Google brings Gemini: క్రోమ్‌లో జెమినీ ఏఐ.. భారత్‌లో గూగుల్ కొత్త ఫీచర్ ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
గూగుల్ తన జెమినీ (Gemini) ఏఐ చాట్‌బాట్‌ను ఇప్పుడు మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. బుధవారం కంపెనీ ప్రకటించిన ప్రకారం, క్రోమ్ బ్రౌజర్‌లో జెమినీ ఇంటిగ్రేషన్‌ను భారత్, కెనడా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ ఫీచర్ ద్వారా డెస్క్‌టాప్‌లో క్రోమ్ సైడ్‌బార్ ద్వారా జెమినీని ఉపయోగించుకోవచ్చు. స్క్రీన్‌పై కనిపిస్తున్న కంటెంట్ గురించి గూగుల్ ఏఐని ప్రశ్నించవచ్చు. అలాగే జీమెయిల్, కీప్, డ్రైవ్, యూట్యూబ్ వంటి గూగుల్ సేవల నుంచి సమాచారం పొందడం, ఒకేసారి పలు ట్యాబ్‌లలో ఉన్న కంటెంట్‌ను పోల్చి చూడటం కూడా సులభం అవుతుంది.
వివరాలు
క్రోమ్‌లో ఫ్లోటింగ్ విండో రూపంలో జెమినీని గూగుల్
ఈ కొత్త అప్‌డేట్‌లో భాగంగా జెమినీకి మరిన్ని భారతీయ భాషలకు మద్దతు ఇవ్వనున్నారు. ఇంగ్లీష్‌తో పాటు హిందీ,బెంగాళీ,గుజరాతీ,కన్నడ,మలయాళం,మరాఠీ,తెలుగు,తమిళం వంటి భాషల్లో కూడా ఈ ఫీచర్ పనిచేస్తుంది. గత ఏడాది సెప్టెంబర్‌లో అమెరికాలో క్రోమ్‌లో ఫ్లోటింగ్ విండో రూపంలో జెమినీని గూగుల్ మొదట పరిచయం చేసింది. ఆతర్వాత ఈ ఏడాది ప్రారంభంలో సైడ్‌బార్ ఆధారిత జెమినీ టూల్స్‌ను విడుదల చేసింది. ఈఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వినియోగదారులకు క్రోమ్ ట్యాబ్ బార్‌లో"Ask Gemini"అనే ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ఏ ట్యాబ్‌లో ఉన్న కంటెంట్ గురించిన ప్రశ్నలు అడగవచ్చు. అలాగే ఆ పేజీలోని సమాచారాన్నిసంక్షిప్తంగా సారాంశంగా ఇవ్వమని అడగడం, లేదా ఒక విషయం అర్థం చేసుకునేందుకు క్విజ్ రూపొందించమని కోరడం కూడా సాధ్యమవుతుంది.
వివరాలు
ఒకేసారి పలు ట్యాబ్‌లతో పనిచేయగల జెమినీ
జెమినీ ఒకేసారి పలు ట్యాబ్‌లతో పనిచేయగలదని గూగుల్ తెలిపింది. ఉదాహరణకు షాపింగ్ కోసం వస్తువులను పోల్చి చూడడం లేదా ట్రిప్‌కు టికెట్లు ఎంచుకునే సమయంలో పలు ట్యాబ్‌ల సమాచారాన్ని తీసుకుని సమాధానం ఇస్తుంది. జెమినీ వివిధ గూగుల్ సేవలతో కూడా కనెక్ట్ అవుతుంది. జీమెయిల్, మ్యాప్స్, కాలెండర్, యూట్యూబ్ వంటి యాప్స్‌తో కలిసి పనిచేసి సందర్భానికి అనుగుణంగా సమాధానాలు ఇస్తుంది. ఉదాహరణకు క్రోమ్ సైడ్‌బార్‌లోనే జెమినీ సహాయంతో ఒక ఇమెయిల్‌ను టైప్ చేసి నేరుగా పంపించవచ్చు. అలాగే యూట్యూబ్ వీడియోను సారాంశంగా చెప్పమని అడిగితే ప్రధాన అంశాలను టైమ్‌స్టాంప్‌లతో చూపిస్తుంది. మీ రోజువారీ షెడ్యూల్ గురించి చెప్పడం లేదా మీటింగ్‌లను షెడ్యూల్ చేయడంలో కూడా సహాయపడుతుంది.
వివరాలు
"నానో బనానా 2" నేరుగా ఉపయోగించవచ్చు
ఇక క్రోమ్ కోసం జెమినీలో గూగుల్ "నానో బనానా 2" (Nano Banana 2) జనరేటివ్ ఏఐ టూల్‌ను కూడా నేరుగా ఉపయోగించవచ్చు. దీని ద్వారా చిత్రాలను మార్పులు చేయడం సాధ్యమవుతుంది.ఉదాహరణకు మీరు ఫర్నిచర్ కొనుగోలు చేసే సమయంలో మీ గదికి సంబంధించిన ఫోటోను అప్లోడ్ చేసి,కొత్త వస్తువు ఆ గదిలో ఎలా కనిపిస్తుందో జెమినీ ద్వారా చూడవచ్చు.
వివరాలు
అడ్రస్ బార్‌లో పేజ్ టూల్స్ ఐకాన్ రూపంలో..
డెస్క్‌టాప్‌తో పాటు భారత్‌లో క్రోమ్ ఫర్ ఐఓఎస్ (iOS)లో కూడా జెమినీ సపోర్ట్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు గూగుల్ తెలిపింది. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చినప్పుడు అడ్రస్ బార్‌లో పేజ్ టూల్స్ ఐకాన్ రూపంలో కనిపిస్తుంది. ఈ ఏడాది జనవరిలో గూగుల్ అమెరికాలోని AI Pro, AI Ultra వినియోగదారుల కోసం బ్రౌజర్‌ను స్వయంగా నియంత్రించి పనులు పూర్తి చేసే అధునాతన ఏజెంటిక్ సామర్థ్యాలను కూడా ప్రారంభించింది. అయితే ఆ ఫీచర్‌ను ప్రస్తుతం భారత్, న్యూజిలాండ్, కెనడా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడం లేదని కంపెనీ తెలిపింది.