప్‌స్టర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆయన షేర్ చేసిన స్క్రీన్‌షాట్‌ల ప్రకారం, ఇన్‌స్టాగ్రామ్ ప్రస్తుతం ఆటోమేటిక్ డౌన్‌లోడ్ సిస్టమ్‌పై పనిచేస్తోంది. ఈ ఫీచర్ మీ ఆసక్తులకు అనుగుణంగా కొన్ని రీల్స్‌ను ముందుగానే డౌన్‌లోడ్ చేసి స్టోర్ చేస్తుంది. దీంతో ఇంటర్నెట్ లేకపోయినా వినోదాన్ని ఆస్వాదించే వీలుంటుంది.
వివరాలు
రీల్స్ ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయ్యేలా సెట్టింగ్స్
కొత్త అప్డేట్‌లో వినియోగదారులకు పూర్తి నియంత్రణ ఉండేలా పలు ఆప్షన్లు ఇవ్వనున్నారు.వై-ఫై కనెక్షన్ ఉన్నప్పుడు రీల్స్ ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయ్యేలా సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు. అలాగే ఫోన్ స్టోరేజ్ నిండిపోకుండా ఉండేందుకు ఎన్ని వీడియోలు డౌన్‌లోడ్ కావాలో మీరు నిర్ణయించుకోవచ్చు. ఉదాహరణకు 10, 30 లేదా 50 రీల్స్ వరకు లిమిట్ సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదనంగా, మొబైల్ డేటా వృథా కాకుండా కేవలం వై-ఫై ఉన్నప్పుడు మాత్రమే డౌన్‌లోడ్ అయ్యేలా సెట్టింగ్స్ మార్చుకోవచ్చు.
వివరాలు
'స్మార్ట్ డౌన్‌లోడ్స్' ఫీచర్‌లా పనిచేయనుంది
డౌన్‌లోడ్ అయిన రీల్స్‌ను ఆఫ్‌లైన్‌లో సాధారణ ఫీడ్‌లో లేదా ప్రత్యేకంగా ఉండే 'డౌన్‌లోడ్స్' సెక్షన్ ద్వారా వీక్షించవచ్చు. ఇది ఇప్పటికే యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న 'స్మార్ట్ డౌన్‌లోడ్స్' ఫీచర్‌లా పనిచేయనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. ఇన్‌స్టాగ్రామ్ దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు. పరీక్షలు పూర్తయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా డేటా కనెక్టివిటీ సమస్యలు ఎక్కువగా ఉండే దేశాల్లో ఈ ఫీచర్ రీల్స్ ప్రియులకు పెద్ద వరంగా మారనుంది.