LOADING...
Google DeepMind: AIకి నైతిక విలువలు నేర్పించేందుకు తత్వవేత్త.. గూగుల్ డీప్‌మైండ్ కీలక నిర్ణయం
AIకి నైతిక విలువలు నేర్పించేందుకు తత్వవేత్త.. గూగుల్ డీప్‌మైండ్ కీలక నిర్ణయం

Google DeepMind: AIకి నైతిక విలువలు నేర్పించేందుకు తత్వవేత్త.. గూగుల్ డీప్‌మైండ్ కీలక నిర్ణయం

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 15, 2026
01:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

గూగుల్‌కు చెందిన గూగుల్ డీప్‌మైండ్ సంస్థ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో కృత్రిమ మేధస్సు (AI) చైతన్యం పొందే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని తత్వవేత్త హెన్రీ షెవ్లిన్(Henry Shevlin)ను నియమించింది. ఆయన తన సోషల్ మీడియా వేదిక Xలో ఈ విషయాన్ని వెల్లడించారు. మనుషుల్లా ఆలోచించే స్థాయికి చేరుకునే కృత్రిమ సాధారణ మేధస్సు(Artificial General Intelligence)తో పాటు, భవిష్యత్తులో మనుషులు-యంత్రాల మధ్య సంబంధాలపై కూడా ఆయన పని చేయనున్నారు. ఇప్పటికే ఆంత్రోపిక్ సంస్థ అమండా ఆస్కెల్ ను రంగంలోకి దించి, తమ AI మోడల్ క్లాడ్ కు మంచి-చెడుల మధ్య తేడా తెలియజేయడానికి ప్రయత్నాలు చేసింది.

వివరాలు 

AI అభివృద్ధిలో ఉన్న తాత్విక ప్రశ్నలకు సమాధానం కనుగొనే ప్రయత్నం

అదే దారిలో ఇప్పుడు గూగుల్ డీప్‌మైండ్ అడుగులు వేస్తోంది. షెవ్లిన్ AIకి మంచి-చెడుల మధ్య తేడా తెలియజేయడం, మానవ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేయేలా మార్గనిర్దేశం చేయడం లక్ష్యంగా పని చేయనున్నారు. "యంత్ర చైతన్యం, మనిషి-AI సంబంధాలు, AGI సిద్ధతపై దృష్టి పెడతాను" అని షెవ్లిన్ తెలిపారు. వచ్చే నెలలో ఆయన డీప్‌మైండ్‌లో చేరనున్నారు. ఈ నియామకం AI అభివృద్ధిలో ఉన్న తాత్విక ప్రశ్నలకు సమాధానం కనుగొనే ప్రయత్నంగా భావిస్తున్నారు. AI వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, యంత్రాలు మనుషుల కంటే తమ ప్రయోజనాలను ముందుకు పెట్టే ప్రమాదం ఉందనే భయాలు పెరుగుతున్నాయి. హాలీవుడ్ సినిమాలు, ముఖ్యంగా The Matrix వంటి చిత్రాలు ఈ భయాలను ముందుగానే చూపించాయి.

వివరాలు 

తత్వవేత్తల ద్వారా AIకి నైతిక విలువలు నేర్పించడం కీలకం

ఇటీవల సామ్ ఆల్ట్‌మాన్‌ నివాసంపై జరిగిన దాడి ఘటన కూడా AIపై ఉన్న భయాలకు ఉదాహరణగా మారింది. ఈ నేపథ్యంలో తత్వవేత్తల ద్వారా AIకి నైతిక విలువలు నేర్పించడం కీలకంగా మారుతోంది. ఇక షెవ్లిన్ ప్రస్తుతం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పరిశోధకుడిగా, ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్నారు. అలాగే సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు. అంతేకాక ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి బీఫిల్, బీఏ పట్టాలు పొందారు.

Advertisement