LOADING...
Telegram: పైరసీ నియంత్రణపై కేంద్రం కఠిన చర్యలు.. టెలిగ్రామ్‌కు నోటీసులు
పైరసీ నియంత్రణపై కేంద్రం కఠిన చర్యలు.. టెలిగ్రామ్‌కు నోటీసులు

Telegram: పైరసీ నియంత్రణపై కేంద్రం కఠిన చర్యలు.. టెలిగ్రామ్‌కు నోటీసులు

వ్రాసిన వారు Moogati Shabari
Jul 04, 2026
04:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆన్‌లైన్ మెసేజింగ్ వేదికల్లో భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌కు అధికారిక నోటీసులు జారీ చేసింది. కాపీరైట్ చట్టాలను ఉల్లంఘిస్తూ సినిమాలు, ఇతర డిజిటల్ కంటెంట్‌ను ప్రచారం చేస్తున్న ఛానళ్లు, గ్రూపులు, పోస్టులపై తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా, ఇప్పటివరకు చేపట్టిన చర్యలపై పూర్తి వివరాలతో 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని టెలిగ్రామ్‌ను ఆదేశించింది. పైరసీకి సంబంధించిన కంటెంట్‌ను వీలైనంత త్వరగా తమ వేదిక నుంచి తొలగించాలని సూచించింది.

వివరాలు

అలా చేయడం క్రిమినల్ నేరం..

కాపీరైట్ ఉల్లంఘన అనేది కేవలం సివిల్ వివాదం మాత్రమే కాకుండా, క్రిమినల్ నేరంగా కూడా పరిగణించబడుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా టెలిగ్రామ్ ద్వారా పైరసీ సినిమాలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు చెందిన కంటెంట్ విస్తృతంగా షేర్ అవుతున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. అదేవిధంగా, సినిమా నిర్మాతలు, ఓటీటీ సంస్థలు, దర్యాప్తు సంస్థలు తమ ఫిర్యాదులను నమోదు చేసుకునేందుకు టెలిగ్రామ్‌లో ఎలాంటి గ్రీవెన్స్ పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేసిందో వివరించాలని కూడా కేంద్రం కోరింది.

వివరాలు

మెటాను ఆదేశించిన కేంద్రం..

ఇటీవల నిర్వహించిన నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలు టెలిగ్రామ్ ద్వారా లీక్ అయ్యాయన్న ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో, కొద్ది రోజుల పాటు ఈ మెసేజింగ్ యాప్ సేవలను దేశంలో నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల అనంతరం ఇప్పుడు అధికారికంగా నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు, చిన్నారులపై లైంగిక దుర్వినియోగాన్ని ప్రోత్సహించేలా ఉన్న ప్రకటనలు వెలువడడం, అలాగే సైబర్ మోసాల ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇన్‌స్టాగ్రామ్, మెటా సంస్థలకు కూడా నోటీసులు పంపింది. వివాదాస్పద ప్రకటనలపై పూర్తి వివరణ ఇవ్వాలని మెటాను కేంద్రం ఆదేశించింది.

Advertisement