Loading...
'Mirror Dimension': ఏఐ శిక్షణ కోసం నకిలీ ఇంటర్నెట్‌ను నిర్మించిన గూగుల్.. 'మిర్రర్ డైమెన్షన్' ప్రత్యేకత ఇదే!
'మిర్రర్ డైమెన్షన్' ప్రత్యేకత ఇదే!

'Mirror Dimension': ఏఐ శిక్షణ కోసం నకిలీ ఇంటర్నెట్‌ను నిర్మించిన గూగుల్.. 'మిర్రర్ డైమెన్షన్' ప్రత్యేకత ఇదే!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2026
11:21 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో గూగుల్ మరో ఆసక్తికరమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఏఐ ఆధారిత బ్రౌజింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చేందుకు ఏకంగా ఒక నకిలీ ఇంటర్నెట్‌నే రూపొందించింది. ఇందులో నిజమైన వెబ్‌సైట్లకు బదులుగా నకిలీ షాపింగ్ సైట్లు, సోషల్ మీడియా ఫీడ్‌లు, బ్యాంకింగ్ డ్యాష్‌బోర్డులు ఉంటాయి. గూగుల్ క్రోమ్‌లో త్వరలో అందుబాటులోకి రానున్న ఏఐ బ్రౌజింగ్ ఫీచర్లకు సురక్షితంగా శిక్షణ ఇవ్వడమే ఈ ప్రయోగం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.

వివరాలు 

గూగుల్ నియంత్రణలో ఉండే ఒక భారీ డిజిటల్ ప్రపంచం

గూగుల్ తన సెక్యూరిటీ బ్లాగ్‌లో ఈ ప్రాజెక్ట్ వివరాలను వెల్లడించింది.

దీనికి 'మిర్రర్ డైమెన్షన్' అని పేరు పెట్టింది. ఇది పూర్తిగా గూగుల్ నియంత్రణలో ఉండే ఒక భారీ డిజిటల్ ప్రపంచం.

ఇందులో క్రోమ్ బ్రౌజర్‌లోని జెమిని ఆధారిత 'ఆటో బ్రౌజ్' ఫీచర్‌కు వివిధ ఆన్‌లైన్ కార్యకలాపాల్లో శిక్షణ ఇస్తారు.

వెబ్‌సైట్లలో లింక్‌లను క్లిక్ చేయడం, ఫారమ్‌లను నింపడం, పాడ్‌కాస్ట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడం, ఆన్‌లైన్‌లో వస్తువులను కొనుగోలు చేయడం వంటి పనులను ఈ ఏఐ నేర్చుకుంటుంది.

అయితే ఈ ప్రక్రియలో నిజమైన వెబ్‌సైట్లకు ఎలాంటి ఇబ్బంది కలగదు. వినియోగదారుల వ్యక్తిగత సమాచారం కూడా ప్రమాదంలో పడదు.

వివరాలు 

నిజమైన ఇంటర్నెట్‌ను ఎందుకు ఉపయోగించలేదు?

రోజువారీ ఇంటర్నెట్ కార్యకలాపాలను నిర్వహించే సామర్థ్యాన్ని ఏఐ ఏజెంట్లకు నేర్పించాలంటే పెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది.

ఇందుకోసం వందలాది వెబ్‌సైట్లలో వేలాది ప్రయోగాలు చేయాల్సి వస్తుంది.

అయితే నిజమైన ఇంటర్నెట్‌ను ఉపయోగించి ఇలాంటి పరీక్షలు నిర్వహించడం అంత సులభం కాదు.

వెబ్‌సైట్లు నిరంతరం మారుతుండటంతో ఒకే పరీక్షను మళ్లీ మళ్లీ ఒకే విధంగా నిర్వహించడం ఇంజినీర్లకు కష్టంగా మారుతుంది.

మరోవైపు,పూర్తిస్థాయిలో శిక్షణ పొందని ఏఐ ఏజెంట్లను నేరుగా ఇంటర్నెట్‌లోకి పంపించడం ప్రమాదకరం.

వాటి వల్ల అనుకోని తప్పులు జరిగితే నిజమైన వినియోగదారుల ఖాతాలు దెబ్బతినవచ్చు. ఆర్థిక లావాదేవీల్లో పొరపాట్లు జరిగి వాస్తవ నష్టం కూడా కలగవచ్చు.

