Google Android Developer Policy: యాప్ డెవలపర్లకు గూగుల్ షాక్.. ఇక ఇంటి అడ్రస్ కూడా పబ్లిక్!
ఈ వార్తాకథనం ఏంటి
ఆండ్రాయిడ్ యాప్ డెవలపర్లకు గూగుల్ కీలక నిబంధనను తీసుకొస్తోంది. ఇకపై స్వతంత్ర యాప్ డెవలపర్లు తమ ఫోన్ నంబర్, చిరునామాను బహిరంగంగా వెల్లడించాల్సి ఉంటుంది. యూరోపియన్ యూనియన్ తీసుకొచ్చిన డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ (DSA) నిబంధనలకు అనుగుణంగా గూగుల్ ఈ మార్పు చేపడుతోంది. అయితే యాపిల్ మాదిరిగా యూరప్‌లోని కొన్ని దేశాలకే ఈ వివరాలను పరిమితం చేయకుండా.. ప్రపంచవ్యాప్తంగా అందరికీ కనిపించేలా గూగుల్ వెల్లడించనుంది.
వివరాలు
2027 ఫిబ్రవరి 1 వరకు గడువు
యూకే, యూరప్ చట్టాల ప్రకారం తమను తాము 'ట్రేడర్'గా ప్రకటించుకోవడానికి డెవలపర్లకు 2027 ఫిబ్రవరి 1 వరకు గడువు ఇచ్చింది.
యాప్‌ల ద్వారా క్రమం తప్పకుండా లేదా పెద్ద మొత్తంలో ఆదాయం సంపాదించే వారిని కూడా ట్రేడర్ల పరిధిలోకి తీసుకొస్తున్నట్లు గూగుల్ తెలిపింది.
అయితే వాణిజ్యేతర ప్రయోజనాల కోసం లేదా కేవలం హాబీగా యాప్‌లను రూపొందించే వారికి ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది.
వివరాలు
మార్చి 1 నుంచి ఫోన్ నంబర్, అడ్రస్ పబ్లిక్
తమను ట్రేడర్లుగా ప్రకటించుకున్న డెవలపర్ల ఫోన్ నంబర్, చిరునామా వివరాలను మార్చి 1 నుంచి బహిరంగంగా ప్రదర్శించనున్నారు.
ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే.. డెవలపర్ల పేమెంట్ ప్రొఫైల్ అడ్రస్‌గా పోస్టాఫీస్ బాక్స్ (PO Box) చిరునామాలను గూగుల్ అంగీకరించడం లేదు.
దీంతో సొంత కార్యాలయం లేని స్వతంత్ర డెవలపర్లు తమ ఇంటి చిరునామాను ఆన్‌లైన్‌లో వెల్లడించాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు.
లేదంటే రిజిస్టర్డ్ ఏజెంట్ లేదా ఇతర సేవల ద్వారా వ్యాపార చిరునామాను పొందేందుకు అదనపు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
వివరాలు
యాపిల్ విధానం వేరు..
యూరోపియన్ యూనియన్ నిబంధనలు యాపిల్‌కు కూడా వర్తిస్తున్నాయి. అయితే డెవలపర్ల వివరాలను వెల్లడించే విషయంలో ఆ సంస్థ భిన్నమైన విధానాన్ని అనుసరిస్తోంది.
సంబంధిత యూరోపియన్ దేశాల్లో మాత్రమే డెవలపర్ల చిరునామాలను ప్రదర్శిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వాటిని అందుబాటులో ఉంచడం లేదు.
అంతేకాకుండా యాపిల్ కొన్ని షరతులతో PO Box చిరునామాలను కూడా అనుమతిస్తోంది. ఆ PO Box చిరునామాకు, డెవలపర్ సాధారణ చిరునామాకు మధ్య సంబంధాన్ని నిరూపించే రసీదు లేదా బిల్లును సమర్పించాల్సి ఉంటుంది.
గూగుల్, యాపిల్ అనుసరిస్తున్న ఈ భిన్నమైన విధానాలు స్వతంత్ర యాప్ డెవలపర్లలో చర్చకు దారితీస్తున్నాయి.