Google Shopping: గూగుల్ సెర్చ్‌లోనే షాపింగ్.. కొత్త ఏఐ టూల్ లాంచ్!
ఈ వార్తాకథనం ఏంటి
ఏదైనా వస్తువు కొనాలంటే ముందుగా దాని వివరాలు తెలుసుకుని, అది ఏ ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లో లభిస్తుందో వెతకడం, అక్కడికి వెళ్లి అడ్రస్ వివరాలు నమోదు చేసి,చెల్లింపులు చేయడం చాలామందికి అలవాటే. అయితే ఇకపై ఈ మొత్తం ప్రక్రియ అవసరం లేకుండా,వెతికిన చోటే నేరుగా కొనుగోలు చేసే సౌకర్యాన్ని ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తీసుకొచ్చింది. గూగుల్ కొత్తగా ఏఐ ఆధారిత షాపింగ్ టూల్‌ను ప్రారంభించింది. దీని ద్వారా గూగుల్ సెర్చ్‌లోనే వస్తువులను ఎంపిక చేసి,కొనుగోలు పూర్తిచేసే అవకాశం లభించనుంది. ఈ కొత్త సౌకర్యం ఏఐ మోడ్‌లోని గూగుల్ సెర్చ్,అలాగే జెమినై యాప్‌లో బ్రౌజింగ్ చేసే సమయంలో అందుబాటులో ఉంటుంది. యూజర్లు తమకు నచ్చిన ప్రొడక్ట్‌ను అక్కడే సెలెక్ట్ చేసి, కొనుగోలు ప్రక్రియను పూర్తిచేయవచ్చు.
వివరాలు
భవిష్యత్తులో పేపాల్ వంటి ఇతర చెల్లింపు వ్యవస్థలు కూడా..
ఈ విధానానికి గూగుల్ 'యూనివర్సల్ కామర్స్ ప్రోటోకాల్' (UCP) అనే పేరు పెట్టింది. ఇందుకోసం షాపిఫై, వేఫెయిర్, టార్గెట్, వాల్‌మార్ట్ వంటి ప్రముఖ ఇ-కామర్స్ కంపెనీలతో పాటు వీసా, మాస్టర్‌కార్డ్ వంటి పేమెంట్ సంస్థలతో గూగుల్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రారంభ దశలో ఈ సదుపాయాన్ని అమెరికాలో ప్రవేశపెట్టింది. యూజర్లు ఏఐ సెర్చ్ లేదా జెమినై యాప్‌లో కావాల్సిన వస్తువును వెతికి, అక్కడే గూగుల్ పే ద్వారా చెల్లింపులు చేయవచ్చు. అలాగే గూగుల్ వాలెట్‌లో ముందుగా సేవ్ అయి ఉన్న షిప్పింగ్ అడ్రస్ వివరాలను నేరుగా ఉపయోగించుకోవచ్చు. భవిష్యత్తులో పేపాల్ వంటి ఇతర చెల్లింపు వ్యవస్థలను కూడా ఇందులో చేర్చే అవకాశముంది.
వివరాలు
ఇ-కామర్స్ సంస్థలు, పేమెంట్ కంపెనీలతో గూగుల్ జట్టు..
ఈ ఏఐ షాపింగ్ సౌకర్యాన్ని ఇతర దేశాల్లోనూ అందుబాటులోకి తీసుకురావాలని గూగుల్ యోచిస్తోంది. ఇందుకోసం మరిన్ని ఇ-కామర్స్ సంస్థలు, పేమెంట్ కంపెనీలతో గూగుల్ జట్టుకట్టనుంది. అదనంగా లాయల్టీ రివార్డ్స్, యూజర్లకు అనుగుణంగా కస్టమైజ్డ్ షాపింగ్ అనుభూతిని అందించే ఫీచర్లను కూడా భవిష్యత్తులో ప్రవేశపెట్టే అవకాశముందని సమాచారం.