అందుకే ఎలాంటి ప్రమాదాలు లేని నియంత్రిత వాతావరణంలో ఏఐకి శిక్షణ ఇవ్వాలని గూగుల్ నిర్ణయించింది.

ADVERTISEMENT

వివరాలు 

నిజమైన ఇంటర్నెట్‌ను ఎందుకు ఉపయోగించలేదు?

దీనికి అదనంగా 'ఎవాల్ అవేర్‌నెస్' (Eval Awareness) అనే సమస్య కూడా ఉంది.

ఆధునిక ఏఐ మోడళ్లు తాము పరీక్షలో ఉన్నామని గుర్తించగలవు.

అలా గుర్తించినప్పుడు సాధారణ పరిస్థితుల్లో వ్యవహరించే తీరుకు భిన్నంగా, మరింత జాగ్రత్తగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది.

ఫలితంగా పరీక్షల్లో వచ్చే ఫలితాలు వాస్తవ పరిస్థితుల్లో ఏఐ పనితీరును ప్రతిబింబించకపోవచ్చు. అందుకే ఏఐ తాను నిజమైన ఇంటర్నెట్‌లో బ్రౌజ్ చేస్తున్నట్లు భావించేలా గూగుల్ ఈ ప్రత్యామ్నాయ ప్రపంచాన్ని రూపొందించింది.

ADVERTISEMENT

వివరాలు 

నకిలీ ఇంటర్నెట్‌తో ఏఐకి ఎలా శిక్షణ ఇస్తారు?

'మిర్రర్ డైమెన్షన్'ను రూపొందించేందుకు గూగుల్ 'gVisor' అనే టూల్‌ను ఉపయోగించింది.

దీని ద్వారా పటిష్ఠమైన డిజిటల్ శాండ్‌బాక్స్‌ను ఏర్పాటు చేసింది.

ఏఐ ఏదైనా ప్రముఖ వెబ్‌సైట్‌ను సందర్శించడానికి ప్రయత్నించినప్పుడు, స్థానిక సిస్టమ్ ఆ అభ్యర్థనను గుర్తించి నిశ్శబ్దంగా నకిలీ వెబ్‌సైట్‌కు మళ్లిస్తుంది.

ఈ విధంగా ఏఐకి నిజమైన వెబ్‌సైట్‌లో పనిచేస్తున్న అనుభూతి కలుగుతుంది. ఇందులో మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది.

ఏఐ నకిలీ వెబ్‌సైట్‌లో ఉన్నప్పటికీ క్రోమ్ అడ్రస్ బార్‌లో మాత్రం సాధారణ వెబ్ చిరునామానే కనిపిస్తుంది.

అయితే క్రోమ్‌లో పటిష్ఠమైన భద్రతా తనిఖీలు ఉండటంతో బ్రౌజర్ ఎలాంటి హెచ్చరికలు చూపించకుండా ఉండేందుకు ఇంజినీర్లు ప్రత్యేకంగా రూపొందించిన నకిలీ వెబ్ సర్టిఫికేట్లను ఉపయోగించారు.

వివరాలు 

నకిలీ ఇంటర్నెట్‌తో ఏఐకి ఎలా శిక్షణ ఇస్తారు?

అయితే ఈ విధానం సాధారణ ఇంటర్నెట్ వినియోగదారులకు అందుబాటులో ఉండే అవకాశం లేదని గూగుల్ స్పష్టం చేసింది.

హ్యాకర్లు నిజమైన ఇంటర్నెట్‌లో ఇలాంటి మార్పులు చేయడం సాధ్యం కాదని తెలిపింది.

ఈ విధానం గూగుల్ నియంత్రణలోని ప్రైవేట్ టెస్ట్ నెట్‌వర్క్‌లో మాత్రమే పనిచేస్తుందని వివరించింది.

వివరాలు 

నకిలీ వెబ్‌సైట్లను రూపొందిస్తున్న ఏఐ ఏజెంట్లు

వేలాది వెబ్‌సైట్లను మనుషులతో నిర్మించడం చాలా సమయం తీసుకునే పని. అందుకే ఈ ప్రాజెక్ట్‌లోనూ గూగుల్ ఇతర ఏఐ ఏజెంట్ల సహాయం తీసుకుంది.

వివిధ బాధ్యతలను నిర్వహించే ఏఐ ఏజెంట్ల బృందాలను ఏర్పాటు చేసింది.

