ఆన్ లైన్ మోసాలను అడ్డుకునేందుకు గూగుల్ పరిచయం చేస్తున్న డిజి కవచ్
ప్రస్తుతం ప్రపంచమంతా మన చేతుల్లోకి వచ్చేసింది. స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ కారణంగా ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలిసిపోతోంది. అయితే ఈ టెక్నాలజీ కారణంగా ఆన్ లైన్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆన్ లైన్ లో అనేక మోసాలు చేసి అకౌంట్లో నుంచి డబ్బులను మాయం చేస్తున్నారు. ఇలాంటి వాటిని అడ్డుకునేందుకు గూగుల్ సంస్థ డిజి కవచ్ అనే ప్రాజెక్టును పరిచయం చేస్తోంది. గూగుల్ ఫర్ ఇండియా 2023 ఈవెంట్లో ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేసింది. దీని ప్రకారం భారతీయ వినియోగదారులు ఆన్ లైన్ మోసాలకు గురికాకుండా ఉండాలని చూస్తోంది. ఈ ప్రాజెక్టును భారతదేశంలో పైలెట్ ప్రాజెక్టుగా నిర్వహిస్తోంది. ఆ తర్వాత ఇతర దేశాలకు కూడా ఈ ప్రాజెక్టును తీసుకెళ్లనుంది.
ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ సాయంతో మోసాలను అడ్డుకునే ప్రాజెక్ట్
ట్రస్ట్ అండ్ సేఫ్టీ ఎట్ గూగుల్ APAC వైస్ ప్రెసిడెంట్ సైకత్ మిత్రా, గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్ లో మాట్లాడుతూ భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగం చేస్తున్న ఒక బిలియన్ మంది యూజర్ల భద్రత కోసం డిజి కవచ్ ప్రాజెక్టును తీసుకొస్తున్నామని అన్నారు. డిజిట్ కవచ్ అనేది ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ సాంకేతిక పద్ధతులను ఉపయోగించి ఆన్ లైన్ మోసగాళ్లను అడ్డుకుంటుందని తెలియజేశారు. ఆన్ లైన్ మోసాలను అడ్డగించడానికి ముఖ్యంగా ఆర్థిక మోసాలను అరికట్టడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) తో గూగుల్ జట్టు కట్టిందని మిత్రా తెలియజేసారు.
డిజి కవచ్ లాంచ్ తేదీ ఎప్పుడంటే?
డిజి కవచ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆన్ లైన్ లో ఆర్థిక మోసాలను అరికట్టడం. ఆర్బీఐ ఎన్పీసీఐ మొదలైన వాటితో గూగుల్ జట్టు కట్టిన తర్వాత గూగుల్ పే లో 12 వేల కోట్ల మోసాన్ని అడ్డుకుంది. ఆన్ లైన్ అపాయాలనుండి భారత పౌరులను కాపాడడానికి ఆర్బీఐ, గూగుల్ సంస్థలు చాలా పగడ్బందీగా పనిచేస్తున్నాయని మిత్ర తెలియజేశారు. డిజి కవచ్ ప్రాజెక్టు లాంచ్ తేదీని ఇంకా వెల్లడి చేయలేదు. మరికొద్ది రోజుల్లో ఈ ప్రాజెక్టు లాంచ్ కానుందని సమాచారం. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టును మరింత మెరుగులు దిద్దుతున్నారు.