Loading...
Weather watch: తుపాన్లను ముందే పసిగట్టే ఏఐ.. ఒక రోజు ముందే హెచ్చరిక!
తుపాన్లను ముందే పసిగట్టే ఏఐ.. ఒక రోజు ముందే హెచ్చరిక!

Weather watch: తుపాన్లను ముందే పసిగట్టే ఏఐ.. ఒక రోజు ముందే హెచ్చరిక!

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 10, 2026
03:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

వాతావరణ అంచనాల్లో కృత్రిమ మేధ (AI) సాంకేతికత కీలక మార్పులకు కారణమవుతోంది. తుపాన్లను ముందుగా అంచనా వేయడంలో గూగుల్‌కు చెందిన 'WeatherNext' ఏఐ మోడల్‌ ఇప్పటికే ఉన్న సంప్రదాయ వ్యవస్థల కంటే మెరుగైన పనితీరు కనబరుస్తున్నట్లు 'Nature'లో ప్రచురితమైన ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ ఏఐ సాంకేతికత వల్ల తుపాన్లకు సంబంధించిన హెచ్చరికలను ఒక రోజు ముందుగానే అందించే అవకాశం ఏర్పడుతోంది. సాధారణ పద్ధతుల్లో రెండు రోజుల ముందుగా ఇచ్చే అంచనాల స్థాయిలోనే, WeatherNext మూడు రోజుల ముందుగానే హరికేన్లు లేదా టైఫూన్ల కదలికలను అంచనా వేయగలదని పరిశోధకులు తెలిపారు. దీంతో తుపాన్ల ప్రభావానికి గురయ్యే ప్రాంతాల్లో ముందస్తు చర్యలకు మరింత సమయం లభించనుంది.

వివరాలు 

గణిత లెక్కల నుంచి ఏఐ వరకు.. వాతావరణ అంచనాల్లో మార్పులు

అయితే వాతావరణ అంచనాలను మార్చేస్తున్న ఏకైక ఏఐ సాధనం WeatherNext మాత్రమే కాదు.

గతఏడాది కాలంగా ఈ రంగంలో ఏఐ వినియోగం క్రమంగా పెరుగుతోంది.

సంప్రదాయ వాతావరణ అంచనా పద్ధతులకు ప్రత్యామ్నాయంగా కాకుండా,వాటికి తోడ్పడే కొత్త సాంకేతికతగా ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతోంది.

సంఖ్యాపరమైన వాతావరణ అంచనా పద్ధతులకు శతాబ్దానికి పైగా చరిత్ర ఉంది.

వాతావరణ అంచనాలను గణిత లెక్కల ఆధారంగా రూపొందించే విధానంపై లూయిస్‌ ఫ్రై రిచర్డ్‌సన్‌ రాసిన'Weather Prediction By Numerical Process'పుస్తకం ఈ రంగంలో కీలకమైన ముందడుగుగా నిలిచింది.

ఆ సమయంలో ఈ లెక్కలన్నీ చేతితోనే చేయాల్సి వచ్చేది.

రోజువారీ వాతావరణ అంచనాను రూపొందించడానికి ఆరు వారాలకుపైగా సమయం పట్టేది. దీంతో ఆ పద్ధతి ఆచరణలో పెద్దగా ఉపయోగపడలేదు.

వివరాలు 

సూపర్‌ కంప్యూటర్లకు ఏఐ కొత్త ప్రత్యామ్నాయం

తర్వాత కంప్యూటర్లు అందుబాటులోకి రావడంతో పరిస్థితి మారింది.

ప్రస్తుతం అత్యాధునిక సూపర్‌ కంప్యూటర్లు ఉన్నప్పటికీ, భారీ స్థాయిలో వాతావరణ సమాచారాన్ని ప్రాసెస్‌ చేయడానికి అవసరమైన కంప్యూటింగ్‌ సామర్థ్యం ఇప్పటికీ ఒక పరిమితిగానే ఉంది.

ఇక్కడే ఏఐ సాంకేతికతకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడుతోంది.

భౌతిక శాస్త్రానికి సంబంధించిన ప్రతి అంశాన్ని విడివిడిగా లెక్కించాల్సిన సంప్రదాయ నమూనాలకు భిన్నంగా ఏఐ గత వాతావరణ సమాచారంలోని నమూనాలను నేర్చుకుంటుంది.

ఆ డేటాలో కనిపించే సంబంధాలు, మార్పులను గుర్తించి భవిష్యత్‌ పరిస్థితులను అంచనా వేస్తుంది. దీనివల్ల సంక్లిష్టమైన లెక్కలను వేగంగా పూర్తి చేయగలుగుతోంది.

ADVERTISEMENT

వివరాలు 

### వాతావరణ అంచనాల్లో ఏఐకి పెరుగుతున్న ఆదరణ

ఇప్పటికే వివిధ స్థాయిల్లో వాతావరణ అంచనాల విషయంలో ఏఐ ఆధారిత వ్యవస్థలు సంప్రదాయ నమూనాలకు దీటుగా పనిచేస్తున్నాయి.

ముఖ్యంగా దీర్ఘకాలిక అంచనాల్లో వీటి సామర్థ్యం స్పష్టంగా కనిపిస్తోంది.

అన్ని సందర్భాల్లో ఏఐ సంప్రదాయ పద్ధతుల కంటే మెరుగైనదని చెప్పలేకపోయినా, అదే స్థాయి అంచనాలను మరింత వేగంగా, తక్కువ ఖర్చుతో అందించే అవకాశం ఉంది.

అనేక రంగాల్లో ఏఐ వినియోగంపై ఇప్పటికీ సందేహాలు, వ్యతిరేకత ఉన్నాయి.

అయితే వాతావరణ అంచనాల రంగంలో మాత్రం ఏఐని సాధారణంగా ఉపయోగకరమైన కొత్త సాధనంగా స్వాగతిస్తున్నారు.

తుపాన్లను ముందుగానే గుర్తించడం, ప్రజలకు హెచ్చరికలు ఇవ్వడం, విపత్తుల సమయంలో ముందస్తు చర్యలు తీసుకోవడం వంటి అంశాల్లో ఏఐ భవిష్యత్తులో మరింత కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

ADVERTISEMENT