మొదట 'రీసెర్చ్ ఏజెంట్లు' ఒక వెబ్‌సైట్‌కు ఎలాంటి ఫీచర్లు అవసరమో నిర్ణయిస్తాయి.

ఉదాహరణకు ఆన్‌లైన్ షాపింగ్ సైట్‌లో షాపింగ్ కార్ట్‌లు, ప్రోమో కోడ్‌లను నమోదు చేసే బాక్సులు వంటి అంశాలను ప్రణాళిక రూపొందిస్తాయి.

వివరాలు 

నకిలీ వెబ్‌సైట్లను రూపొందిస్తున్న ఏఐ ఏజెంట్లు

ఆ తర్వాత 'బిల్డర్ ఏజెంట్లు' రంగంలోకి దిగి వెబ్‌సైట్‌కు అవసరమైన కోడ్‌ను తయారు చేస్తాయి.

ఇక 'క్రిటిక్ ఏజెంట్లు' రూపొందించిన వెబ్‌సైట్ల పనితీరును పరిశీలిస్తాయి. ఇందుకోసం క్రోమ్ డెవలపర్ టూల్స్‌ను ఉపయోగిస్తాయి.

వెబ్‌సైట్‌లోని బటన్లను క్లిక్ చేయడం, స్క్రీన్‌షాట్లు తీయడం, లోపాలను గుర్తించడం వంటి పనులు చేస్తాయి.

ఏవైనా సమస్యలు కనిపిస్తే వాటిని సరిచేయడానికి తిరిగి బిల్డర్ ఏజెంట్లకు పంపిస్తాయి.

ఈ విధంగా వివిధ ఏఐ ఏజెంట్లు సమన్వయంతో పనిచేస్తూ ఆన్‌లైన్ షాపింగ్ స్టోర్లు, వంటకాల వెబ్‌సైట్లు, బ్యాంకింగ్ డ్యాష్‌బోర్డులు వంటి అనేక రకాల వెబ్‌సైట్లతో కూడిన ఒక పూర్తి నకిలీ ఇంటర్నెట్‌ను నిర్మించాయి.

వివరాలు 

ప్రాంప్ట్ ఇంజెక్షన్ దాడుల నుంచి రక్షణ

ఏఐ బ్రౌజింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వడంతో పాటు వినియోగదారుల భద్రతను పెంచడం కూడా ఈ ప్రాజెక్ట్‌లో కీలక లక్ష్యం.

ముఖ్యంగా 'ప్రాంప్ట్ ఇంజెక్షన్' దాడులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని ఏఐకి అందించాలని గూగుల్ భావిస్తోంది.

ఈ తరహా సైబర్ దాడుల్లో హ్యాకర్లు వెబ్‌పేజీల్లోని టెక్స్ట్ లేదా చిత్రాల్లో హానికరమైన ఆదేశాలను రహస్యంగా పొందుపరుస్తారు.

వాటిని చదివిన ఏఐ తనకు ఇచ్చిన అసలు సూచనలను పక్కనపెట్టి, హ్యాకర్లు పొందుపరిచిన ఆదేశాల ప్రకారం పనిచేసే ప్రమాదం ఉంటుంది.

వివరాలు 

ప్రాంప్ట్ ఇంజెక్షన్ దాడుల నుంచి రక్షణ

తద్వారా ఏఐ ఏజెంట్‌ను తమ నియంత్రణలోకి తీసుకునే ప్రయత్నం చేస్తారు.

ఇలాంటి ముప్పులను గుర్తించి వాటి బారిన పడకుండా ఉండేలా ఏఐ ఏజెంట్లకు విస్తృతంగా శిక్షణ ఇస్తున్నారు.

ప్రస్తుతం పరీక్షిస్తున్న ఏఐ ఏజెంట్లు ప్రమాదకరమైనవి కావని, వాటికి హ్యాకింగ్ నైపుణ్యాలు కూడా లేవని గూగుల్ ఇంజినీరింగ్ డైరెక్టర్ డౌగ్ టర్నర్ తెలిపారు.

అయితే భవిష్యత్తులో ఏఐ సామర్థ్యాలు మరింత పెరిగే కొద్దీ, ఈ నకిలీ ఇంటర్నెట్‌ను కూడా మరింత వాస్తవికంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు.

ADVERTISEMENT