Google: భాషా అడ్డంకులకు చెక్.. రియల్ టైమ్‌లో 70కుపైగా భాషలను అనువదించే గూగుల్ కొత్త AI ఫీచర్
ఈ వార్తాకథనం ఏంటి
టెక్నాలజీ దిగ్గజం గూగుల్ తన అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్ Gemini 3.5 Live Translateను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషలు మాట్లాడే వ్యక్తుల మధ్య సంభాషణలను మరింత సులభతరం చేయడమే దీని లక్ష్యం. ఈ కొత్త ఫీచర్ ద్వారా 70కుపైగా భాషల్లో రియల్ టైమ్‌లో వెంటనే అనువాదం అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా, అనువాదం జరిగే సమయంలో అసహజమైన విరామాలు లేకుండా, మాట్లాడే వ్యక్తి స్వరం, భావం సహజంగా ఉండేలా ఈ టెక్నాలజీ పనిచేస్తుంది. దీంతో భిన్న భాషలు మాట్లాడే వారితో సంభాషణలు మరింత సహజంగా సాగుతాయి.
వివరాలు
Gemini 3.5 Live Translate ఎలా ఉపయోగించాలి?
ఈ ఫీచర్‌ను గూగుల్ ట్రాన్స్‌లేట్ యాప్‌లో ఆండ్రాయిడ్, iOS వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు. హెడ్‌ఫోన్స్‌తో పాటు, ఆండ్రాయిడ్ ఫోన్లలో నేరుగా ఫోన్ ఇయర్‌పీస్ ద్వారానే లైవ్ ట్రాన్స్‌లేషన్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా, గూగుల్ మీట్‌లో కూడా ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటివరకు ఐదు భాషలకు మాత్రమే పరిమితమైన లైవ్ ట్రాన్స్‌లేషన్ సేవను 70కుపైగా భాషలకు విస్తరించనుంది. దీంతో గ్రూప్ వీడియో కాల్స్‌లో కూడా భాషా సమస్యలు లేకుండా మాట్లాడుకునే అవకాశం లభించనుంది.
వివరాలు
ప్రస్తుతం డెవలపర్లకు పబ్లిక్ ప్రివ్యూలో..
Gemini 3.5 Live Translate ప్రస్తుతం Gemini Live API, Google AI Studio ద్వారా డెవలపర్లకు పబ్లిక్ ప్రివ్యూ రూపంలో అందుబాటులో ఉంది. ఈ టెక్నాలజీపై ప్రయోగాలు చేసేందుకు డెవలపర్లకు అవకాశం కల్పించింది గూగుల్. అయితే, వ్యాపార సంస్థలకు సంబంధించిన Google Workspace ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ప్రస్తుతం ప్రైవేట్ ప్రివ్యూ రూపంలో ఈ ఫీచర్ అందిస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి మరిన్ని వ్యాపార సంస్థలు, సాధారణ వినియోగదారులకు కూడా ఈ సేవను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
AI ఆడియోలకు SynthID వాటర్‌మార్క్..
Gemini 3.5 Live Translate ద్వారా రూపొందించే AI ఆడియోల భద్రతపై కూడా గూగుల్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ మోడల్ ద్వారా సృష్టించే ప్రతి ఆడియోకు SynthID అనే ప్రత్యేక డిజిటల్ వాటర్‌మార్క్‌ను జోడిస్తోంది. ఇది సాధారణంగా వినిపించదు కానీ, ఆ ఆడియో AI ద్వారా రూపొందించబడిందో లేదో సులభంగా గుర్తించేలా ఉంటుంది. దీంతో నకిలీ కంటెంట్ వ్యాప్తిని తగ్గించడంతో పాటు, AI సృష్టించిన సమాచారంపై వినియోగదారుల్లో విశ్వాసాన్ని పెంచేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడనుంది.