Loading...
Google: విద్యార్థులకు గూగుల్‌ శుభవార్త.. జెమినీలో వందలాది పాఠ్యపుస్తకాలు ఉచితం!
విద్యార్థులకు గూగుల్‌ శుభవార్త.. జెమినీలో వందలాది పాఠ్యపుస్తకాలు ఉచితం!

Google: విద్యార్థులకు గూగుల్‌ శుభవార్త.. జెమినీలో వందలాది పాఠ్యపుస్తకాలు ఉచితం!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 30, 2026
12:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

విద్యార్థులకు ఉపయోగపడేలా టెక్‌ దిగ్గజం గూగుల్‌ మరో కీలక సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ప్లాట్‌ఫామ్‌ జెమినీ నోట్‌బుక్‌లో వందలాది పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందిస్తోంది. అమెరికా, భారత్‌కు చెందిన వివిధ ప్రచురణ సంస్థలు, విద్యా వనరుల నుంచి ఈ పుస్తకాలను సేకరించింది. వీటిలో ఓపెన్‌స్టాక్స్‌, ఓపెన్‌ టెక్స్ట్‌బుక్‌ లైబ్రరీ, ఎస్‌.చాంద్‌ పబ్లిషింగ్‌ సంస్థలు ప్రచురించిన పుస్తకాలు ఉన్నాయి.

వివరాలు 

ఏఐ ఇచ్చిన సమాధానాలను విద్యార్థులు సంబంధిత పుస్తకాలతో పోల్చి చూసుకునే అవకాశం

ఈ పుస్తకాల సాయంతో విద్యార్థులు తమకు వచ్చే సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

జెమినీ ప్రత్యేకత ఏమిటంటే.. విద్యార్థులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేటప్పుడు సంబంధిత పాఠ్యపుస్తకాల్లోని సమాచారాన్ని ఆధారంగా తీసుకుంటుంది.

అంతేకాదు,సమాధానాలతోపాటే ఆ సమాచారం ఏ పుస్తకంలో ఉందో తెలియజేసే సూచనలు, లింకులను కూడా అందిస్తుంది.

దీంతో ఏఐ ఇచ్చిన సమాధానాలను విద్యార్థులు సంబంధిత పుస్తకాలతో పోల్చి చూసుకునే అవకాశం ఉంటుంది.

అంతేకాకుండా పాఠ్యపుస్తకాల్లోని అంశాల ఆధారంగా విద్యార్థుల అవసరాలకు తగ్గట్టుగా స్టడీ గైడ్లు, ప్రాక్టీస్‌ క్విజ్‌లు,ఫ్లాష్‌కార్డులను రూపొందించుకోవచ్చు.

పరీక్షల సమయంలో పాఠాలను మరోసారి గుర్తు చేసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి.

అర్థంకాని పాఠ్యాంశాలపై ప్రశ్నలు అడిగితే..సంబంధిత పుస్తకాల్లోని సమాచారాన్ని ఆధారంగా చేసుకుని జెమినీ వివరణ ఇస్తుంది.

దీనివల్ల చదువును మరింత సులభంగా కొనసాగించవచ్చు.

వివరాలు 

జెమినీ నోట్‌బుక్‌లో పుస్తకాలను ఎలా జత చేయాలంటే?

ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవడం చాలా సులభం. ముందుగా జెమినీ నోట్‌బుక్‌లోకి వెళ్లి కొత్త నోట్‌బుక్‌ను ఓపెన్‌ చేయాలి.

అందులో కనిపించే 'యాడ్‌ సోర్సెస్‌'(Add Sources) ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

ఆ తర్వాత 'టెక్ట్స్‌బుక్స్‌' (Textbooks)పై క్లిక్‌ చేస్తే అందుబాటులో ఉన్న పాఠ్యపుస్తకాల జాబితా కనిపిస్తుంది.

అందులో నుంచి అవసరమైన పుస్తకాన్ని ఎంచుకుని నోట్‌బుక్‌కు జత చేసుకోవచ్చు.

ఈ సదుపాయాన్ని వినియోగించుకోవడానికి ఎలాంటి అదనపు చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని గూగుల్‌ స్పష్టం చేసింది.

విద్యార్థులు నమ్మకమైన పాఠ్యపుస్తకాల ఆధారంగా ఏఐ సాయంతో కొత్త విషయాలను నేర్చుకునేలా ప్రోత్సహించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని గూగుల్‌ తెలిపింది.

గత నెలలో ప్రారంభించిన 'ఎక్స్‌పర్ట్‌ ఇంటెలిజెన్స్‌' కార్యక్రమంలో భాగంగా ఈ సదుపాయాన్ని మరింత విస్తరిస్తున్నట్లు పేర్కొంది.

ADVERTISEMENT