Whatsapp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. కొత్త ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌తో సమస్యలకు చెక్!
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరొక కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. ఇకపై ఇతర భాషల్లో వచ్చిన సందేశాలను చాట్ బాక్స్‌లోనే మీరు తర్జుమా చేసుకునే సదుపాయం వాట్సప్‌లో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.24.26.9లో పరీక్షిస్తున్నట్లు వాబీటా ఇన్ఫో ప్రకటించింది. సందేశాలు లేదా చాట్స్ వేర్వేరు భాషల్లో ఉంటే, చాలా యూజర్లకు అర్థం కావడం కష్టంగా ఉంటుంది. అప్పుడు వారు అనేక సారి కాపీ చేసి, ఇతర ట్రాన్సలేషన్ టూల్స్‌లో పేస్ట్ చేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఈ కొత్త ఫీచర్‌తో మీకు అవసరమైన భాషలోనే సందేశం వెంటనే కనిపిస్తుంది. ఇది పూర్తిగా యూజర్ డివైజ్‌లోనే పనిచేస్తుంది.
ఆఫ్‌లైన్‌లో కూడా ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు
కాబట్టి, ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో ఈ చాట్స్ సురక్షితంగా ఉంటాయి. ఏ ఇతర సర్వర్‌కు డేటా పంపాల్సిన అవసరం ఉండదు, కావున మీరు ఆఫ్‌లైన్‌లో కూడా ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ ఫీచర్‌లో యూజర్లకు ప్రతి సందేశాన్ని ట్రాన్స్‌లేట్ చేయాలా లేదా ఎంపిక చేసిన సందేశాలను మాత్రమే ట్రాన్స్‌లేట్ చేయాలా అని ఓ ఆప్షన్ ఇస్తుంది. అయితే ఈ సదుపాయం సర్వర్లో అందుబాటులోకి ఎప్పుడు వస్తుందన్నది ఇంకా ఖచ్చితంగా ప్రకటించలేదు. సామాన్యంగా, టెక్ట్స్‌ను ట్రాన్స్‌లేట్ చేయడానికి వేరే టూల్స్‌ని ఉపయోగించాల్సిన అవసరం లేకుండా, వాట్సప్‌లోనే ఈ కొత్త ఫీచర్ ద్వారా సులభంగా చాట్‌లను అనువదించుకోవచ్చు.